🌹. గీతోపనిషత్తు -328 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 26-1 📚
🍀 26-1. భక్తి శ్రద్ధలు - భక్తి యున్న చోట హృదయము నిర్మలమై యుండును. మనసు పరిశుద్ధముగ నుండును. ఆరాధన యందనురక్తి యుండును. అట్టి అనురక్తి ఎదుటి జీవునికి ప్రీతి కలిగించును. ఆ జీవుని యందలి దైవమునకు కూడ ప్రీతి కలిగించును. ఇట్లు జీవుల యందలి దైవమునకు ప్రీతి కలిగించు రీతిలో ప్రవర్తించుట వలన దైవము ప్రీతి చెందును. ఈశ్వరుడు కోరినది భక్తి ధనమే గాని ధనము కాదు. ఈశ్వరుని బలముతో కూడ మెప్పింపలేము. భక్తి బలమే నిజమగు బలము. దాని వలన ఈశ్వరుడు ప్రసన్నుడగును. అట్లే ఎట్టి విద్యలతోను కూడ దైవమును మెప్పించలేము. భక్తి విద్య యొక్కటే దైవమును మెప్పింప గలదు. 🍀
26. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి |
తదహం భక్త్యుపహృత మశ్నామి ప్రయతాత్మనః ||
తాత్పర్యము : భక్తిపూర్వకముగ నాకు ఒక పత్రమును గాని, పుష్పమును గాని, ఫలమును గాని, నీటిని గాని ఎవరందించినను నేను స్వీకరించి అనుగ్రహింతును.
వివరణము : ఆరాధనకు గాని, అనుసంధానమునకు గాని, యోగ సాధనకు గాని ప్రధానముగ వలసినది భక్తి. భక్తి యున్న చోట హృదయము నిర్మలమై యుండును. మనసు పరిశుద్ధముగ నుండును. ఆరాధన యందనురక్తి యుండును. అట్టి అనురక్తి ఎదుటి జీవునికి ప్రీతి కలిగించును. ఆ జీవుని యందలి దైవమునకు కూడ ప్రీతి కలిగించును. ఇట్లు జీవుల యందలి దైవమునకు ప్రీతి కలిగించు రీతిలో ప్రవర్తించుట వలన దైవము ప్రీతి చెందును. ఎవ్వరికైనను తాగు నీరిచ్చినపుడు, ఒక ఫలము నిచ్చునపుడు, ఒక పుష్పము నిచ్చినపుడు లేక ఒక తులసీ దళమో, మారేడు దళమో ఇచ్చినపుడు ఆ జీవుని యందలి ఈశ్వరుని దర్శించుచు జీవేశ్వరులకు ప్రీతికలుగునట్లుగ అందించవలెను. అట్లందించి నపుడు జీవుడే కాక అందలి ఈశ్వరుడు కూడ ప్రసన్నుడగును.
భక్తితో సమర్పించుట అనగా ఎదుటి జీవుల యందలి ఈశ్వరుని కూడ దర్శనము చేయుచు, వినయముతో, శ్రద్ధతో రెండు హస్తములతో అందించవలెను. అట్టి శ్రద్ధ, వినయము, భక్తి లోపించినపుడు ఎంత విలువైన వస్తువు లందించినప్పటికి ఈశ్వరుడు ప్రీతి చెందడు. నిజమునకు ఈశ్వరునకు వలసిన దేమియు లేదు. ఎంత ధనముతో నైనను ఈశ్వరుని మెప్పించ లేము. ఈశ్వరుడు కోరినది భక్తి ధనమే గాని ధనము కాదు. ఈశ్వరుని బలముతో కూడ మెప్పింపలేము. భక్తి బలమే నిజమగు బలము. దాని వలన ఈశ్వరుడు ప్రసన్నుడగును. అట్లే ఎట్టి విద్యలతోను కూడ దైవమును మెప్పించలేము. భక్తి విద్య యొక్కటే దైవమును మెప్పింపగలదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
27 Feb 2022
No comments:
Post a Comment