గీతోపనిషత్తు -326
🌹. గీతోపనిషత్తు -326 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 25-2 📚
🍀 25-2. పరమపదము - ఎదురుగ నున్నది దైవమే. దూరముగ నున్నది దైవమే. లోపల ఉన్నది దైవమే. వెలుపల నున్నది దైవమే. అంతయు దైవమే. తాను కూడ దైవము యొక్క వ్యక్తరూపమే. ఇట్టి భావనతో సతతము జీవించు వారికి క్షణక్షణము, అనుక్షణము దైవమును దర్శించుటయే యుండును. ఇదియే అనన్యభావన, అనన్యచింతన, నిత్య అభియుక్తత మరియు పరిఉపాసన కూడ అయి యున్నది. ఇట్టివారు నిజమగు రాజయోగులు. 🍀
26. యాంతి దేవవ్రతా దేవాన్ పితన్ యాంతి పితృవ్రతాః |
భూతాని యాంతి భూతేజ్యా యాంతి మద్యాజినోలి పి మామ్ ||
తాత్పర్యము : దేవతల నారాధించువారు దేవతాలోకములు చేరుదురు. పితృదేవతల నారాధించువారు పితృలోకము చేరుదురు. భూతప్రేతముల నారాధించువారు ఆ లోకములను చేరుదురు. నన్నారాధించు వారు నన్ను చేరుదురు.
వివరణము : దైవమును అన్ని కాలములందు, అన్ని దేశములందు, అన్ని రూపములందు, అన్ని నామములయందు, అన్ని సన్నివేశ ముల యందు దర్శించుచు నుండుటయే మార్గము. ఎదురుగ నున్నది దైవమే. దూరముగ నున్నది దైవమే. లోపల ఉన్నది దైవమే. వెలుపల నున్నది దైవమే. అంతయు దైవమే. తాను కూడ దైవము యొక్క వ్యక్తరూపమే. ఇట్టి భావనతో సతతము జీవించు వారికి క్షణక్షణము, అనుక్షణము దైవమును దర్శించుటయే యుండును.
ఇదియే అనన్యభావన, అనన్యచింతన, నిత్య అభియుక్తత మరియు పరిఉపాసన కూడ అయి యున్నది. ఇట్టివారు నిజమగు రాజయోగులు. వారు దైవమునందే చరించుచు, దైవమును దర్శించుచు, వినుచు, సేవించుచు యుందురు. దేహత్యాగానంతరము అట్టి అపరిమితమగు తత్త్వమును స్థితిగొందురు. ఇట్లు సర్వవ్యాపకము అగు తత్త్వము నారాధింపక ఏదో ఒక రూపమును, ఒక నామమును ఆశ్రయించి ఆరాధించువారు తదనుగుణమైన లోకములు చేరుదురు. ఇది సహజమే గదా! కాముకులు కామలోకము చేరుదురు. అధర్మము నాశ్రయించు వారు నరకమును చేరుదురు. భోగభాగ్యములకై దైవము నారాధించువారు భోగలోకములు చేరుదురు. ధర్మము నాచరించు వారు ధర్మముతో కూడిన క్షేత్రములను చేరుదురు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
23 Feb 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment