గీతోపనిషత్తు -316


🌹. గీతోపనిషత్తు -316 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 22 -5 📚


🍀 22-5. అభియుక్తుడు - చూడగలిగిన వారికి సమస్తము దైవము. ఇట్టి అపరిమితము, విశాలమగు చింతన ఆవశ్యకమని భగవానుడు బోధించుచున్నాడు. అట్టి అనన్య చింతన గలవానికి అన్నిట, అంతట అనునిత్యము దైవము గోచరించుచునే యుండును. అట్టివాడు పరి ఉపాసకుడు. ఉపాసనమందు పూర్ణస్థాయికి చేరినవాడు. ఈ విధముగ సాధన చేయువాడు నిత్యము ఈశ్వరునితో కూడి యుండును. అభియుక్తుడై యుండును. విభక్తుడు కాక యుండును. అట్లు అభియుక్తుడైన వాడు దైవమువలెనే పూర్ణుడగును. అతని నుండి దివ్య సంకల్పము, దివ్య జ్ఞానము, క్రియ వ్యక్త మగు చుండును. 🍀

22. అనన్యా శ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే |
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహా మ్యహమ్ ||

తాత్పర్యము : అనన్యచింతనము, పరిఉపాసనము, నిత్య అభియుక్తత ఏ జనులైతే నిర్వర్తింతురో అట్టివారి యోగ క్షేమము లను నేను వహించుచున్నాను.

వివరణము : రాముడే దైవమను కొనుట, శివుడే దైవమనుట, గణపతియే దైవమనుట, సూర్యుడే దైవమనుట, లలితయే దైవమనుట, విష్ణువే దైవమనుట అవివేకము. అట్టి రూపములందు, నామము లందు దైవమున్నాడు కాని, వాటికే పరిమితమై దైవము లేడు. చూడగలిగిన వారికి సమస్తము దైవము. ఇట్టి అపరిమితము, విశాలమగు చింతన ఆవశ్యకమని భగవానుడు బోధించుచున్నాడు. అట్టి అనన్య చింతన గలవానికి అన్నిట, అంతట అనునిత్యము దైవము గోచరించుచునే యుండును. అట్టివాడు పరి ఉపాసకుడు.

అనగా ఉపాసనమందు పూర్ణస్థాయికి చేరినవాడు. అట్టి వానికి లోపల బయట కూడ దైవమే గోచరించుచు నుండును. ఇతరములు గోచరింపవు. పై విధముగ సాధన చేయువాడు నిత్యము ఈశ్వరునితో కూడి యుండును. అభియుక్తుడై యుండును. విభక్తుడు కాక యుండును. అట్లు అభియుక్తుడైన వాడు దైవమువలెనే పూర్ణుడగును. దైవము పూర్ణుడు. అతనితో నిత్యము అభియుక్తుడైన వాడు కూడ పూర్ణుడే అగును. అట్లు పూర్ణముతో కూడి పూర్ణుడు కాగా, అతని నుండి దివ్యసంకల్పము, దివ్యజ్ఞానము, క్రియ వ్యక్త మగు చుండును. కనుక ఈ శ్లోకము సాధనకు పరాకాష్ఠ.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


03 Feb 2022

No comments:

Post a Comment