హనుమాన్ జన్మదినోత్సవ శుభాకాంక్షలతో - హనుమ విశిష్టత Greetings on Hanuman Jayanti - Uniqueness Of Hanuman
🌹. హనుమాన్ జన్మదినోత్సవ శుభాకాంక్షలతో - హనుమ విశిష్టత 🌹
✍️. రామాయణం శర్మ (బద్రాచలం)
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. హనుమ - జననం - పొందిన వరాలు 🌻
హనుమంతుని తండ్రి పేరు కేసరి. అంజన ఆ కేసరి యొక్క భార్య. అంజన యొక్క కుమారుడు ఆంజనేయుడు. హనుమంతుడు, అంజనాదేవి గర్భాన - వాయుదేవుడు - శివతేజస్సును ప్రవేశపెట్టడం వలన జన్మించాడు. అందుచేత పవనతనయుడు, మారుతి నందనుడు వంటి పేర్లు కలిగియున్నాడు.
🌺. జయంతి: వైశాఖ బహుళ దశమి 🌺
🍀. హనుమ పొందిన వరాలు: 🍀
శిశువుగా ఉన్నప్పుడే, ఆకలి కలిగియున్నప్పుడు, సూర్యుని ఫలమనుకొని, పొందుటకు ఎగరడం, సూర్యుని వద్డ హనుమను చూచి, రాహువు ఇంద్రునికి ఫిర్యాదు వంటి సందర్భాలలో, ఇంద్రుడు వచ్చి వజ్రాయుధం ప్రయోగించడం సంభవించింది. అప్పుడు ఆ వజ్రాయుధం ఆంజనేయుని దౌడ(హనుమ)కు తగిలి, స్వామి నిర్జీవుడై పడిపోవడం జరిగింది. అది చూసి, వాయుదేవుడు సకల జీవరాశి నుంచి బయటకు వచ్చి సమ్మె చేశాడు. అది తెలిసిన బ్రహ్మదేవుడు, దేవతలతో వచ్చి, ఆంజనేయుని పునర్జీవితుని చేశాడు.
వాయువుకి సంతోషం కలిగించడానికీ, భవిష్యత్తులో దేవతల గొప్పకార్యాన్ని మారుతి నిర్వహించడానికీ, దేవతలందఱినీ మారుతికి వరాలిమ్మన్నాడు బ్రహ్మదేవుడు. అప్పుడు,
1. ఇంద్రుడు: బంగారు పద్మహారమునిచ్చి, హనుమ అని నామమిడి, తన వజ్రాయుధము వలన ఏ హానీ కలుగదన్నాడు.
2. సూర్యుడు: తన తేజస్సులో నూఱోవంతు ఇస్తున్నాననీ, శైశవ దశనించీ విద్యార్జన స్థితి రాగానే, సకల శాస్త్ర జ్ఞానాన్నీ కలిగిస్తాననీ, తద్వారా వాక్చతురుడు కాగలడనీ, శాస్త్రజ్ఞానమందు హనుమతో సరితూగగలవాడు మరొకడుండడనీ అన్నాడు.
3. వరుణుడు: తన పాశము వలనగానీ, జలముల వలన గానీ, లక్షల కొలది సంవత్సరాల వరకూ మృత్యుభయం ఉండకుండా వరమిచ్చాడు.
4. యముడు: తన దండము వలన మృత్యువు కలగదనీ, ఎల్లప్పుడూ ఆరోగ్యభాగ్యాలతో వర్ధిల్లుతాడనీ, యుద్ధమునందు విషాదగ్రస్తుడు కాడనీ మారుతికి వరాలొసగాడు.
5. కుబేరుడు: సమరమునందు తన గద ఆంజనేయునికి ఎట్టి ఆపదను కలిగించదన్నాడు.
6. శంకరుడు: తన వలన గానీ, శూల పాశుపతాస్త్రాది తన ఆయుధాల వలనగానీ హనుమ వధ్యుడు కాడని వరమనుగ్రహించాడు.
7. విశ్వకర్మ: తాను నిర్మించిన దివ్యశస్త్రములలో ఏ ఒక్కటైననూ రణమందు వధింపజాలదనీ, చిరంజీవి అవుతాడనీ హనుమకి వరాలిచ్చాడు.
8. బ్రహ్మ: ఏ బ్రహ్మదండం చేతనూ వధ్యుడు కాడనీ, దీర్ఘాయువనీ మారుతికి వరాలిచ్చి, వాయుదేవునితో మారుతిని గూర్చి - శత్రువులను గడగడలాడించగలడనీ, - మిత్రులకు అభయప్రదాత అవుతాడనీ, - యుద్ధంలో శత్రువులకు అజేయుడై వర్ధిల్లుతాడనీ, - కోరుకొన్న రూపాలను పొందగలడనీ, - ఇష్టానుసారంగా అంతటా - వేగంగానూ, నెమ్మదిగానూ సంచరింపగలడనీ, - చిరస్థిరకీర్తితో వర్ధిల్లగలడనీ, - యుద్ధము నందు అతడొనర్చే వీరోచిత సాహసాద్భుత కృత్యాలన్నీ రావణ సంహారానికి కారకాలవుతూ, అవి రామునకు ప్రియము గూర్చుతాయనీ, లోకాలకు రోమాంచమునూ సంతోషాన్నీ కలిగిస్తాయనీ పేర్కొన్నాడు.
ఆ విధంగా సకల వరాలూ పొందిన శిశువైన మారుతిని, వాయుదేవుడు అంజనాదేవి వద్దకు తీసుకువచ్చి, ఆమెకు అప్పగించి, వరాలగూర్చి వివరించి వెళ్ళాడు. జాంబవంతుడు హనుమ శక్తిని పొగిడి సముద్ర లంఘనం చేయించాడు.
హనుమానంజనానూను: వాయుపుత్రోమహాబలః
రామేష్ఠ: ఫల్గుణసఖః పింగాక్షో: అమిత విక్రమః
ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః
లక్ష్మణప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పహా
ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః
స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః
తస్యమృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీభవేత్
మనం కూడా స్వామిని స్తుతిస్తే సకల శుభాలూ కలిగిస్తాడు. ప్రతిరోజూ ఆరాధిస్తూ, సకల శాస్త్ర పారంగతుడూ, సర్వశక్తిమంతుడూ అయిన హనుమని సేవిద్దాం. మన జీవిత లక్ష్యాలని నెరవేర్చుకొందాం. హనుమతుడికి 5 సంఖ్య చాలా ఇష్టం. 5 ప్రదక్షిణలు చేయండి. అరటిపళ్ళు, మామిడి పళ్ళంటే చాలా ఇష్టం. వీలుంటే 5 పళ్ళు సమర్పించండి. 5 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయండి.
🌸.జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ - జై హనుమాన్ జై జై హనుమాన్ 🌸
🌹 🌹 🌹 🌹 🌹
25 May 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment