దేవీ నవరాత్రులు - నవ దుర్గలు సాధన - 8. మహాగౌరి మాత - మహిషాసురమర్ధిని దేవి / Worship Maa Mahagauri - Mahisasura Mardhini Devi on the 8th day of Navaratri


🌹. దేవీ నవరాత్రులు - నవ దుర్గలు సాధన - 8. మహాగౌరి మాత - మహిషాసురమర్ధిని దేవి / Worship Maa Mahagauri - Mahisasura Mardhini Devi on the 8th day of Navaratri 🌹

🍀 . ప్రసాద్ భరద్వాజ

🌻. 8. మహాగౌరి ప్రార్ధనా శ్లోకము 🌻

శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః ।
మహాగౌరీ శుభం దద్యాత్ మహాదేవప్రమోదదా ॥



🌷. 8. మహిషాసురమర్ధిని స్తోత్రము 🌷

అయి గిరినందిని నందితమేదిని విశ్వవినోదిని నందినుతే
గిరివరవింధ్య శిరోధినివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే |

భగవతి హే శితికంఠకుటుంబిని భూరికుటుంబిని భూరికృతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ||


🌷. అలంకారము - నైవేద్యం : మహాగౌరి - మహిషాసురమర్ధిని దేవి - ముదురు ఎరుపు రంగు. - బెల్లం పొంగలి


🌴. మహిమ - చరిత్ర 🌴

దుర్గామాత యొక్క ఎనిమిదవ స్వరూపానికి ‘మహాగౌరి’ అని పేరు. ఈమె పూర్తిగా గౌరవర్ణశోభిత. ఈమె గౌరవర్ణశోభలు మల్లెపూలూ, శంఖం, చంద్రులను తలపింపజేస్తాయి. ఈమె అష్టవర్షప్రాయముగలది (అష్టవర్షభవేద్గౌరీ). ఈమె ధరించే వస్త్రాలూ, ఆభరణాలూ ధవళ కాంతులను వెదజల్లుతుంటాయి. చతుర్భుజ, సింహవాహన. ఒక కుడిచేత అభయముద్రనూ, మరొక కుడి చేతిలో త్రిశూలాన్నీ వహించి ఉంటుంది. ఒక ఏడమచేతిలో డమరుకమూ, మరొక ఎడమ చేతిలో వరదముద్రనూ కలిగి ఉంటుంది. ఈ ముద్రలలో ఈమె దర్శనం ప్రశాంతంగా ఉంటుంది.

పార్వతి అవతారంలో ఈమె పరమేశ్వరుణ్ణి పతిగా పొందటానికి కఠోరమైన తపస్సును ఆచరించింది. వ్రియేఽహం వరదం శంభుం నాన్యం దేవం మహేశ్వరాత్ (నారద పాంచరాత్రము) అనేది ఈమె ప్రతిజ్ఞ. భగవంతుడైన శివుణ్ణి పరిణయమాడటానికే దృఢంగా సంకల్పించుకొన్నట్లు తులసీదాస మహాకవి పేర్కొన్నాడు.

జన్మకోటిలగి రగర హమారీ । బర ఉఁసంభు న తరహ ఉఁకుఁమారీ ॥


🌻. సాధన 🌻


కఠోర తపస్సు కారణాన ఈమె శరీరం పూర్తిగా నలుపెక్కి పోతుంది. ఈమె తపస్సునకు సంతుష్టుడైన శివుడు ప్రసన్నుడై, ఈమె శరీరాన్ని గంగాజలంతో ప్రక్షాళన గావిస్తారు. తత్ప్రభావంవల్ల ఈమె శ్వేతవర్ణశోభిత అయి విద్యుత్‌ కాంతులను విరజిమ్ముతుంటుంది. అప్పటినుండి ఈమె ‘మహాగౌరి’ అని వాసి గాంచింది.

ఇంకో కధ ప్రకారం, పుట్టుకతోనే నల్లని రంగు గల పరమేశ్వరిని ... పతి అయిన పరమేశ్వరుడు ఒకసారి పరిహాసముగా " కాళీ " అని పిలుస్తాడు. దాంతో ఆమె శివునితో పంతగించి , బ్రహ్మ గురించి కఠోర తపస్సు చేసి ... ఆ నల్లని దేహాన్ని వదిలి శివునికి దీటుగా తెల్లని ఛాయతో 'మహా గౌరి 'గా అవతరించినది.

అష్టమ శక్తియైన మహాగౌరి పూజ కరణంగా ప్రాప్తించే మహిమలు శ్రీదేవీ బహగవతంలో వర్ణించబడినవి. ఈమె నామస్మరణ చేత సత్ప్రవర్తన వైపు మనసు నడుస్తుంది. సర్వవిధ శుభంకరి - మహాగౌరి.

దుర్గా నవరాత్రోత్సవాల్లో ఎనిమిదవ రోజున మహాగౌరి ఉపాసన విధ్యుక్తంగా నిర్వహించబడుతుంది. ఈమె శక్తి అమోఘమూ, సధ్యఃఫలదాయకము.

ఈమెను ఉపాసించిన భక్తుల కల్మషాలన్నీ ప్రక్షాళన చెందుతాయి. వారి పూర్వసంచిత పాపాలన్నీ పూర్తిగా నశిస్తాయి. భవిష్యత్తులో కూడా పాపతాపాలుగానీ, దైన్యదుఃఖాలు కానీ వారి దరిజేరవు. వారు సర్వ విధాలా పునీతులై, అక్షయంగా పుణ్య ఫలాలను పొందుతారు.

మహాగౌరీ మాతను ధ్యానించటం, స్మరించటం, పూజించటం, ఆరాధించటం, మున్నగు రీతుల్లో సేవించటం వల్ల భక్తులకు సర్వ విధాలైనట్టి శుభాలు చేకూరుతాయి. మనము ఎల్లప్పుడు ఈమెను ధ్యానిస్తూ ఉండాలి. దేవి కృపవల్ల ఎల్లరికీ అలౌకిక సిద్ధులు ప్రాప్తిస్తాయి. మనస్సును ఏకాగ్రచిత్తం చేసి, అనన్య నిష్ఠతో సాధకులు ఈ దేవి పాదారవిందాలను సేవించటంవల్ల వారి కష్ఠాలు మటుమాయమవుతాయి.

ఈమె ఉపాసన ప్రభావం వల్ల అసంభవాలైన కార్యాలు సైతం సంభవాలవుతాయి. కనుక సర్వదా సర్వదా ఈమె పాదాలను శరణుజొచ్చటమే కర్తవ్యము. పురాణాలలో ఈమె మహిమలు శతథా ప్రస్తుతించబడ్డాయి. ఈమె సాధకుల మనో వ్యాపారాలను అపమార్గాల నుండి సన్మార్గానికి మరలిస్తుంది. మనం అనన్య భక్తి ప్రపత్తులతో ఈమెకు శరణాగతులమవటం ఎంతో శుభదాయకం.

🌹 🌹 🌹 🌹 🌹




No comments:

Post a Comment