మైత్రేయ మహర్షి బోధనలు - 69
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 69 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 55. కృషి కర్మ 🌻
సహకారము, సోదరభావము ఉండవలెనని, ఇది కరవగు చున్నదని ప్రతి ఆధ్యాత్మిక సంస్థయందు సభ్యులు వాపోవుచుందురు. ఈ వాపోవుట తల వాచిపోవుట వరకు జరుగును. కాని పరిష్కారము మాత్రము లభింపదు. సహకారము, సోదరభావము కోరినంత మాత్రమున లభింపవు. మానవునికి మొదటినుండి కోరుట యందే ఆసక్తి గాని, కోరిన దానిని పొందుటకు వలసిన క్రమశిక్షణ, దీక్ష, మనోనియతి, వాజ్నియతి ఉండవు. కోరినంత మాత్రమున ఏదియు లభింపదు. కోరిక ఫలించుటకు నిర్దిష్టమగు కార్య క్రమమును శ్రద్ధతో నిర్వర్తింపవలెను. అది చేయక ఊరక కోరి ఫలమేమి? శాంతి కావలెనని కోరుదురు. సంపద, సమృద్ధి కావలెనని కోరుదురు. కీర్తి కావలెనని కోరుదురు. ఆరోగ్యము కావలెనని కోరుదురు. మోక్షమును కూడ కోరుదురు. కోర్కెను తీవ్రము, తీవ్రతరము కూడ చేయుదురు.
కోరిక తీవ్రతరమగుటచే ఉద్రిక్తత ఏర్పడును గాని, పరిష్కారము రాదు. ఏమి కావలెనో తెలిసిన మానవుడు, దానినెట్లు పొందవలెనో తెలుసుకొనవలెను. తగువిధముగ తనను తాను నియంత్రించుకొన వలెను. క్రమశిక్షణ పాటించుచు ఆత్మ నియంత్రణకు లొంగియుండ వలెను. నిర్వర్తింపవలసిన కర్తవ్యమును దీక్షతో దీర్ఘకాలము అనుస రించవలెను. సూర్యచంద్రాదులు, పంచభూతములు, సృష్టిలోని సమస్త ప్రజ్ఞలు ఇట్లు క్రతుబద్ధముగ జీవించుచున్నవి. నిరంతర కృషి చిన్నతనమునుండి అభ్యాసము కావలెను. ఆ కృషి జీవితపు విలువలను గూర్చి ఉండవలెను. ఈ ప్రాథమిక సూత్రము నవలంబింపక ఏమి చేసినను నిష్ప్రయోజనము.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
06 Feb 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment