గీతోపనిషత్తు -322


🌹. గీతోపనిషత్తు -322 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 24-2 📚


🍀 24-2. తత్త్వదర్శనము - మన ముండుట యనగా దైవ ముండుటయే. ఏ దిక్కునకు పోయినను అన్ని దిక్కులయందు దైవమే యుండును. ఇట్లు దైవమునందుండి, దైవ మాధారముగ జీవుడు తన్నుతాను పరితృప్తిని గావించుకొను కార్యమున ఇమిడి కృషి సలుపును. ఎవ్వరును దైవ ప్రాకారము దాటి పోలేరు. అందుండియే దానిని చూడలేకపోవుట విచిత్రమగు అజ్ఞానము. దైవము నుండి అభివ్యక్తమగుచున్న ప్రకృతి పొరలలో దైవమునే చూచుట యథార్థమగు దర్శనము. 🍀

24. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ |
న తు మామభిజానంతి తత్త్యనాత శ్చ్యవంతి తే ||

తాత్పర్యము : వివిధ దేవతా రూపములను ఆరాధనము చేయువారు తత్త్వ దర్శనము చేయజాలకున్నారు. సర్వయజ్ఞములకును ప్రభువును, భోక్తను నేనే అని తెలియలేకున్నారు. కనుక వారు జారిపోవుచున్నారు.

వివరణము : నిజమునకు మనమున్నది దైవమునందే. దైవము నందే చరించుచున్నాము. మన ముండుట యనగా దైవ ముండుటయే. ఏ దిక్కునకు పోయినను అన్ని దిక్కులయందు దైవమే యుండును. ఇట్లు దైవమునందుండి, దైవ మాధారముగ జీవుడు తన్నుతాను పరితృప్తిని గావించుకొను కార్యమున ఇమిడి కృషి సలుపును. ఎవ్వరును దైవ ప్రాకారము దాటి పోలేరు. అందుండియే దానిని చూడలేకపోవుట విచిత్రమగు అజ్ఞానము. నీటియందున్న చేప నీటిని వెదకుకొనుచున్నట్లుగ, దైవమందున్న జీవుడు దైవమును వెదకికొను చుండును.

అన్నిట, అంతట, లోపల, బయట సమస్తము నిండియున్నవాని యందుండి దైవమును గుర్తింప లేకుండుటకు కారణము దైవతత్త్యము నెరుగలేక పోవుటయే. “తత్త్యనమామ్ అభిజానంతి" తత్త్వపరముగ నన్ను తెలియ లేకున్నారు అని దైవము పలుకు చున్నాడు. కనుక దర్శన స్పర్శన భాషణాది అనుభూతులను చెందలేకున్నారు. దైవమును చూడక ఇతరములను చూచుట వలన లోకములోనికి జారిపోవుట సంభవించు చుండును. దైవము నుండి అభివ్యక్తమగుచున్న ప్రకృతి పొరలలో దైవమునే చూచుట యథార్థమగు దర్శనము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


15 Feb 2022

No comments:

Post a Comment