గీతోపనిషత్తు -330
🌹. గీతోపనిషత్తు -330 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 26-3 📚
🍀 26-3. భక్తి శ్రద్ధలు - దైవము కోరునది శ్రద్ధాభక్తులే. అతడు జీవుల హృదయము నందున్నాడు గనుక జీవులకు చేయు సేవ రూపమున తానందు కొనుచు నున్నాడు. కనుక భక్తులు, జ్ఞానులు, యోగులు, విరాగులు కూడ జీవుల రూపమున నున్న దైవమును సేవించి అనుగ్రహమును పొంద వలెను. ఇట్టి ప్రయత్నము నిరంతరము సాగుచు నుండవలెను. జీవ సేవా కార్యము నిర్వర్తింప బడుచున్న కొద్ది ఋజువర్తనము, ధర్మా చరణము, బుద్ధి ప్రకాశము, నిరహంకారము ఆవిష్కరింపబడు చుండవలెను. అంతఃకరణ శుద్ధిలేని వానికి దైవానుగ్రహము ఎండమావి యందలి జలమువలె యుండును. 🍀
26. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి |
తదహం భక్త్యుపహృత మశ్నామి ప్రయతాత్మనః ||
తాత్పర్యము : భక్తిపూర్వకముగ నాకు ఒక పత్రమును గాని, పుష్పమును గాని, ఫలమును గాని, నీటిని గాని ఎవరందించినను నేను స్వీకరించి అనుగ్రహింతును.
వివరణము : దైవము కోరునది శ్రద్ధాభక్తులే. అతనికి శ్రద్ధాభక్తులు ఎట్లు సమర్పింప గలము? అతడు జీవుల హృదయము నందున్నాడు గనుక జీవులకు చేయు సేవ రూపమున తానందుకొనుచు నున్నాడు. కనుక భక్తులు, జ్ఞానులు, యోగులు, విరాగులు కూడ జీవుల రూపమున నున్న దైవమును సేవించి అనుగ్రహమును పొంద వలెను. ఇట్టి ప్రయత్నము నిరంతరము సాగుచు నుండవలెను. ఈ శ్లోకమున సాధకులు “ప్రయతాత్మనః" అని దైవము ప్రయత్నము చేయువాని గూర్చి పలికెను. ఆ పదము ప్రయత్న శీలుని గూర్చి ఉద్దేశింపబడినది. ఆ పదమునకు నిర్మల అంతఃకరణుడని కూడ అర్ధమున్నది.
కేవలము నిత్యము జీవుల సేవ చేయుట మాత్రము చాలదు. అట్టి ప్రయత్నము చేయువాని అంతఃకరణము నిర్మలమగు చుండవలెను. అంతఃకరణము లనగా లోమనస్సు, బుద్ధి, అహంకారము. జీవుల సేవ నిత్యము చేయుచున్నప్పుడు పై మూడును నిర్మలము కావలెను. కేవలము బహిఃకరణములతో చేయు సేవ నిరుపయోగము. జీవ సేవా కార్యము నిర్వర్తింప బడుచున్నకొద్ది ఋజువర్తనము, ధర్మా చరణము, బుద్ధి ప్రకాశము, నిరహంకారము ఆవిష్కరింపబడు చుండవలెను. అంతఃకరణ శుద్ధిలేని వానికి దైవానుగ్రహము ఎండమావి యందలి జలమువలె యుండును. నిర్మల అంతఃకరణుడై, భక్తిశ్రద్ధలతో ఎదుటి జీవియందు ఈశ్వర దర్శనము చేయుచు ఏమిచ్చినను ఈశ్వరుడు సంతోషింప గలడు. ఇది సత్యము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
03 Mar 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment