బ్రహ్మ విద్య Braham Vidya


☘️☘️. బ్రహ్మ విద్య ☘️☘️

🍁🍁. హంస యొక్క వివరణ🍁🍁


ఈశ్వర ఉవాచ :

జీవి చాలా జన్మలందు చేసిన కర్మ ఫలితములగు సుఖదుః ఖాదులనను భవించుటకై మళ్ళీ భువిపై జన్మించి , ఈ కర్మలను తొలగించుకోలేక , మాయలోబడి మళ్ళీ జన్మకు వచ్చి కలిమాయచే మళ్ళీ ఆ పనులు చేయుచూ ఆయా కర్మల ఫలితాన్ని అనుభవిస్తారు . బ్రహ్మ మొదలగు దేవతలే గాక పరమేశ్వరుడయినా కర్మఫలితమనుభవించక తప్పదు . భూమిపై చేయు యీ పనులన్నియూ సుఖము , దుఃఖము ఒకటిగా తలంచి వీటినినాశనంచేయాలని ఆత్మనిశ్చయుడై , మంచి పనులు చెడ్డపనులు రెంటినీ చేయకుండుటచే గతకర్మలన్నియూ తగలబడిపోవును . ఎట్లాగంటే కాలిన బట్టలో ఏమీ మిగలనట్లుగా . సత్వరజో , తమోగుణములు , శరీరభోగములు , పుత్రేషణయు , జ్ఞాన మార్గములు గావు . వీటిని వీడుటయే సత్వము , అనగా జ్ఞానమునకు యోగసాధన మూలముగావున అన్ని భ్రాంతులను వీడిన తత్వబోధసాధన ఫలిస్తుంది సుమా .

పార్వతీ అనేక జన్మంబుల నుండి సంపాదించి కర్మలను వదిలించుకోలేక , వాటి ఫలితంబుగా అనేకకోట్ల జన్మలెత్తుచూ పూర్వజన్మల ఫలితములను భవించుచూ , బహుజన్మంబులజిక్కు వడునదియే ఆగామియందురు . దీనిని విడువక కలసియుండునదే సంచితమందురు . తాను చేసుకున్న కర్మతానను భవించునది ప్రారబ్ధమందురు . కావున ఈ మూడు జీవి అనుభవించుటే త్రివిధకర్మలందురు . యివి ఎట్లా నశిస్థాయంటే ?

తామరాకుకునీరంటనట్లుగా ఈ జనప్రపంచము నందుండి ఉండనట్లు జీవించు మహనీయులైన , హంసావధూత , సంయమ , యోగీశ్వరులకు సేవలు చేయుచూ అన్నవస్త్రములొసంగి రక్షించువారికి ఆ మహానుభావులు చేయు పుణ్యములు వీరులకు ప్రాప్తించి , పాపములు తొలగికర్మ విముక్తులగుదురు . అట్టి వారిని దూషించి తిరస్కరించువారికి ఆ మహనీయులకు గల దోషములు వీరలకు సంక్రమించి , వీరికి ముందుగలపాపములు కోటిరెట్లధికమై . ఆ కర్మలనను భవించుచుందురు . అట్టి దూషకుడగు దీనుడు మహానరకములనుభవించు చుండును . మరియు పార్వతీనిన్ను నన్నును సేవించిన హంసావధూత , సంయమయోగీశ్వరులైన వారికి ఎట్టిపుణ్యపాపములు చెందక నిర్మలులైనాయందు ఐక్యంబునొందియనేకమన్వంతరములుండి సుఖభోగా నందము గల బ్రహ్మము నొందెదరు . నాయందు శాశ్వతముగ నుండునట్టి వారలకు కర్మ రహితంబై , అన్ని కర్మలు కాల్చబడి భస్మంబుకాగలదనగా ఆ పార్వతి యిట్లనియే .


🌷. నధా హంసలు శరీరమందు తిరుగుదారి . వాటి రూపము , దానివలన కలుగు ఫలితములు యిప్పుడు చెప్పండి , దేహమందలి తత్వాలను ఎలా శోధించాలో ఎలా కనిపెట్టాలో చెప్పండి . ? 🌷

ఈశ్వర ఉవాచ :


కంసాలి చేతితో వాడే కత్తిర ఆకారము హంస స్వరూపము కాళ్ళు , కీళ్ళు , మూతి కలిగి ఉంటాయి . క్రిందికాలు మొదలుకొని పై ముక్కు చివర వరకు లోనా బయట 12 అంగుళాల పొడవున , ముక్కు కుడి ఎడమ రంధ్రాల ద్వారా తిరుగును యిలా తీసుకున్న 12 అంగుళాల శ్వాసలో 4 అంగుళాలు బయటకు వదిలి 8 అంగుళాలుమాత్రమే లోపలకు తీసుకుంటుంది . యిలా రేయింబవళ్ళు తక్కువ ఎక్కువలతో తిరుగుచూ , శరీరమందలి తత్వములతో కలసి ఒక్కోసమయంలో ఒక్కోరకములు ఉశ్వాస , నిశ్వాసలు , జరుగుతూ , కాలాన్ని గడుపుతూ “ దేహికి ” ఆయుః ప్రమాణము ఊపిరిని తీసుకుని విడుచు లెక్కల ప్రకారం ఉంటుంది .

24 నిముషములకొకసారి “ జీవి ” శరీరమందలి తత్వము సంచరించి మరల రెండు కనుల మధ్య ముక్కుపై భాగమున గల భ్రూమధ్యన మారి , మరల వేరుతత్వము చేరును . ఆ ప్రకారం జీవుడు తానుచేయగల బ్రహ్మవిద్యను ప్రకృతి మాయలో పడిచేయక , విరాట్ స్వరూపాన్ని చూడలేక ప్రపంచములో శరీరమే శాశ్వతమని భావించుతారు . యిది మహా అద్భుతముసుమా .

సాధకుడు భ్రూమధ్య భాగమున అనేకరకములుగా ప్రయత్నించగా , “ దేవీ నీవు సహకరించితే " శక్తి దేహానికివస్తేలో దృష్టి నిలబడుతుంది . అప్పుడు కాశీ పురమునందు ( భ్రూమధ్య ) మహాకాశాన్ని చూపట్టిన వేళాకోళముకాదు . ఈ చతుర్ధశ భువనములలో వేదాంతవిద్య సులువుకాదు సతీ . నీ సహాయం లేకపోతే సిద్ధించదు .

ఈ పక్షులు ( హంస ) ఐదు రకములు . వీటి రూపములు చాలా రకాలుగా యున్నా , ఆ రూపాన్ని పైన చూపించునొకటి చాలా రకములుగా కంటి దృష్టి నిలిపిన ఆ సుందరదృశ్యం సూటిగా కన్పడును . శ్వాసనిలగట్టి నరుడు ఏ బాధాలేక తత్వపంచకాన్ని మనసునదలచిన , ఆత్మ చేయు బోధ అనుభవాన్ని తాను పొందుతాడు . ఈ జ్ఞానాన్ని పొందటానికి కంటి చూపుకన్నా వేరే దారి లేదు . ఈ హంస ఎవరికీ దొరకదు , చూపునిలబెట్టలేకపోయినా , కన్ను చెదిరినా కావలసిన తత్వమపుడేలేకుండా పోతుంది . చూపుచూచేది దేహంలోపలనే .

మరియూ ఈ హంస ఏ నరునకు దొరుకుతుందో . అట్టి మహనీయుని చరిత్రము లోకంబులకు చిత్రముగాదోచును . ఎలాగంటే వైకృత , ప్రాకృత , సకీలకమనే ప్రాణాయామంబులచేత , ఓడ్యాణ , జాలంధర , మూలబంధములనే ఆసనములతో , ప్రాణ , అపాన , వ్యాన ఉదాన సమాన , నాగ , కూర్మ , కృకర , దేవదత్త , ధనుంజయంబుల నెడు పదివాయువులను స్వాధీనంచేసుకుని , దేహి తను జీవింపదలచినంత కాలము . యముని ఆజ్ఞమేరకు వచ్చెడి భీషణ , రోషణాకారములతో భయంకరములగు యమభటులు చేయు వాదోప వాదములను లెక్కింపక , రెండవ ఈశ్వరుని వలే చలింపక యుండినవానికి అనేక మహత్వంబులు సిద్ధించును .

అవిఏమనగా , “ అణిమాదులు ” అణిమ = అణురూపముగానుండుట . మహిమ = మహత్తులు కలిగియుండుట , గరిమ = గొప్పబరువుగా నుండుట . లఘిమ = దూదివలే తేలికగా యుండుట . ప్రాప్తి = కావలసిన వస్తువులను పొందుట . ప్రకామ్యము = కోరినదిచ్చుట . ఈశత్వము = సమస్తమునకు తానే అధికారియగుట . వశిత్వము = సమస్త భూతజాలమును వశపరచుకొనుట . దేవత్వము = ఆకాశసంచారము . యితరుల భావములు శరీర ధర్మములు తెలియబడుట = , అన్నమాట జరుగుట , ఆశ్చర్యము గొల్పు శక్తి ( కాంతి ) జరిగినది జరగనున్నది చూచుట . గాలిని భుజించుట గొప్ప బలము , యింద్రియ నిగ్రహము , యింకా అనేక మహత్వంబులు సిద్ధించును .


🙏🙏🙏🙏🙏


17 Apr 2022

No comments:

Post a Comment