శ్రీ శివ మహా పురాణము - 520
🌹 . శ్రీ శివ మహా పురాణము - 520 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 44
🌻. మేన యొక్క మంకు పట్టు - 6 🌻
బ్రహ్మ ఇట్లు పలికెను -
హిమవత్పత్ని యగు మేన పార్వతి యొక్క ఆ మాటను విని మిక్కిలి కోపించి బిగ్గరగా ఏడ్చి ఆమె శరీరమును పట్టుకొని (61), పళ్ళను పట పట కొరుకుచూ, మిక్కిలి దుఃఖముతో మహాక్రోధముతో తన కుమార్తె యగు పార్వతిని పిడికిళ్లతో, మరియు మోచేతులతో కొట్టెను (62), ఓ మునీ! కుమారా! అక్కడ ఉన్న ఋషులు, నీవు, మరియు ఇతరులు ఆ పార్వతిని ఆమె చేతి నుండి విడిపించి అచటినుండి దూరముగా తీసుకొని పోయిరి (63). అపుడామె వారిని అనేక విధములుగా కోపించి వారికి మరల నిందావచనమును వినిపించు చున్నదై ఇట్లు పలికెను (64)
మేన ఇట్లు పలికెను -
నేను మేనను. దుష్టమగు పట్టుదల గల ఈ పార్వతిని ఏమి చేయుదునో చెప్పనా? ఈమెకు తీవ్రమగు విషమునిచ్చెదను. లేదా, నూతిలో తోసివేసెదను. సందేహము లేదు (65). లేదా, ఈ కాళిని శస్త్రములతో ముక్కలు ముక్కలు నరికివేసెదను. లేదా, నా కుమార్తె యగు ఈ పార్వతిని సముద్రములో ముంచి వేసెదను (66). లేదా, నేనే రేపటి లోపులో నిశ్చితముగా దేహత్యాగము చేసెదను. నా కుమార్తె యగు దుర్గను వికృతాకారుడగు శంభునకీయను (67). ఈ దుష్టురాలు భయంకరాకారుడగు ఎటువంటి వరుని సంపాదించినది? ఈమె నన్ను, హిమవంతుని, మరియు మా కులమును ఆపహాస్యము పాలు చేసినది (68).
ఈతనికి తల్లి లేదు. తండ్రిలేడు, సోదరుడు లేడు, బంధువు లేడు, స్వగోత్రీకుడైననూ లేడు, అందమగు రూపము లేదు, ఇల్లు లేదు, ఏమీలేదు (69). వస్త్రము లేదు, భూషణములు లేవు, పరిచారకులెవ్వరూ లేరు. ఈయనకు వామనము లేదు, శుభకర్మలు లేవు, వయస్సు లేదు, ధనము లేదు (70). పవిత్రత లేదు, విద్యలేదు. దుఃఖమును కలిగించే ఆయన దేహము ఎట్లున్నదియో? సుమంగళయగు నా కుమార్తెను ఏమి చూసి ఈయనకు ఈయదగును? (71).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
15 Feb 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment