మైత్రేయ మహర్షి బోధనలు - 82


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 82 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 68. వింత బోధ 🌻


ఫకీరు ఒకడు బంతిని విసరుచు ప్రతిసారి ధ్యేయమును కొట్టుచున్నాడు. ఆశ్చర్య పడుచు అతని చుట్టూ వున్న పిల్లలు మరల బంతిని తెచ్చి ఫకీరు కిచ్చుచున్నారు. అతడు బంతిని విసిరి ధ్యేయమును కొట్టుట, పిల్లలు బంతిని తెచ్చి అతని కిచ్చుట అవిశ్రాంతముగ రెండు గంటలు సాగినది. ఫకీరునకు విసరుటలో విసుగులేదు. ధ్యేయమును చేరుటలో అశ్రద్ధ లేదు. పిల్లలకు ఉత్సాహములో విసుగులేదు. ఈ కార్యమును చాల సేపు నుండి చూచుచున్న ఒక పెద్దమనిషి ఫకీరును చేరి “మీరు జ్ఞానవంతులని తెలిసి మీనుండి జ్ఞానము పొందుటకై చాల సేపటి నుండి వేచి యున్నాను. మీ ఆటను విరమించి నాకేమైన జ్ఞానబోధను అనుగ్రహించవలెనని ఎదురు చూచుచున్నాను” అని పలికినాడు. అది వినిన ఫకీరు ఫక్కున నవ్వి ఇట్లనెను.

“ఎదురు చూచుటేల? చూచినచో సరిపోయెడిది గదా! ఇంత సేపు నేను చేసినది జ్ఞాన బోధయే. చేసిన జ్ఞానబోధను నీవు చూడలేదు. విసిరిన ప్రతి బంతి శ్రద్ధగ విసిరితిని. మరల అది నా చేతికే అందింపబడెను. అందలి రహస్యము గమనించితివా? నీ చేతి యందున్నది శ్రద్ధగ సద్వినియోగము చేయుము. అది మరల మరల నిన్నే చేరుచు నీ నుండి అవిరామముగ లోకహితము జరుగును. ఉన్నది సద్వినియోగము చేయుటయే నేను నీకందించిన జ్ఞానబోధ. ఇక బయలు దేరుము. వాచాలత్త్వమునకు నాకు సమయము లేదు.” వచ్చిన జ్ఞానాభిలాషి అబ్బురపడెను. అవగాహన పొందెను.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


02 Mar 2022

No comments:

Post a Comment