శ్రీ శివ మహా పురాణము - 506
🌹 . శ్రీ శివ మహా పురాణము - 506 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 42
🌻. పెళ్లి వారికి ఎదురేగుట - 1 🌻
బ్రహ్మ ఇట్లు పలికెను-
సర్వ వ్యాపి యగు ఈశ్వరుడు తన నగరము యొక్క శివార్లకు వచ్చి యున్నాడని విని పర్వత రాజగు హిమవంతుడు మిక్కిలి ఆనందించెను (1). అపుడాతడు ఈశ్వరునితో మాటలాడుటకై పర్వతములను, మరియు బ్రాహ్మణులను సంభారములనిచ్చి పంపించెను (2). హిమవంతుడు భక్తితో నిండిన మనస్సు గలవాడై ప్రాణప్రియుడగు ఈశ్వరుడు దర్శించుట కొరకై తన భాగ్యమును ప్రశంసిస్తూ గొప్ప భక్తితో స్వయముగా ఎదురేగెను (3). అపుడు హిమవంతుడు దేవ సేనను చూచి విస్మయమును పొందెను. 'నేను ధన్యుడను ' అని తలపోయుచూ ఆతడచట ఎదురేగెను (4).
దేవతలు హిమవంతుని పరివారమునుచూచి మిక్కిలి విస్మయమును పొందిరి. దేవతలు మరియు పర్వతులు పరమానందమును పొందిరి (5). ఓ మునీ! పర్వతుల మహాసేన దేవతల పెద్ద సేనతో కలిసి తూర్పు పడమర సముద్రముల కలయిక వలె భాసిల్లెను (6). ఆ దేవతలు, పర్వతులు ఒకరితో మరియొకరు కలసి పరమానందమును పొంది కృతార్థులమైతి మని భావించిరి (7).
అపుడు హిమవంతుడు ముందుగా శివుని చూచి ప్రణమిల్లెను. పర్వతములు, బ్రాహ్మణులు అందరు సదాశివునకు నమస్కరించిరి (8). వృషభము నధిష్ఠించి యున్నవాడు, ప్రసన్నమగు ముఖము గలవాడు, అనేకములగు ఆభరణములతో అలంకరింపబడిన వాడు, దివ్యమగు అవయవముల కాంతిచే ప్రకాశింప చేయబడిన దిక్కులు గలవాడు (9). అతి సూక్ష్మమగు దారములతో నేసిన మంచి పట్టు వస్త్రముతో శోభిల్లు దేహము గలవాడు, మంచి రత్నములతో ప్రకాశించే శిరస్సు గలవాడు, స్వచ్ఛమగు కాంతులతో నవ్వు చున్నవాడు (10),
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
18 Jan 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment