గీతోపనిషత్తు -345
🌹. గీతోపనిషత్తు -345 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 31 📚
🍀 31-2. అనన్య భక్తి - అనన్యభక్తి కారణముగ ఎప్పుడునూ భగవంతునితో కూడియుండుట సంభవించును. తాను భగవంతుని యందు పూర్ణముగ చేరి యుండుట చేత భగవంతు డతని యందు పూర్ణముగ వసించి, ఇచ్ఛా జ్ఞాన క్రియలను నడుపుచు నుండును. భగవత్సంకల్పమే తన సంకల్పముగను, భగవద్ జ్ఞానమే తన జ్ఞానముగను, భగవత్ శక్తియే తన క్రియాశక్తిగను వ్యక్తమగు చుండును. ఎందరో అనన్యభక్తి మార్గమున దైవమును చేరిరి. 🍀
31. క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వ చ్ఛాంతిం నిగచ్ఛతి |
కౌంతేయ ప్రతిజానీహి న మే భక్తః ప్రణశ్యతి |
తాత్పర్యము : దురాచారుడు సాధువగుట, ధర్మాత్ము డగుట, శాశ్వతమగు శాంతిని పొందుట- అనన్య భక్తిచే శీఘ్రముగ జరుగును. గుర్తుంచుకొనుము. నా భక్తుడు ఎన్నడునూ చెడడు.
వివరణము : అనన్యభక్తి క్రమముగ ప్రేమగ మారును. కబీర్దాసు, సూరదాసు వంటి మహాభక్తులు అనన్యభక్తి కారణముగనే అనేకానే కము లగు అద్భుతమగు కార్యములను నిర్వర్తించి చూపినారు. పుట్టు గ్రుడ్డియగు సూరదాసు కన్నులున్న వానివలెనే ప్రపంచమున తిరుగాడినాడు. అనన్యభక్తి కారణముగ ఎప్పుడునూ భగవంతునితో కూడియుండుట సంభవించును. తాను భగవంతుని యందు పూర్ణముగ చేరి యుండుట చేత భగవంతు డతని యందు పూర్ణముగ వసించి, ఇచ్ఛా జ్ఞాన క్రియలను నడుపుచు నుండును. భగవత్సంకల్పమే తన సంకల్పముగను, భగవద్ జ్ఞానమే తన జ్ఞానముగను, భగవత్ శక్తియే తన క్రియాశక్తిగను వ్యక్తమగు చుండును.
తాను దైవము నందుండగ, తన నుండి దైవము చూపుచున్న లీలలకు పరవశుడై, తన్మయము చెందుచు విశ్వమును మరచి విశ్వజుని యందు వర్తించును. ఎందరో అనన్యభక్తి మార్గమున దైవమును చేరిరి. పరమ పదమున శాశ్వత స్థానము గొనిరి. వారికి మోక్షమును గూర్చిన చింతయే యుండదు. వారున్న స్థితియే మోక్షము. వారికి ప్రత్యేకించి సుఖశాంతులను గూర్చిన ప్రయత్నము లుండవు. వారెచ్చట యున్న అచ్చటే శాంతి యుండును. వారి రూపముననే సత్యము, సుఖము ఉండును. అన్ని విషయము లందాసక్తి గలవారు, వాని కొరకై ప్రయత్నించు వారు సుఖశాంతులకు దూరమైపోవుచు నుందురు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
02 Apr 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment