సిద్దేశ్వరయానం - 24 Siddeshwarayanam - 24


🌹 సిద్దేశ్వరయానం - 24 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵 భైరవనాథుడు 🏵


వామదేవుడు ఈ కధ చెప్పి "రేణుకాదేవి యొక్క కరుణనీయందు సహజంగా ఉన్నది. ఎందుకంటే పూర్వజన్మలో పరశురాముని పరశువు యొక్క శక్తి నీలోకి ప్రవేశించింది. ఆయా విషయాలు నెమ్మదిగా నీకు తెలుస్తవి. ప్రస్తుతం కర్తవ్య మార్గంలోకి ప్రవేశిద్దాము" అన్నాడు. మరునాడుదయం పల్లెకు దగ్గర ఉన్న పర్వతం మీదకు బయలుదేరాడు. అక్కడ ఒక పెద్ద గుహ ఉన్నది. ఆ గుహలో లోపలిభాగంలో వజ్రభైరవుని విగ్రహం ఉన్నది. దాని ముందు దండకమండలువులు జపమాల ఉన్నవి. ఒక పెద్దపీట దానిపై కూర్మయంత్రం కనిపిస్తున్నవి.

“ఈ రోజు నుండి ఇది నీ తపస్థానము. కాశీలో నీవు చేసిన పద్ధతి కంటె ఇది కొంచెం భిన్నమైనది. ఈ గుహపురాతనమైనది. ఇక్కడ భైరవ సిద్ధులు తపస్సు చేశారు. శంఖపాలుడు, ఉగ్రసేనుడు అనే యిద్దరు ఇక్కడ తీవ్ర తపస్సు చేసి భైరవానుగ్రహం పొంది ఆయన పరివారంలో ఉన్నారు.. వారు నీకు తోడ్పడుతారు. ఈ గుహముందు భాగంలో ఒక హోమకుండాన్ని నిర్మించి ఆహుతులు వెయ్యాలి. ఇక్కడి వనమూలికలు కూడా కొన్ని ఉపయోగించవచ్చు.

ఒక ప్రక్కన పూర్వ జనులు రాజభయంతో చోరభయంతో బందిపోట్ల భయంతో దాచిన ధనమున్నది. వారెవరూ ఇప్పుడు లేరు. వారి వారసులు లేరు. ఆ ధనంలో నుండి బంగారు వెండినాణెములు కొన్ని ఈ కోయవారికిస్తూ ఉండు. నీవు సృష్టించి యిస్తున్నావని అనుకొంటారు. అది మంచిదే. నీ సాధన యెంతకాలం జరగాలో భైరవుడు నిర్ణయిస్తాడు. ఆయనే సాధన చేయిస్తాడు. ఆయనే ఫలితములిస్తాడు. ఇక నేను వెళ్ళి వస్తాను. ఏమి చేయాలో, ఎలా చేయాలో నీవే నిర్ణయించుకోగల శక్తి వస్తుంది. విజయోస్తు ! అని వామదేవుడు బయలుదేరాడు.

యువకుడు కన్నీళ్ళతో ఆ మహర్షి పాదములు తడిపాడు. "గురుదేవా! మీ ఆజ్ఞతో మీరు చెప్పినదల్లా చేస్తాను. మీ కృపవల్ల సాధించగలనన్న నమ్మకమున్నది. కానీ మళ్ళీ మిమ్ము చూచి మీ ఆశీస్సులు తీసుకొని కర్తవ్య నిర్వహణకు బయలుదేరుతాను. దానికి మాత్రం మీరు అనుమతించండి" అని ఆర్తితో వేడుకొన్నాడు. మహర్షి అతని ఆవేదనకు చలించి - అలాగే తథాస్తు! అని కదిలి ముందుకు వెళ్ళిపోయినాడు.

నిరంతర హోమము, భైరవార్చన- ఒక సంవత్సరం గడిచింది. అంతరిక్షంలో వెళుతున్న దేవతలను విద్యాధర గంధర్వాదులను చూచేశక్తి వచ్చింది. రెండవ సంవత్సరం గడిచింది. రాత్రివేళ స్థూలశరీరంలో నుండి బయటకు వచ్చి సూక్ష్మ శరీరముతో ఆకాశయానము చేసి ఎక్కడికైనా వెళ్ళి రాగల శక్తి వచ్చింది. కానీ ఎక్కడకూ వెళ్ళాలన్న కోరిక లేదు. వజ్రభైరవుని మూర్తి కంటి ముందు అప్పుడప్పుడు కనిపిస్తున్నది. మూడవ సంవత్సరం పూర్తి అయింది. రాత్రివేళ వజ్రభైరవుని ముందు కూర్చుని ధ్యానం చేస్తున్నాడు. ఒక లోకోత్తర సౌందర్యవతి కంటి ముందు సాక్షాత్కరించింది.

"తపస్వీ! నేను ఇచటి రేణుకాదేవి ఆలయానికి ఆ మాతను సేవించటానికి వచ్చిన ఒక గంధర్వకాంతను. నీ తపస్సు, నీ దీక్ష చూచి సంతోషించాను. నీవు ఏ శక్తుల కోసం ఈ యజ్ఞం, పూజ, జపము, ధ్యానము చేస్తున్నావో ఆ శక్తులన్నీ నాదగ్గర ఉన్నవి. వాటికి నీకు నేను ఇస్తాను. నాతో క్రీడించు. దివ్యఫలములు, సిద్ధశక్తులు రెండూ పొందగలవు" అని ప్రేమతో ఆహ్వానించింది. నాగభైరవుడు ఆమెను ఆశ్చర్యంతో చూచాడు. ఒకసారి విగ్రహరూపుడైన భైరవుని చూచాడు. క్షణంపాటు ఆలోచించి ఇలా అన్నాడు. "గాంధర్వీ ! దివ్యశక్తులు కలిగిన మహనీయ మూర్తులు మీరు. నేను సామాన్యుడను. నేను కామమును జయించలేదు. మోహమును గెలువలేదు. జితేంద్రియుడను కాదు. కాని గురువాక్యబద్ధుడను.

ఈ వేదభూమిని కృష్ణ ధామమును కాపాడటానికి ఈ భారతజాతికి వచ్చే ప్రమాదముల నుండి విదేశ విమతోపద్రవముల నుండి, దుష్టమాంత్రికుల ప్రభావం నుండి రక్షించటానికి సిద్ధాశ్రమ యోగులు నన్నొక ఉపకరణంగా ఎన్నుకొని నా చేత ఈ ధర్మరక్షణ యజ్ఞం చేయిస్తున్నారు. ఈ మహావ్రత కంకణధారినై దీక్షాబద్ధుడనై కృషి చేస్తున్నాను. భైరవ సాక్షాత్కారం కోసం ఎదురుచూస్తున్నాను. ఏ కారణం వల్లనో మీకు నా యందు ప్రేమకలిగింది. నేను ఎంతో అదృష్టవంతుడను. మీరు దివ్యశక్తులిస్తామన్నారు. మీ కరుణకది నిదర్శనం. కాని నేను భైరవుని నుండి వరములు పొందాలని గురుదేవుని సంకల్పం. ప్రణయస్వరూపిణి యైన మీరు నాకు భైరవానుగ్రహం త్వరగా కలిగేట్లు అనుగ్రహించండి!" అని నమస్కరించాడు.

ఆ గంధర్వకాంత కనులు విప్పార చూసింది. “యువకుడా! నిన్ను చూచి చాలా ఆనందం కలుగుతున్నది. నీ దీక్ష అసామాన్యమైనది. జాతిరక్షణకు, ధర్మస్థాపనకు అంకితమైన నిన్ను ఇంతకు ముందుకంటే ఇష్టపడుతున్నాను. నీ గురుభక్తిని పట్టుదలను మెచ్చుకుంటాను. ఇప్పుడు నీ మార్గానికి అడ్డురాను. అయితే నేను గంధర్వకాంతను. నా యిచ్ఛ వ్యర్థం కాదు. భవిష్యత్తులో వచ్చే ఒక జన్మలో నీవే నా కోసం పరితపిస్తావు. ప్రేమిస్తావు. ప్రార్థిస్తావు. అప్పుడు జన్మయెత్తకుండా నా దివ్యశక్తితో- మానవ శరీరం ధరించి నీతో కాపురం చేస్తాను.


( సశేషం )


No comments:

Post a Comment