సిద్దేశ్వరయానం - 1 Siddeshwarayanam - 1

🌹 సిద్దేశ్వరయానం - 1 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🌹సిద్దేశ్వరయానం 🌹

🏵 ద్వాపర యుగం 🏵

Part-1

హిమాలయ పర్వతాలలో కర్దమ ప్రజాపతి ఆశ్రమం ఉంది. ఆయన కుమారుడు కపిలుడు. విష్ణువు యొక్క అంశవల్ల పుట్టటం దివ్యస్ఫురణ ఉండడం వల్ల అతడు సహజంగా ఏ సాధన లేకుండానే సిద్ధుడైనాడు. చిన్నప్పుడు పాఠశాలలో ఆయనతో పాటు జైగీషవ్యుడనే ఋషి కుమారుడు కూడా తోటి విద్యార్థి. ఇద్దరూ చాలా ఆప్తులుగా ఉండేవారు. కొన్ని సంవత్సరాలు వేదాది విద్యలు పూర్తి అయిన తర్వాత జైగీషవ్యునికి తపస్సు చేసి దివ్యశక్తులు సాధించాలన్న కోరిక కలిగింది. మిత్రుడైన కపిలుని సలహాతో కైలాసపర్వత ప్రాంతంలోని సిద్ధాశ్రమానికి వెళ్ళి అక్కడ కొన్ని సంవత్సరాలు కఠోరనియమాలతో కైలాసనాథుని గూర్చి తపస్సు చేశాడు. మహేశ్వరునకు కరుణ కలిగింది. సాక్షాత్కరించాడు. అయితే ఆయన నీలలోహితుడై వజ్రధరుడై దిగంబరుడై భీషణ సుందరమూర్తితో ఉన్నాడు. జైగీషవ్యునకు ఆశ్చర్యం కలిగింది. హరుడు చిరునవ్వుతో అన్నాడు "ఓయీ! నీ ఆశ్చర్యం చూస్తున్నాను. నీవు తపస్సు చేసిన యీ చోటు డాకినీ శ్మశానం. నీవు రుద్రభూమిలో చేసిన యీ సాధన స్థల ప్రభావం వల్ల ఇక్కడి సిద్ధయోగుల కరుణవల్ల శీఘ్రఫలప్రదమైంది. ఇక్కడ నేను వజ్రకాళీవల్లభుడనై విహరిస్తుంటాను. మహాభైరవుడనై నీకు తీవ్రశక్తులను ప్రసాదిస్తున్నాను. ఈ అనంతకాలంలో నీవు నా ప్రతినిధిగా నిర్వర్తించవలసిన పాత్ర ఉంది. నీ మిత్రుడైన కపిలుడు విష్ణుదేవుని అంశావతారము. సమస్త సిద్ధులు అతని వశంలో ఉంటవి. ఆ మహాపురుషుని మైత్రి నీకు శ్రేయస్కరము. ఇక్కడ నుండి నీవు కాశీమహాక్షేత్రానికి వెళ్ళు. అక్కడి గుహలో మరికొంత కాలం ధ్యానదీక్షలలో ఉండు. వారణాసీ వల్లభుడైన విశ్వనాధుడు, ఆ దివ్యక్షేత్ర రక్షకుడైన కాలభైరవుడు నిన్ను అనుగ్రహిస్తారు. కాలమునకు అధిపతియైన ఆ భైరవుని కృపవల్ల అఖండకాలములో నీ పాత్రను సమర్థతతో నిర్వర్తించగలుగుతావు" అని వరములిచ్చి అదృశ్యుడైనాడు.

ఆ స్వామి ఆజ్ఞప్రకారం కాశీలో గుహావాసియై అహోరాత్రములు భేదం లేకుండా చిరకాలం ధ్యానం చేసి ప్రమథగణంలో స్థానం పొందగలిగాడు. ఒక రోజు దేవల మహర్షి గొప్ప తపస్సంపన్నుడని విని అతని ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడి శాంతవాతావరణం ఆయనకు వచ్చింది. ఆ స్థలంలో కొంతకాలం ఉందామనిపించింది. ఆయన ఆసక్తిని చూచి దేవలుడు "ఆర్యా! మీరు మా ఆశ్రమంలో ఎంతకాలమైనా ఉండవచ్చు. తపస్సు చేసుకోవచ్చు. కావలసిన సౌకర్యాలన్నీ చేస్తాను. మీరు కోరిన సిద్ధి లభించిన దాకా మీ యిష్టదేవతా సాధనచేయండి" అన్నాడు. అతనికి జైగీషవ్యుని మహత్వాన్ని గురించి తెలియదు. సామాన్యుడైన మునిమాత్రునిగాను, ఇంకా సాధనదశలో ఉండి దేవతానుగ్రహం కోసం కృషిచేస్తున్న తపోభావుకునిగాను భావించాడు. జైగీషవ్యుడు కూడా దేవలుని అపరిపక్వతను గమనించి, ఏమీ తెలియని సామాన్యునిగా ఆ ఆశ్రమంలో నిత్యము జపధ్యానములు చేస్తూ గడుపుతున్నాడు. కొంతకాలం గడిచిన తర్వాత తన తపశ్శక్తిని, మహత్తులను జైగీషవ్యునకు చూపించాలన్న కుతూహలము, చాపల్యము దేవలునకు కలిగినవి. కలిగి ఇలాఅన్నాడు

"జైగీషవ్యా ! ఈ రోజు నాకు కొంచెం పని ఉండి ఆకాశమార్గంలో దివ్యలోకాలకు వెళ్ళి వస్తాను. నీకేయిబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశాను. నీకింకా అటువంటి శక్తులురాలేదు గదా! ఎప్పటికైనా రావచ్చు. శ్రద్ధగా సాధనచేస్తూ ఉండు" అని చెప్పి ఖేచరుడై కొన్ని వందల యోజనముల దూరంలో ఉన్న సముద్రం దగ్గరకు వెళ్ళి స్నానానికి దిగాడు. తీరా చూస్తే ఒడ్డుననే ధ్యానం చేస్తూ కండ్లు మూసుకొని ఉన్న జైగీషవ్యుడు కనిపించాడు. దిగ్భ్రాంతి కలిగింది. అక్కడి నుండి గగన పథంలో ప్రయాణించి సిద్ధలోకానికి వెళ్ళాడు. అక్కడ సిద్ధులంతా జైగీషవ్యుని పూజిస్తున్నారు. కొంత కనువిప్పు కలిగింది. “ఈయన సామాన్యుడనుకున్నాను. మహనీయులైన సిద్ధులచే పూజలందు కొంటున్నాడు. అయినా ఇంకా పైలోకాలకు వెళ్తాను. అక్కడకు కూడా చేరుకోగల శక్తి ఉన్నదా లేదా చూస్తాను" అని అగ్నిలోకము, సోమలోకము, వసులోకము, రుద్రలోకము, బృహస్పతిలోకము మొదలైన ఊర్ధ్వలోకాలకు వెళ్ళాడు. ఆశ్చర్యంగా ప్రతిచోట జైగీషవ్యుడు పూజించబడుతూ కనిపించాడు. చివరకు తపోలోకానికి వెళ్ళినా అంతే. జైగీషవ్యుని దగ్గరకు వెళ్ళి మాట్లాడదామని ప్రయత్నిస్తున్నాడు. ఇంతలో ఆయన ఇంకా ఊర్థ్వలోకానికి ఎగిరివెళ్ళిపోయినాడు. అక్కడ తపోనిధులను దేవలుడు జైగీషవ్యుని గూర్చి ప్రశ్నించాడు. వారు "ఆయన యోగీశ్వరుడని, అసమాన అద్భుతశక్తి సమన్వితుడని ప్రస్తుతం ఇక్కడ నుండి బ్రహ్మలోకానికి వెళ్ళాడని - నీవింకా కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే గాని అక్కడకు వెళ్ళలేవని - అమహాపురుషునిలో లక్షోవంతు శక్తికూడ నీకు లేదని" తెలియజేశారు.

అప్పుడు దేవలుడు ఆ లోకమునుండి క్రిందికి దిగి తన ఆశ్రమానికి వస్తే అక్కడ జైగీషవ్యుడు ప్రశాంతంగా కూర్చుని ఉన్నాడు. మహర్షి ఆ మహానుభావుని కాళ్ళమీదపడి ఆయన అనుగ్రహంతో అనేక తత్వవిద్యారహస్యాలను తెలుసుకొన్నాడు.

( సశేషం )


No comments:

Post a Comment