గీతోపనిషత్తు -324


🌹. గీతోపనిషత్తు -324 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 24-4 📚


🍀 24-4. తత్త్వదర్శనము - ఒక్కటియే పది రకములుగ అవతరించినపుడు అన్నిటియందును ఆ ఒకటిని చూచుట తత్త్వజ్ఞానము. పది రకములుగ చూచుట, ఒకటి అంగీకరించి ఇతరములను నిరాకరించుట మార్గము కాదు. భిన్నత్వ మందు ఏకత్వము దర్శించుటే జ్ఞానము. బ్రహ్మమే కృష్ణుడుగను, త్రిమూర్తులుగను, సమస్త దేవతా ప్రజ్ఞలుగను, సమస్త సృష్టిగను, సమస్త జీవుల మూలముగను యున్నాడని తెలియనంత కాలము దైవమును గూర్చిన అల్లరులే యుండును గాని అవగాహన యుండదు. 🍀

24. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ |
న తు మామభిజానంతి తత్త్యనాత శ్చ్యవంతి తే ||

తాత్పర్యము : వివిధ దేవతా రూపములను ఆరాధనము చేయువారు తత్త్వ దర్శనము చేయజాలకున్నారు. సర్వయజ్ఞములకును ప్రభువును, భోక్తను నేనే అని తెలియలేకున్నారు. కనుక వారు జారిపోవుచున్నారు.

వివరణము : నన్ను తత్త్వపరముగ తెలియకపోవుట వలన మానవులు చిక్కులు పొందుచున్నారు. ఆకాశము నుండి భూమిపై వర్షము పడినపుడు అన్ని ఖండముల యందు వర్షపు నీరు నదులై పారుచుండును. అన్నిటి యందున్నది వర్షపునీరే. కాని గంగ యని, గోదావరి యని, కృష్ణ యని, కావేరి యని, నైలునది యని, అమేజాను నదియని, మిసి సిపి, మిస్సోరియన్, రైను, రోను అని కొన్ని వేలాది నదులుగ భూమి పై పడిన నీరు పిలువబడుచున్నది. ఒక్కటియే పది రకములుగ అవతరించినపుడు అన్నిటియందును ఆ ఒకటిని చూచుట తత్త్వజ్ఞానము. పది రకములుగ చూచుట, ఒకటి అంగీకరించి ఇతరములను నిరాకరించుట మార్గము కాదు. భిన్నత్వ మందు ఏకత్వము దర్శించుటే జ్ఞానము. అట్టి జ్ఞానము లభ్య మగుటకు దైవము యొక్క స్వభావ స్వరూపముల నెరుగవలెను.

అట్లెరుగక, భజన చేయువారు ఊరకే భూమిపై చప్పుడు చేయుచు నుందురు. రాముడెవరో తెలియక రామభజన చేయుటవలన రాముడు లభింపడు. బ్రహ్మమే రాముడుగను, బ్రహ్మమే కృష్ణుడుగను, త్రిమూర్తులుగను, సమస్త దేవతా ప్రజ్ఞలుగను, సమస్త సృష్టిగను, సమస్త జీవుల మూలముగను యున్నాడని తెలియనంత కాలము దైవమును గూర్చిన అల్లరులే యుండును గాని అవగాహన యుండదు. ఇది ఈ శ్లోకము యొక్క పరమార్ధము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


19 Feb 2022

No comments:

Post a Comment