గీతోపనిషత్తు -332


🌹. గీతోపనిషత్తు -332 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 27-2 📚


🍀 27-2. ఈశ్వరార్పణము - ఈశ్వరుడే కర్తయని, జరుగునది, జరగనిది కూడ అతడి సంకల్పమే యని తన కార్యములను, తనను కూడ ఈశ్వరునికి సమర్పించుకొనుట నిజమగు పరిష్కారము. ఇట్టి భావన యందు జీవించువానికి కర్మఫల మంటదు. ఫలమెట్టి దైనను అది కూడ ఈశ్వరార్పితముగనే భావింపవలెను. “నాహంకర్త, శ్రీహరికర్త" అను సూక్తి జీవితమున సత్యమై నిలువవలెను. నిజమునకు జీవుని ఉనికి దేవుని ఉనికియే. జీవుని ఎరుక దేవుని ఎరుకయే. 🍀

27. యత్కరోషి యదశ్నాసి యజ్జు హోషి దదాసి యత్ |
యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణమ్ ||

తాత్పర్యము : ఏ పని చేసినను, ఏమి భుజించినను, ఎట్టి హోమములు గావించినను, ఎట్టి దానము లొనర్చినను, ఎట్టి తపస్సులు చేసినను నా కర్పణము చేయుము.

వివరణము : ఒకనాడు పోషకమగు ఆహారము మరియొకనాడు విషము కావచ్చును. ఇది ఇట్లు జరుగవలెను అని ఎవ్వరును శాసించలేరు. జరుగుచున్నది చూచుచు “ఓహో ఇట్లు జరుగుచున్నది గదా!" అని గమనించుటయే గాని చేయునదేమియు ఉండదు. సర్వము ఈశ్వరాధీనమని తెలిసి తన బుద్ధికి తోచినది, ఈశ్వరార్పితముగ దినమంతయు గడుపుటయే అర్పణ మార్గము లేక శరణాగతి మార్గము. ఉదయము లేచినది మొదలు రాత్రి పరుండు వరకు జీవు డనేక కార్యములు తల పెట్టి నిర్వర్తించుచు నుండును. అందు కొన్ని ఫలించును, కొన్ని ఫలించవు. కనుక జీవునకు తాను కర్త కాదని తెలియవలెను.


ఈశ్వరుడే కర్తయని, జరుగునది, జరగనిది కూడ అతడి సంకల్పమే యని తన కార్యములను, తనను కూడ ఈశ్వరునికి సమర్పించు కొనుట నిజమగు పరిష్కారము. ఇట్టి భావన యందు జీవించువానికి కర్మఫల మంటదు. ఫలమెట్టి దైనను అది కూడ ఈశ్వరార్పితముగనే భావింపవలెను. “నాహంకర్త, శ్రీహరికర్త" అను సూక్తి జీవితమున సత్యమై నిలువవలెను. నిజమునకు జీవుని ఉనికి దేవుని ఉనికియే. జీవుని ఎరుక దేవుని ఎరుకయే. అతనియందలి ప్రాణములు, పంచ భూతములు, కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, సప్త ధాతువులతో కూడిన శరీరము అన్నియు దైవమిచ్చినవే. తాను కూడ దైవము యొక్క అంశయే.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


07 Mar 2022

No comments:

Post a Comment