*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
సేకరణ : ప్రసాద్ భరధ్వాజ
*ప్రథమ సంపుటము*
*🌻. ఉపోద్ఘాతము - 1 🌻*
ఇది అష్టాదశ మాహాపురాణాలలో ఒకటి. అగ్నిరూపుడైన శ్రీ మహావిష్ణువు నుండి ఆవిర్భవించడం చేత దీనికి "అగ్ని మహా పురాణము" అనే పేరు వచ్చినది.
అగ్నిదేవుడు వసిష్ఠునకు చెప్పిన ఈ పురాణాన్ని వ్యాసుడు ఆయన నుండి (వసిష్ఠుని నుండి) గ్రహించి తన శిష్యుడైన సూతునికి బోధించాడు. అగ్ని పురాణంలో 15000 శ్లోకాలున్నవని భాగవతంలోను, 16000 శ్లోకాలున్నవని మత్స్యపురాణంలోను చెప్పబడి ఉన్నది.
శ్లోక సంఖ్య12000 అని అగ్నిపురాణం లోనే 272వ అధ్యాయంలోనూ, 15000 అని చివరి అధ్యాయంలోను చెప్పబడి ఉన్నది. వాస్తవంలో ఉన్న శ్లోకాల సంఖ్య మాత్రం 11457 అయితే దీనిలో కొన్ని గద్య భాగాలు ఉన్నాయి. వాటిని 32 అక్షరాల శ్లోకాలుగా భాగించి లెక్క పెటితే దాదాపు 1000 శ్లోకాలు పెరగవచ్చును.
383 అధ్యాయాల ఈ మహాపురాణంలో పరాపర విద్యలకు సంబంధించిన అన్ని విషయాలు ఉన్నవనీ, అందుచేత ఒక విధంగా ఇది విజ్ఞాన సర్వస్వం అనీ అక్కడక్కడ చెప్పబడింది.
ఈ పురాణంలో మొత్తం 50 ప్రధాన విషయాలు చెప్పబడినట్లుగా చివరి అధ్యాయంలో ఉన్నది. "సర్గశ్చ ప్రతిసర్గశ్చ" ఇత్యాది పురాణ లక్షణం ప్రకారం ఈ పురాణంలో కూడా సృష్టి, అవాంతర సృష్టి లేదా ప్రళయము, దేవాదుల వంశాలు, మన్వంతరాలు, రాజవంశాలు అనే ఐదు విషయాలు ఉన్నాయి అని చెప్పినా ఈ విషయాలు అసంపూర్ణంగానే కనబడతాయి.
ఈ పురాణం వ్యాసరచితమైనదనే సంప్రదాయం ఉన్నది కాని ఆధునికులు మాత్రం అనేకమైన ఆంతరంగిక ప్రమాణాలను పురస్కరించుకొని దీని రచన క్రీ. శ. 700-900 సంవత్సరాల కాలంలో జరిగినట్లు భావిస్తున్నారు.
వైష్ణవ పాంచరాత్రము, భగవద్గీత మొదలైనవి పొందు పరచటం చేత ఈ పురాణానికి వైష్ణవచ్ఛాయ కల్పించడం జరిగింది. కృష్ణుని నారాయణునిగా, విష్ణువునుగా పూజించ వలెనని దీనిలో ప్రతిపాదింపబడింది.
అగ్ని విష్ణువుగాను, కాలాగ్నిగాను, రుద్రుడుగాను ప్రారంభాధ్యాయములలో వర్ణింపబడినాడు. "విష్ణువు, అగ్ని అనేవి ఒక దేవత యొక్క రెండు రూపాలు. ఈ పురాణంలో విష్ణువే అగ్నిగా స్తుతింపబడినాడు" అని 174వ అధ్యాయంలో చెప్పబడింది.
అగ్ని విష్ణువు యొక్క రూపాంతరమే. సర్వ పాపాలను దహించ కలిగిన ఈ అగ్నిని ధ్యానించి, పూజించి, స్మరించి, స్తుతించాలి. అయితే ఈ పురాణంలో శైవాగమానికి సంబంధించిన విషయాలు, శివలింగపూజ, తాంత్రిక పూజా విధానాలు కూడా చెప్పబడి ఉన్నాయి.
సశేషం....
🌹🌹🌹🌹🌹
#అగ్నిపురాణం #శ్రీమదగ్నిమహాపురాణం #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
No comments:
Post a Comment