రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 43
🌻. శివుని అద్భుత లీల - 6 🌻
నారదుడిట్లు పలికెను -
ఓ మునీ! నీవు ఆమెతో 'ఓ సుందరీ! శివుని సేవకులను చూడుము, శివుని కూడ చూడుము' అని పలికి ఆమెకు రుద్ర గణములను వ్రేలితో చూపించితివి (57). ఓ మునీ! భూత ప్రేతాది గణములను లెక్కలేనంత మందిని చూచి ఆ మేనక తత్‌క్షణమే భయముచే కంగారు పడెను (58).
వారి మధ్యలో నిర్గుణుడు, సకల గుణాభిరాముడు, వృషభమునధిస్ఠించిన వాడు, అయిదు మోములు గలవాడు, ముక్కంటి, భస్మను అలంకరించుకున్నవాడు (59), జటా జూటధారి, చంద్రుని శిరస్సుపై ధరించినవాడు, పది చేతులవాడు, కపాలమును చేత బట్టిన వాడు, వ్యాఘ్ర చర్మమే ఉత్తరీయముగా గలవాడు, చేతి యందు పినాకమనే శ్రేష్ఠమగు ధనస్సు గలవాడు (60), శూలమును ధరించినవాడు, వికృతమగు ఆకారముతో గజిబిజిగా నుండువాడు, గజ చర్మమును వస్త్రముగా ధరించిన వాడు అగు శంకరుని చూచి పార్వతి యొక్క తల్లి భయపడెను (61).
అశ్చర్యముతో భయముతో వణకుతున్నది, భ్రమించిన బుద్ధి గలది అగు ఆమెకు 'ఈయనయే శివుడు' అని నీవు వ్రేలితో చూపుతూ పలికితివి (62). నీ ఆ మాటను విని దుఃఖమును సహింపజాలక ఆ మేన గాలిచే పెకలించబడిన తీగవలె వెంటనే నేలపైబడెను (63).
'ఓసి మొండి పట్టుదల గల పార్వతీ! ఏమి ఈ వికృతరూపము! నేను మోసపోతిని' అని పలికి ఆ మేనక అచట క్షణములో మూర్ఛను పొందెను (64). అపుడు సుఖురాండ్రు ఆమెకు వివిధములగు ఉపచారములను చేయగా, ఆ హిమవత్పత్నియగు మేన మెల్లగా తెలివిని పొందెను (65).
శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహితయందు పార్వతీ ఖండలో శివుని అద్భుత లీలలను వర్ణించు నలుబది మూడవ అధ్యాయము ముగిసినది (43).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
03 Feb 2022
No comments:
Post a Comment