సిద్దేశ్వరయానం - 42 Siddeshwarayanam - 42


🌹 సిద్దేశ్వరయానం - 42 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామిజీ విరచిత 💐

🏵 5వ శతాబ్దం నుండి 🏵

రాక్షసరాజు స్వయంగా అక్కడకు వచ్చి చివరికి కాళీ ప్రయోగం చేయవలసినదిగా ఆజ్ఞాపించాడు. దూరంగా గుడారంలో ఉన్న ఒక బలిష్ఠ కన్యను తీసుకు వచ్చారు. ఆమెలోకి మహాకాళిని ఆవాహనం చేశారు. అలవాటైన ప్రవేశం. నరబలుల చేత రక్తమాంస నివేదనల చేత వరములిచ్చి రక్షిస్తున్న ఆ భయంకర దేవత ఆ కన్యలోకి ప్రవేశించింది. ఒక పెద్ద దున్నపోతును తెచ్చి ఆమె ముందు బలి యిచ్చారు. మహాకాళీ! శత్రుసంహారిణీ! నీ అప్రతిహతశక్తితో నాగసైన్యాధిపతి హరసిద్ధుని సంహరించు. మాకు విజయాన్ని ప్రసాదించు - అని మాంత్రికులు, అసుర చక్రవర్తి ప్రార్ధించారు. ఆమె ప్రక్కన రాక్షసగణము యిస్తున్న అరుణవర్ణ మద్యాన్ని తాగింది. ఎర్రని కన్నులతో భీషణంగా అట్టహాసం చేస్తూ ముందుకు దూకింది.

ఆ కాళీదేవి నోటి నుండి మంటలు వస్తున్నవి. విరబోసిన జుట్టు నుండి పొగలు లేస్తున్నవి. ఆమె చేతులలో నుండి ఖడ్గములు, శూలములు, ఛురికలు, గదలు, పరిఘలు బయలుదేరి ఆకాశమార్గములో వచ్చి నాగసైనికులను నాశనం చేస్తున్నవి. ఆ భయంకర స్వరూపాన్ని చూచి అందరూ నిశ్చేష్టులైనారు. ఆ దేవి దిగంబర. హతమానవుల హస్తములు ఆమె నడుముచుట్టూ ఒడ్డాణముగా వేలాడుతున్నవి. శరీరమంతా చితాభస్మము. కాలుతున్న శవముల వాసన వాయుమండలమంతటా వ్యాపిస్తున్నది. కదలుతున్న కాంతిమండలం వలె ఆ రాక్షస కన్య ముందుకు వచ్చింది. అందరూ ప్రక్కకు తప్పుకున్నారు. కాళీకన్య క్రోధ భీషణంగా చూస్తూ హరసిద్ధుని మీదకు విసరటానికి శూలమెత్తింది. ఎదురు చూస్తున్న సంఘటనే కనుక అతడు చలించలేదు. అతని దగ్గర సిద్ధం చేసుకొన్న ప్రత్యేకాయుధం ఉన్నది. దాచి ఉంచిన ఒక పెద్ద పుష్పమాల తీశాడు. భోజార్ నాధుని మెడలో మాల అది. ఆ పూలు సంవత్సరం పాటు వాడవు. కంచిలోని కామాక్షీదేవికి అటువంటి పుష్పమాల వేస్తారు.

“ఏదేవి తురుముపై ఏడుకాలము దాక కసు గందకుండు చెంగలువదండ" - శ్రీనాథుడు.

ఆ మాల ఎత్తి రెండు చేతులతో పట్టుకొన్నాడు. అందరూ ఆశ్చర్యంతో చూస్తున్నారు. అతడు పట్టుకొన్న మాలను, అతని చేతి వ్రేలికున్న భైరవ వజ్రాంగుళీయకాన్ని కాళీకన్య చూచింది. ఆ వజ్రకాంతులు ఆమె కన్నులకు మిరుమిట్లు కొలిపినవి. హరసిద్ధుడు భైరవ మంత్రాన్ని స్మరించి మాల విసిరేశాడు. అది గాలిలో ప్రయాణం చేసి సరాసరి ఆమె మెడలో పడింది. ఆ మాల తగలగానే ఆ వజ్రకాంతి కనులలో ప్రవేశించగానే ఆమె చేతిలోని శూలం క్రింద పడిపోయింది. వీక్షణములలోని తీవ్రత అదృశ్యమైంది.

స్వామీ! భైరవప్రభూ! మీరా ! మీరు వచ్చారా! అంటూ నమస్కరించి క్రింద పడిపోయింది. స్పృహ కోల్పోయింది. ఆమెను అవతలకు మోసుకెళ్ళారు. రాక్షసరాజు, మాంత్రికులు దిగ్భ్రాంతులైనారు. ఈ బ్రాహ్మణుడు ఇంత భైరవానుగ్రహం ఎలా సాధించాడు? దేని మీద ఆశ పెట్టుకొన్నారో ఆ కాళీ ప్రయోగం వ్యర్థమయింది. నరబలులు రక్తహోమాలు కాళి యిచ్చిన శక్తులు అన్నీ విఫలమైనవి. రాజాజ్ఞ మీద రాక్షససైన్యం వెనక్కి తగ్గింది. హరసిద్ధుడు కూడా యుద్ధం ఆపమన్నాడు.

దానవేశ్వరుని ఆజ్ఞతో రాక్షస ప్రముఖులు తెల్ల జెండాలు పట్టుకొని, వేద పండితులు, శ్రుతి విభాగాలను ఉచ్ఛైస్వరంతో పఠిస్తుండగా రాయబారం వచ్చారు. ఐరావత చక్రవర్తి రణరంగంలోనే కొలువుదీరాడు. ఆయన సింహాసనం ప్రక్కనే హరసిద్ధునకు ఉన్నతాసనము వేయబడింది. రాక్షస మంత్రి వచ్చి మహారాజుకు నమస్కరించి తమ పరాజయాన్ని అంగీకరిస్తూ సంధి ప్రతిపాదన చేశాడు. రెండు జాతుల మధ్య సామరస్యం ఏర్పడటం మంచిదన్న హరసిద్ధుని సూచనను కాదనలేక నాగసార్వభౌముడు అంగీకరించాడు. నాగులకు ఎక్కువ అనుకూలమైన షరతులతోనే సంధి జరిగింది.

( సశేషం )


No comments:

Post a Comment