గీతోపనిషత్తు -339
🌹. గీతోపనిషత్తు -339 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 29-2 📚
🍀 29-2. అతీత స్థితి - సమాధి స్థితి ననుభవించినవారే పరమాత్మ నెరిగినవారు. తాముండుట యనగా దైవమే తానుగ నుండుట. తామున్నట్లే పశుపక్ష్యాదులు, వృక్షములు, ఖనిజములు కూడ యున్నవి. ఉండుట విషయములో అందరును సమానమే. ఉండుట లేకుండుట అనునవి చైతన్యమాదిగా గల లోకములకు, జీవులకు గాని పరమాత్మకు కాదు. స్థితి భేదము లన్నియు చైతన్యమునకే. నేను సముడను అని దైవము పలుకుచున్నాడు. తానందరి యందు రాగద్వేషములు లేక సమముగ నున్నాడని ప్రకటించుచున్నాడు. భగవంతుని ఈ ఉనికి ఆకళింపైన బ్రహ్మజ్ఞుడు కూడ అందరి విషయమున సమముగనే యుండును. 🍀
సమో హం సర్వభూతేషున మే ద్వేష్యో స్తి న ప్రియః |
యే భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహమ్ II 29
తాత్పర్యము : సమస్త భూతములయందు నేను సమముగ నున్నాను. నాకు ద్వేషింపతగు వారుగాని, ప్రేమింపతగు వారు గాని ప్రత్యేకముగ నెవ్వరును లేరు. వారియందున్న నన్ను సేవించు వారిని నేనునూ సేవింతును.
వివరణము : ఉండుట లేకుండుట అనునవి చైతన్యమాదిగా గల లోకములకు, జీవులకు గాని పరమాత్మకు కాదు. స్థితి భేదము లన్నియు చైతన్యమునకే. ఇట్లు సదా తటస్థుడుగ నుండు దైవముతో అనుసంధానము చెందుట సమాధి స్థితిని సూచించును. సమాధి స్థితి ననుభవించినవారే పరమాత్మ నెరిగినవారు. ప్రతివారును తామున్నామని భావింతురు. తాముండుట ననగానేమో పరిశీలింపవలెను. తాముండుట ఎట్లు సంభవించి నదో విచారించవలెను. తాముండుట యనగా దైవమే తానుగ నుండుట. తామున్నట్లే పశుపక్ష్యాదులు, వృక్షములు, ఖనిజములు కూడ యున్నవి. ఉండుట విషయములో అందరును సమానమే. చీమ, దోమ నుండి చతుర్ముఖ బ్రహ్మవరకు ఉండుట సమానము. భేద మంతయు చైతన్యపరముగ నుండును.
చతుర్ముఖ బ్రహ్మ చైతన్యము అతి విస్తారము. చీమ, దోమల విస్తారము అత్యంత పరిమితము. “సమోహం" అనగా సమ అహం - నేను సముడను అని దైవము పలుకుచున్నాడు. తానందరి యందు రాగద్వేషములు లేక సమముగ నున్నాడని ప్రకటించుచున్నాడు. ఈ ఉండుటలో ఎట్టి భేదములేదు. భగవంతుని ఈ ఉనికి ఆకళింపైన బ్రహ్మజ్ఞుడు కూడ అందరి విషయమున సమముగనే యుండును. ఉనికియే ప్రధానముగా నుండు తత్త్వమును స్థాణువని, శివమని పలుకుదురు. అదియే సత్యము. ఆ సత్య మాధారముగనే చైతన్య ముద్భవించి సృష్టి క్రియను గావించును. అట్టి శివునకు సురాసుర భేదము లేదు. సుర పక్షపాతము లేదు. అట్టి సత్యమును శివమును సుందరమును ఆశ్రయించి జీవించువారు పరమాత్ముని వలనే లోకాతీతులై వర్ధిల్లుదురు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
21 Mar 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment