గీతోపనిషత్తు -314


🌹. గీతోపనిషత్తు -314 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 22 -3 📚


🍀 22-3. అభియుక్తుడు - సచేతనముల యందు, అచేతనములందు కూడ ఉన్నది ఈశ్వరుడే. ఇట్టి భావన స్థిరపడ వలెను. ఈశ్వరుడు కాని దేదియు సృష్టియం దేమియు లేదని నిశ్చయముగ తెలియవలెను. పని ఈశ్వరుడు, పనిముట్టు ఈశ్వరుడు. తనతో సహకరించువాడు ఈశ్వరుడు. సహకరించని వాని రూపమున గూడ ఈశ్వరుడే యున్నాడు. 🍀

22. అనన్యా శ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే |
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహా మ్యహమ్ ||

తాత్పర్యము : అనన్యచింతనము, పరిఉపాసనము, నిత్య అభియుక్తత ఏ జనులైతే నిర్వర్తింతురో అట్టివారి యోగ క్షేమము లను నేను వహించుచున్నాను.

వివరణము : ఉన్నదీశ్వరుడే అయినను, జీవులు దానిని ఈశ్వరునిగ చూడక మరొక దృష్టితో చూచుదురు. తల్లి, తండ్రి, గురువు, తాత, తాతమ్మ, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధువులు, మిత్రులు, తెలిసినవారు, తెలియనివారు- అందరి యందు ఉన్నదీశ్వరుడే. సచేతనముల యందు, అచేతనములందు కూడ ఉన్నది ఈశ్వరుడే. ఇట్టి భావన స్థిరపడ వలెను. ఈశ్వరుడు కాని దేదియు సృష్టియం దేమియు లేదని నిశ్చయముగ తెలియవలెను.


తన యందు, తన పరిసరముల యందు ఈశ్వరుడే అనేక రూపములతోను, నామములతోను ఉన్నాడని తెలియవలెను. దినచర్య అంతయు ఈశ్వర దర్శనమున సాగిపోవలెను. పని ఈశ్వరుడు, పనిముట్టు ఈశ్వరుడు. తనతో సహకరించువాడు ఈశ్వరుడు. సహకరించని వాని రూపమున గూడ ఈశ్వరుడే యున్నాడు. ఇట్లు దినమంతయు ఈశ్వర దర్శనమునకే ప్రయత్నించవలెను. కనపడిన పురుగు, పాము, పక్షి, వృక్షము, జంతువు, మనిషి- ఇట్లేమీ కనిపించినను ఈశ్వరుడే ఇట్లున్నాడని తెలియవలెను.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


30 Jan 2022

No comments:

Post a Comment