🌹 . శ్రీ శివ మహా పురాణము - 512 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 43
🌻. శివుని అద్భుత లీల - 4 🌻
అపుడు మేనక యొక్క ఆ మాటను విని ఆమెను ఒక ఆట ఆడించదలచిన నీవు ఇట్లు పలకితివి: పార్వతీ పతి ఈతడు కాడు. ఈతడు కేశవుడు, హరి (37). ఈయన శంకరుని సర్వకార్యములకు అధికారి, శంకరునకు ప్రియుడు. కావున పార్వతీ పతియగు శివుడు ఈయనకంటె అధికుడు, శ్రేష్ఠుడు అని ఎరుంగుము (38). ఆయన యొక్క శోభను వర్ణించుటకు నాకు శక్తి లేదు. ఓ మేనా!ఆయనయే బ్రహ్మాండములన్నింటికి ప్రభువు, సర్వేశ్వరుడు, స్వరాట్ (39) నారదుని ఈ మాటను విని మేనా దేవి పార్వతిని గురించి శుభకరురాలు, మహాభాగ్యవతి, గొప్ప సంపద గలది, మూడు కులములకు సుఖమును కలిగించునది అగునని తలపోసెను(40) ప్రసన్నమగు ముఖము గలదై ఆమె ఆనందముతో నిండిన మనస్సుతో తన భాగ్యము అధిక మని అనేక పర్యాయములు వర్ణిస్తూ ఇట్లు పలికెను(41)
మేన ఇట్లు పలకెను-
పార్వతి పుట్టుటచే నేనీనాడు అన్ని విధములా ధన్యురాలనైతిని. ఈనాడు పర్వత రాజు కూడ ధన్యుడైనాడు, నా సర్వము మిక్కిలి ధన్యమైనది (42) నేను గొప్ప కాంతి గల దేవనాయకుల నెవరెవరిని చూచితినో, వారందరికీ ప్రభువగు శివుడు ఈమెకు భర్త కాగలడు(43) ఆ ప్రభువును ఈమె పొందుటను చూడగలిగిన భాగ్యమును గాని, ఈమె యొక్క భాగ్యమును గాని వర్ణించుటకు వంద సంవత్సరముల లైననూ చాలదు(44).
బ్రహ్మ ఇట్లు పలికెను -
ప్రేమతో నిండిన మనస్సు గల ఆ మేన ఇట్లు పలుకుచుండగానే, అద్భుతమగు లీలలను ప్రకటించే రుద్ర ప్రభుడు విచ్చేసెను (45). వత్సా! ఆయన యొక్క అద్భుతములగు గణములు మేన యొక్క గర్వము నడంచగలవి.ఆయన మాయాలేపము లేనిది, వికారములు లేనిది యగు తన స్వరూపమును ప్రదర్శించెను (46). ఓ నారదమునీ! ఆయన వచ్చుటకు గాంచిన నీవు అపుడు మిక్కిలి ప్రీతితో మేనకు ఆ పార్వతీ పతిని చూపించి ఇట్లు పలికితివి ( 47).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
30 Jan 2022
No comments:
Post a Comment