గీతోపనిషత్తు -306
🌹. గీతోపనిషత్తు -306 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 20 - 3 📚
🍀 20-3. కోరికలు - ఆరాధకులు వారి స్వభావమును బట్టి అనేకానేకమగు కోరికలతో దైవమును ప్రార్ధించుచు నుందురు. అసురు లొక రకముగ కోరుచుందురు. దేవతలు మరొక రకముగ కోరుచుందురు. భోగభాగ్యములు, కీర్తిని, ఆరోగ్యమును, ఆయుషును, బలమును, వీర్యమును, విద్యను, వంశాభివృద్ధిని, రక్షణమును- ఇట్లెన్నియో విషయములను అన్ని సంప్రదాయముల వారును ఏదో ఒక విధముగ కోరుచునే యుందురు. 🍀
20. త్రైవిద్యా మాం సోమపా: పూతపాపా యథైరిష్ట్యా స్వర్గతిం ప్రార్థయంతే |
పుణ్యమాసాద్య సురేంద్రలోక మశ్నంతి దివ్యానివి దేవభోగాన్ ||
తాత్పర్యము : స్వర్గప్రాప్తిని వేడుకొనుచు, మూడు వేదము లధ్యయనము చేయువారు, సోమపానము కొరకై సోమయజ్ఞము చేసినవారు, పుణ్యకర్మలు చేసినవారు, పై విధముగ నన్ను పూజించినవారు సురేంద్ర లోకమును చేరి, దివ్యమగు భోగములను అనుభవించు చున్నారు.
వివరణము : ధర్మమార్గమున పై విధముగ అర్ధకామములను పొంద వచ్చును. అట్లే సోమపానము చేయవచ్చును. అట్లే యజ్ఞముల ద్వారా, పుణ్య కార్యములద్వారా సుఖ సంతోషములను పొందవచ్చును. సురేంద్ర లోకమును గూడ పొంది దివ్యమగు భోగములను కూడ పొందవచ్చును. ఇట్లు దైవప్రార్ధన ద్వారా ఇచ్ఛా జ్ఞాన క్రియల ద్వారా దైవానుగ్రహము పొంది, సృష్టి యందు అనేక విధములగు భోగములు పొందవచ్చును. ఈ శ్లోకము ద్వారా దైవము ఎవరికేది లభించినను తన అనుగ్రహముననే లభించు చున్నదని తెలియజేయు చున్నాడు.
తానే కర్తనని జీవుడు భావించినను, నిజమునకు అతని యందు కాలానుసారము సంకల్ప మేర్పడుట, తదనుగుణ జ్ఞానము లభించుట, క్రియాబలము సంప్రాప్తించుట, ఇత్యాదివన్నియు అతని యందలి ఈశ్వరుని బలము చేతనే జరుగుచున్నవి. ఇట్లు సృష్టియందు తానే కామధేనువని, తానే కల్పవృక్షమని, తనను ప్రార్ధించుట వలన కాలము, త్రిశక్తులు అనుకూలమై కోరికలు సిద్ధించునని తెలియజేయు చున్నాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
14 Jan 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment