మకర సంక్రాంతి, Makar Sankranti Pongal


🌹. మకర సంక్రాంతి విశిష్టత 🌹

🍀. మకర సంక్రాంతి శుభాకాంక్షలు, Good Wishes on Makar Sankranti Pongal 🍀

ప్రసాద్ భరద్వాజ


జ్యోతిష్య శాస్త్రంలో మొత్తం 12 రాశులున్నాయి. ఇందులో సూర్యుడు ఒక్కో నెలలో ఒక్కో రాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు ఏ రాశిలో సంచరిస్తే ఆ రాశి సంక్రమణంగా వ్యవహరిస్తారు. సూర్యుడు ధనుర్ రాశిలో ప్రవేశించింది మొదలు మకరరాశిలో ప్రవేశించడం వరకూ సంక్రాంతి పండుగ దినాలు. మకర రాశిలో ప్రవేశించిన రోజు మకర సంక్రాంతి. అప్పటి వరకూ దక్షిణాయనంలో సంచరిస్తూ వస్తున్న సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించిన శుభదినం కూడా ఇది.

సూర్యుడు హిందువులకు ప్రత్యక్ష బ్రహ్మ. కాల చక్రానికి అతీతంగా సంచరిస్తూ ఉండే పరమాత్మ స్వరూపం. ఉత్తరాయనంలో సూర్యుడు ధనుర్రాశి నుంచి మకర రాశి లోకి వచ్చే రోజు మకర సంక్రమణం జరుగు రోజు. అదే మకర సంక్రాంతి. భోగి తర్వాత రోజు వచ్చేదే సంక్రాంతి.

సంక్రాంతి రోజునే శ్రీ మహా విష్ణువు అసురులను మంధర పర్వతం కింద పూడ్చారు. ధర్మస్తాపన జరిగి అధర్మమును రూపుమాపిన రోజు సంక్రాంతి.

మకర సంక్రాంతి పుష్య మాసంలో వస్తుంది. పుష్యం అనగా పోషణ శక్తి గలదని అర్థం. స్నానం దానం, పూజ అనే మూడు విధులు సంక్రాంతి పర్వదినాన నిర్వర్తించాలి. సూర్యోదయాకి ముందే నువ్వుల పిండితో శరీరాకి నలుగు పెట్టి తలంటి స్నానం చేయాలి. జాతకంలో శని వల్లే కష్టాలు కలుగుతాయి. ఆయనను శాంతింప చేయాలంటే నువ్వులు దానమివ్వాలి. వాతావరణ పరంగా చూస్తే మంచు కురిసే హేమంత ఋతువు, శీతకాలం బాధలు నివారించుకోవడానికి స్నాన జలంలో నువ్వులు కలపడం, నువ్వులు తినడం, తిలలతో దైవ పూజ అనేవి ఆచరించే విధులు. ఆయుర్వేద పరంగా చూస్తే చలికాలంలో శరీరానికి నువ్వులు మంచి చేస్తాయి. నువ్వులు ఉష్ణవర్థకమైనవే కాకుండా బలవర్ధక మైనట్టివి.

మకర సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం కావడం వల్ల పండుగలన్నంటిలోనూ ఇది విశిష్టమైనది. ఉత్తరాయణం దేవతలకు ఇష్టమైన కాలం. ఈ సమయంలో పూజ, పునష్కారాలు, యజ్ఞయా గాదులు చేసి దేవతలను మెప్పించాలి. అలా చేయడం వల్ల కోరికలు నెరవేరుతాయని పూర్వీకుల నమ్మకం.


🌹. కనుము విశిష్టత 🌹

సంక్రాంతి పండుగల్లో చివరి రోజు కనుము. కనుము కర్షకుల పండుగ. పాడి పంటలను, పశు సంపదను, లక్ష్మీ స్వరూపంగా అర్పించే రోజు. ప్రకృతి స్వరూపిణీ అయిన అమ్మ ఆరాధన విశేషమే ఈ రోజు. తెలంగాణ ప్రాంతంలో ముత్తైదువులను తమ ఇంటికి ఆహ్వాంచి, పసుపు, కుంకుమలు, నువ్వుల పిండి మొదలైనవి ఇచ్చి 'సువాసి' పూజలు చేస్తారు. ఏడాదంతా పాడిపంటలకు తోడ్పడిన పశువులకు కృతజ్ఞతలు చెప్పడాకి 'కనుము' పండుగను జరుపుకుంటారు. మనది వ్యవసాయిక దేశం కనుక మనుష్యులకే కాదు, పశు పక్ష్యాదులకు ఇది పండుగే.

మనకు ఎంతో ఆనందాన్ని, సకల సౌభాగ్యాలను, శుభములనిచ్చే సంక్రాంతి పండుగలను భక్తి ప్రపత్తులతో పూజిద్దాం, తరిద్దాం.

🌹🌹🌹🌹🌹

No comments:

Post a Comment