సిద్దేశ్వరయానం - 43 Siddeshwarayanam - 43


🌹 సిద్దేశ్వరయానం - 43 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵 5వ శతాబ్దం నుండి 🏵


హిరణ్మయీ సిద్ధభైరవుల సంసారం సుఖంగా సాగుతున్నది. కొన్నాళ్ళకు రాజపుత్రిక గర్భవతి అయింది. తొమ్మిది నెలల కాలంలో ఆమె కోరికల నన్నింటినీ తీరుస్తూ ఆమె సంతోషంగా ఉండేలా చేశాడు హరసిద్ధుడు. నెలలు నిండిన పిదప హిరణ్మయి మగపిల్లవాణ్ణి కన్నది. కన్నతండ్రి పేరు వచ్చే విధంగా ఆ శిశువునకు శివదేవుడని పేరుపెట్టాడు హరదత్తుడు. సార్వభౌమునకు మగబిడ్డలు లేకపోవటం వల్ల దౌహిత్రుడే భవిష్యచ్చక్రవర్తి కాగలడని ప్రకటించారు. పిల్లవాడు పెరిగి పెద్దవాడవుతూ ఉన్నాడు.

ఒకరోజు దక్షిణాపథం నుండి నాగప్రముఖులు కొందరు వచ్చి చక్రవర్తి దర్శనం చేసుకొన్నారు. “ప్రభూ! దక్షిణ భారతంలో ముఖ్యంగా ఆంధ్రదేశంలో మనజాతి బాగా వ్యాపించి ఉన్నది. అయితే అక్కడి ఆంధ్రులతో మనకు ఎక్కువ సంఘర్షణలు జరుగుతున్నవి. మన జాతి ఆధిపత్యం పెంపొందటానికి గాను, ధన, సైన్య సహాయం అర్ధించటానికి వచ్చాము" అని వేడుకొన్నారు. “ఆలోచించి ఏం చేయాలో చేస్తాము తగిన విధంగా తోడ్పడతాము" అని మంత్రి వారిని విడిదికి పంపి "మహారాజా! ఇది మనకు సున్నితమైన సమస్య. తమ అల్లుడుగారు ఆంధ్రుడు. మనం ఆంధ్రులతో యుద్ధం చేయటానికి సహాయంగా సైన్యాలను పంపటం ఉచితంగాదు. అలా అని మన వాళ్ళను తిరస్కరించటమూ న్యాయం కాదు. హరసిద్ధుల వారిని అక్కడకు పంపితే వారీ సమస్యను పరిష్కరించగలరని నా నమ్మకం" అన్నాడు.

మహారాజు అంగీకరించి హరసిద్ధుని మరొకసారి జాతివైరాన్ని రూపుమాపి శాంతిని నెలకొల్పవలసిందిగా కోరాడు. హరసిద్ధుడు సంతోషంగా ఒప్పుకొన్నాడు. ఆ రోజు భార్యతో "హిరణ్మయీ! మీ నాయనగారు నన్ను దక్షిణ భారతానికి ఆంధ్ర నాగ ఘర్షణలు ఆపటానికి పంపిస్తున్న సంగతి వినే వుంటావు. మానవీయ ధర్మపరిరక్షణకు ఇటువంటివి తప్పవు. అటువైపు వెళ్ళిన తర్వాత తిరిగి రావటానికి ఎంత కాలంపడుతుందో చూడాలి. శివదేవుని జాగ్రత్తగా చూచుకుంటూ ఉండు. భైరవ మంత్రం జపిస్తూ రోజూ స్వామిని పూజిస్తూ ఉండు అన్నీ సక్రమంగా జరగగలవని విశ్వసిస్తున్నాను” అని బాధపడుతున్న ఆమెను ఓదార్చాడు. "ప్రభూ! ఈ యుద్ధాలు, రాజకీయాలు మనకెందుకు? ప్రశాంతంగా వీటన్నింటికీ దూరంగా ఉందాము. నేను మిమ్ము విడిచి పెట్టి ఉండలేను. ఎక్కడికైనా దివ్యక్షేత్రానికి వెళ్ళిపోదాము" అన్నది హిరణ్మయి. ఆమె కంటి కన్నీరు తుడిచి "దేవీ! నీవు కోరిందే నాకు ఇష్టము. మనం అలానే ఉండే రోజులు త్వరలోనే వస్తవని అనిపిస్తున్నది. కాని ప్రస్తుతం మీ నాయనగారి కోరిక కాదనకూడదు. అంతేకాదు. అధర్మం ధర్మంతో యుద్ధం చేయలేక అలసిపోతున్నప్పుడు శక్తిగలవాడు ఉపేక్షించరాదు. వ్యాసులవారు భారతంలో ఇలా చెప్పారు.

ఉ || సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే పారము పొందలేక చెడబారినదైన అవస్థ దక్షులె వ్వారలుపేక్ష చేసి రది వారల చేటగు గాని ధర్మని స్తారకమయ్యు సత్యశుభదాయకమయ్యును దైవముండెడిన్

మహాభైరవుడు నా కొకశక్తి నిచ్చాడు. దానితో దేవకార్యం చేయటము నా బాధ్యత. ధర్మరక్షణ, శాంతి, అహింస, సమాన ధ్యేయాలు. తప్పక పోతే కృష్ణభగవానుడు చెప్పిన, చూపిన మార్గం. ధర్మస్థాపన కోసం యుద్ధం. నా వరకు నాకు ఇంక కత్తి పట్టుకుందామని లేదు. కానీ ఈశ్వరేచ్ఛ ఎలా ఉందో! ఆ విషయమునటుంచి మనసులోని మాట మరొకటి చెప్పాలి. భైరవుడు అనుగ్రహించాడు. శక్తి శౌర్యాలిచ్చాడు. ప్రేమ, యుద్ధం సంసారం, సంతానం. అన్నింటిలోను విజయం లభించింది. కానీ నేనెవరు ? ఎక్కడ నుండి వచ్చాను? ఎక్కడకు వెళుతున్నాను ? నీ వెవరు ? మన అనుబంధం ఎప్పటిది? భవిష్యత్తు ఏమిటి? - ఆ దివ్యజ్ఞానం పూర్ణంగా లభించలేదు. సిద్ధగురువులు కొంత కొంత చెపుతున్నారు. నాకు అసంతృప్తిగా ఉంది. ఏమి చేయాలి? ఎలా?” హిరణ్మయి “ప్రభూ! మీ ఆవేదన నాకు అర్థమవుతున్నది. తల్లిదండ్రులు - భర్త - బిడ్డ అన్న మమకారంలో ఉన్న ప్రేమజీవిని నేను. మీరు కారణజన్ములు. కోరింది తప్పక సాధిస్తారు. ప్రస్తుత కర్తవ్యం నిర్వర్తించండి.! క్షేమంగా వెళ్ళి లాభంగా రండి” అన్నది.

హరసిద్ధుడు బయలుదేరాడు. అనుకొన్న ప్రణాళిక ప్రకారం మహామంత్రి దక్షిణభారతం నుండి వచ్చిన నాగరాయబారులకు "మేము మా మహాసేనాని హరసిద్ధుడు కొద్ది పరివారంతో వచ్చి అక్కడి అవసరాలను అంచనా వేస్తాము. పరిస్థితిని బట్టి ఎంత సైన్యమైనా వస్తుంది. మీరు భయపడవలసిన పనిలేదు. మీరు ముందు వెళ్ళి ఉండండి" అని చెప్పి కావలసినంత ధనమిచ్చి పంపివేశారు. వాళ్ళు వెళ్ళి తమ ప్రభువుతో తాము సేకరించిన సమాచారాన్ని - ఆంధ్ర బ్రాహ్మణుడైన హరసిద్ధుడు నాగచక్రవర్తి అల్లుడైన సంగతి అతని అద్భుత పరాక్రమము, మహిమలు వర్ణించి చెప్పారు. నాగప్రభువు చక్రవర్తి పంపే వారి కోసం ఎదురు చూస్తున్నాడు.

( సశేషం )

🌹🌹🌹🌹🌹




No comments:

Post a Comment