గీతోపనిషత్తు -353
🌹. గీతోపనిషత్తు -353 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 33 📚
🍀 33-3. కూడి యుండుట - "ఈ లోకము అనిత్యము, అసుఖము. కావున నన్ను సేవించుచు నాతో యుండుము" అని తెలిపినాడు. లోకము నందలి లోకులు సంబంధములు బంధములు పెంచుకొను చుందురు. నా ఇల్లాలని, నా కుమారుడని, నా బంధువులని, నా మిత్రులని భావించుచు సేవ చేయుచు నుందురు. కాని ఋణము తీరిన వెంటనే సంబంధములు అదృశ్యమగును. ఈ సంబంధములు శాశ్వతము కాదని తెలిసియు జీవుడారాటపడుచు సుఖమును కోల్పోవును. మనమీ లోకము నుండి నిష్క్రమించి మరల ప్రవేశించునపుడు ఆత్మ సంబంధము లేమియు గుర్తురావు. అంతయు నూతనముగ నుండును. 🍀
కిం పునరాహ్మణాః పుణ్యా భక్తా రాజర్షయస్తథా |
అనిత్య మసుఖం లోక మిమం ప్రాప్య భజస్వ మామ్ || 33
తాత్పర్యము : అన్ని జాతులవారును అనన్యభక్తి మార్గమున నన్ను పొందగలిగినపుడు పుణ్యాత్ములగు బ్రాహ్మణులు, భక్తులగు రాజర్షులు కూడ నన్ను పొందగలరని వేరుగ చెప్పనవసరము లేదు గదా! ఈ లోక మనిత్యము. ఇందు సుఖము లేదు. కావున నన్ను సేవించుచు ఆనందము పొందుము.
వివరణము : ఈ శ్లోకమున మరియొక సత్యమును దైవము ప్రకటించి నాడు. "ఈ లోకము అనిత్యము, అసుఖము. కావున నన్ను సేవించుచు నాతో యుండుము" అని తెలిపినాడు. లోకము నందలి లోకులు సంబంధములు బంధములు పెంచుకొను చుందురు. నా ఇల్లాలని, నా కుమారుడని, నా బంధువులని, నా మిత్రులని భావించుచు సేవ చేయుచునుందురు. కాని ఋణము తీరిన వెంటనే సంబంధము లదృశ్యమగును. ఒకనాడాప్తులుగ నున్నవారు మరొకనాడు దూరమగుచు నుందురు. దూరమైన వారిని గూర్చిన ఆరాట ముండునే గాని, వారంతగ ప్రతిస్పందించరు.
తానిష్టపడిన వారందరును వారికిష్టమైన వారితో మెలగుచు నిరాశ, నిస్పృహ కలిగింతురు. ఈ సంబంధములు శాశ్వతము కాదని తెలిసియు జీవుడారాటపడుచు సుఖమును కోల్పోవును. సంబంధ బాంధవ్యములు నీటి మీద వ్రాతలవలె ఏర్పడుచు, అదృశ్య మగుచుండును. వాటిని గూర్చిన భావన అసుఖమునే ఇచ్చును. అంతేకాదు అవి అనిత్యములు కూడ. ఒకప్పటి తండ్రి తాతలు ఇప్పుడు లేరు. అట్లే కొంతకాలమునకు మనమీ లోకము నుండి నిష్క్రమించి మరల ప్రవేశించునపుడు ఆత్మ సంబంధము లేమియు గుర్తురావు. అంతయు నూతనముగ నుండును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
18 Apr 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment