🌹 . శ్రీ శివ మహా పురాణము - 522 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 44
🌻. మేన యొక్క మంకు పట్టు - 8 🌻
బ్రహ్మ ఇట్లు పలికెను -
అపుడు మేన పరిపరి విధముల విలపించి వారితో నిట్లనెను: ఉగ్రరూపుడగు కైలాస పతికి నేను కుమార్తెను ఈయను (83). సిద్ధులైన మీరందరు ప్రపంచ వ్యవహారములో ప్రవేశించి ఒక్కటిగా జతగూడి ఈమె యొక్క సుందరరూపమును వ్యర్థము చేయుటకు నడుము కట్టినారు. కారణమేమి? (84)
ఓ మునీ! అచట ఆమె ఇట్లు పలుకగా, నేను, దేవతలు, సిద్ధులు, ఋషులు, మానవులు అందరు ఆశ్చర్యమగ్నుల మైతిమి (85). ఇంతలో ఆమె గట్టి మొండి పట్టుదలను గూర్చి వినిన శివ ప్రియుడగు విష్ణువు వెంటనే వచ్చి ఇట్లు పలికెను (86).
విష్ణువు ఇట్లు పలికెను -
నీవు పితృదేవతల అనుంగు మానస పుత్రివి. సద్గుణవతివి. హిమవంతుని భార్యవు. మీ కులము సాక్షాత్తు బ్రహ్మగారి నుండి ప్రవర్తిల్లుటచే ఉత్తమమైనది (87). నీకు అటువంటి వారు పరిచారకులు. నీవీ లోకములో ధన్యురాలవు. నేనేమి చెప్పగలను? నీవు ధర్మమునకు ఆధారమై యున్నావు. నీవు ధర్మమును ఎట్లు విడిచి పెట్టుచున్నావు? (88) దేవతలు గాని, ఋషులు గాని, బ్రహ్మగాని, నేను గాని విరుద్ధముగా పలుకుచున్నామా? నీవే ఆలోచించుకొనుము (89).
నీవు శివుని యెరుంగవు. ఆయన సగుణుడు, నిర్గుణుడు కూడా. సుందరాకారుడ, వికృతాకారుడు కూడా. ఆయన అందరికీ ఆరాధ్యుడు. సత్పురుషులు పొందే గతి ఆయనయే (90). మూల ప్రకృతి యగు ఈశ్వరీదేవిని ఆయనయే సృష్టించినాడు. తరువాత ఆయన ఆమె ప్రక్కన ఉండునట్లు పురుషోత్తముని సృష్టించినాడు (91).
వారి నుండియే నేను, బ్రహ్మ జన్మించితిమి. తరువాత లోకమునకు హితమును చేయు రుద్రుడు తాను స్వయముగా గుణములను రూపమును స్వీకరించి అవతరించినాడు (92). ఆ తరువాత శంకరుని నుండి వేదములు, దేవతలు, కనబడే ఈ సమస్త జగత్తు. చరాచరణ ప్రాణులు, ఈ సర్వము ఉద్భవించినవి (93).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
19 Feb 2022
No comments:
Post a Comment