సిద్దేశ్వరయానం - 2 Siddeshwarayanam - 2

🌹 సిద్దేశ్వరయానం - 2 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵️ ద్వాపర యుగం 🏵️

Part-2

దేవలుడి ఆశ్రమం లో కొన్నాళ్ళున్నతర్వాత జైగీషవ్యుడు బయలుదేరి తన మిత్రుడు మహనీయుడు అయిన కపిలమహర్షిని చూడాలనిపించి హిమగిరిలోని వారి నివాసానికి వెళ్ళాడు. ఆ మహాత్ము డిప్పుడు క్రౌంచద్వీపంలో ఉన్నట్లు తెలిసి ఆకాశమార్గాన ఆ ప్రదేశానికి చేరుకొన్నాడు. అది అరుణగిరిప్రాంతంలో ఉంది. (క్రౌంచద్వీపమంటే అమెరికా. కొలరాడో పర్వతాలే అరుణగిరి). చుక్క తెగిపడినట్లుగా అచట దిగి ఒక అశ్వత్థవృక్షం క్రింద ఆసీనుడై ఉన్న ఆ మహాపురుషునకు సాష్టాంగ ప్రణామం చేశాడు. కపిలుడు సాదరంగా ఆహ్వానించాడు.

కపిల : మిత్రుడా ! కుశలమే గదా ?

జైగీ : మీ దయవల్ల కుశలమే. మిత్రుడా అని నన్ను మీరాదరించారు. కానీ నేను మీ శిష్యుడను. మీ భక్తుడను.

కపిల : ఇద్దరమూ కలసి చిన్నప్పుడు చదువుకొన్నాము కనుక నాకు సతీర్థ్యుడవు, ఆప్తుడవు.

జైగీ : ఏదో నా పూర్వపుణ్యవశమున లభించిన అదృష్టము. విష్ణ్వంశ సంభూతులైన మీరు అవతారపురుషులు. మీ కృపవల్ల మీకు సఖుడను కాగల భాగ్యము లభించింది. సిద్ధులలో మిమ్ము మించినవాడు లేడు.

కపిల : తపస్సు వలన నీవు కూడా కొన్ని సిద్ధశక్తులు సాధించావు. అతి మానుషమైన శక్తులు నీకూ కొన్ని ఉన్నవి కదా!

జైగీ : నిజమే, కాని అవి కొన్ని మాత్రమే. దివ్యశక్తులు కొంత లభించిన మాట సత్యమే కాని, దివ్యజ్ఞానము మీకున్నంత నాకులేదు.

కపిల : అది యథార్ధమే. దాని హేతువులు దానికున్నవి. నీకు గుర్తున్నది. కదా! చాలాకాలం క్రింద ఒక రాజ్యంలో మనముండగా ఆరాజు మన దర్శనానికి వచ్చాడు. నీవు నన్ను గురించి చెపుతూ, సాక్షాత్ విష్ణుమూర్తి యొక్క అవతారమీ కపిలమహర్షి అని అన్నావు. ఆ రాజు నమ్మలేదు. దివ్యశక్తులు కొన్ని చూపించినా అతడికి విశ్వాసం కలుగలేదు. చివరకు నీ కోరికమీద నాస్వస్వరూపమైన నారాయణా కృతిని ధరించాను. నీవు గరుత్మంతుడవై నాకు వాహనమయినావు. అతడేదో కొంత నమ్మినట్లు కనిపించి వినయపూర్వకంగా నమస్కారాలు అర్పించాడు. ఆ ఆకారాలతోటే మన మాకాశమార్గంలో మన ఆశ్రమానికి వచ్చాము.

జైగీ : ఋషివల్లభా ! నాకు గుర్తున్నది. ఇదే కాదు రావణాసురుని మీరు శిక్షించిన సంఘటన కూడా మీ అవతార మహత్వానికి నిరూపణగా గంధర్వులు కీర్తిస్తున్నారు.

కపిల : అవసరమై ఆవిధంగా చేయవలసి వచ్చింది. నేను

హిమాలయాలలోని ఒక గుహలో నిద్రిస్తున్నాను. బలవంతుడైన రావణాసురుడు, ఎటో జైత్రయాత్ర వెడుతూ ఈ గుహలో ఏముందో చూదామని లోపలికి వచ్చాడు. లోపల శయనించి ఉన్న నన్ను చూచి ఎవరక్కడ అని పెద్దగా అరిచాడు. వాడి అరుపుకు ఎవరైనా నిద్రలేస్తారు. నేను లేవలేదు. వాడు ఆగ్రహించి నా మీద దెబ్బ వేయబోయినాడు. క్షణంలో నేను లేచి వానికొక ముష్టిఘాతం ఇచ్చాను. ఆ దెబ్బకు కళ్లు తిరిగి క్రిందపడ్డాడు. తమాయించు కొని లేచి దిగ్భ్రాంతి చెంది నన్ను చూచి ఇలా అన్నాడు. "అయ్యా ! నీ వెవరో నాకు అర్థం కావటం లేదు. ఒక్క దెబ్బతో నన్నిలా పడగొట్టినవాడు ఇంత వర కెవ్వరూ లేరు. నేను బ్రహ్మవరం వల్ల అజేయుడను. నేను రుద్రుని చూచాను. ఇంద్రుని ఎరుగుదును. యముని, అగ్నిని, తెలిసినవాడను. వా రెవ్వరికీ ఇంతటి పరాక్రమము, రౌద్రము లేవు. నీ వెవ్వరో తెలియచేయవలసినది" అనగా నేను వానితో "మూర్ఖుడా! అహంకారముతో బలముతో విర్రవీగుతూ లోకాలను బాధిస్తున్నావు. బ్రహ్మ ఇచ్చిన వరము నందు మర్యాదనుంచి నిన్నింతకాలము ఉపేక్షించాను. త్వరలో మానవునిగా అవతరించి నిన్ను సంహరిస్తాను. నేనెవరైతే నేమి ? బ్రహ్మరుద్రాదుల కతీతుడైన సర్వాత్మకుడను, జగన్నాథుడను నేను. వెళ్ళు" అన్నాను. వాడు తలవంచుకొని వెళ్ళిపోయినాడు.

జైగీ : మహాత్మా ! ఈ సంఘటన నేను విన్నాను. ఇది ఎప్పుడో త్రేతాయుగం నాటి కథ కదా ? అప్పుడు నే నెక్కడ ఉన్నాను.

( సశేషం )

🌹🌹🌹🌹🌹




No comments:

Post a Comment