గీతోపనిషత్తు -348
🌹. గీతోపనిషత్తు -348 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 32 📚
🍀 32-2. తత్వదర్శనులు - జీవుడు సహజముగ స్వయం ప్రకాశకుడు. అతడు దైవము నుండి ఏర్పడినవాడే. అతని చుట్టును మూడు గుణములచేత, ఐదు భూతములచేత, ఎనిమిది ఆవరణలు ఏర్పడి యున్నవి. ఆవరణ లెట్లున్నను అందున్నది జీవుడే. జీవులందరును దేవుని అంశలే. వారి కేర్పడిన దేహములు బట్టి వారి అర్హత, అనర్హత నిర్ణయము చేయుట దురాచారమే గాక, దురహంకారము కూడ. 🍀
32. మాం హి పార్థ వ్యపాశ్రిత్య యే2 పి స్యుః పాపయోనయః I
స్త్రియో వైశ్యాస్తథా శూద్రాస్తే పి యాంతి పరాం గతిమ్ ॥
తాత్పర్యము : అనన్యభక్తి మార్గమున నన్నాశ్రయించు వారు నిశ్చయముగ నన్నే పొందుచున్నారు. అట్టివారు స్త్రీలైనను, వైశ్యులైనను, శూద్రులైనను అంతర మేమియు ఉండదు.
వివరణము : జీవులందరును దేవుని అంశలే. వారి కేర్పడిన దేహములు బట్టి వారి అర్హత, అనర్హత నిర్ణయము చేయుట దురాచారమే గాక, దురహంకారము కూడ. ఎందరో స్త్రీలు, వైశ్యులు, శూద్రులు, నిమ్నజాతుల వారు, ఆటవికులు కూడ పరమపదమును పొందిన ఉదంతము లున్నవి. మాంసపు దుకాణమును నిర్వర్తించెడి ధర్మవ్యాధుడు బ్రహ్మర్షియై నిలచినాడు. అడవిజాతికి చెందిన రత్నాకరుడను బందిపోటు దొంగ వాల్మీకి మహర్షియై నిలచినాడు. ఎందరో స్త్రీలు బ్రహ్మత్వమును పొందిన కథ లున్నవి.
ఇటీవలి కాలముననే బ్రహ్మ రూపిణిగ జిల్లెళ్లమూడి గ్రామము నందు అమ్మ ఎందరినో తరింప జేసినది. సూరదాసు, కాళిదాసు, కనకదాసు వంటి భక్తులు సూటిగ దైవమును చేరిన కథ లున్నవి. జీవుడు సహజముగ స్వయం ప్రకాశకుడు. అతడు దైవము నుండి ఏర్పడినవాడే. అతని చుట్టును మూడు గుణములచేత, ఐదు భూతములచేత, ఎనిమిది ఆవరణలు ఏర్పడి యున్నవి. ఆవరణ లెట్లున్నను అందున్నది జీవుడే.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
08 Apr 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment