సిద్దేశ్వరయానం - 60 Siddeshwarayanam - 60

🌹 సిద్దేశ్వరయానం - 60 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵 శిష్యురాలు భైరవీ బ్రాహ్మణి 🏵


కాళీ యోగి, యోగేశ్వరి గగన వీధులలో భూమికి కొంచెంపైన వాళ్ళు వెడుతూంటే కింద అడవులు కొండలు గుట్టలు, నదులు, సరస్సులు, గ్రామాలు, పట్టణాలు ఎన్నో వెనుకకు వెళ్ళుతున్నవి. వారు వెడుతున్న ఆ మహావేగం ఆశ్చర్యకరంగా ఉన్నది. అస్త్రమంత్రాలతో అభిమంత్రించిన బాణాలు వెళ్తున్నట్లుగా వాళ్ళిద్దరూ వెళుతూంటే మబ్బులు విచ్చుకొని త్రోవ ఇస్తున్నట్లుగా ఉన్నది. ఆకాశంలో ఉన్న పక్షులు వీరి గమనాన్ని తెలుసుకో గలిగినట్లు లేదు. బహుశా అదృశ్యంగా ఉన్నారేమో. సూర్యోదయం అవుతూ ఉండగా ఒక అరణ్య ప్రదేశంలో భూమిమీద దిగారు. అడవిబాటగుండా ఆయన నడుస్తూ ముందుకు వెళుతున్నాడు.

ఇంతలో ఒక పెద్దపులి గాండ్రిస్తూ వచ్చింది. దాని ముందుగానే ఏమీ మాట్లాడకుండా ఆయన నడుస్తూ వెళ్ళాడు. ఆయన వెంట యోగేశ్వరి - ఆ పులి నిశ్శబ్దంగా నిల్చున్నది. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తరువాత ఎటు చూచినా పెద్ద పెద్ద పాముపుట్టలు. కొన్ని మహాసర్పాలు పడగ విప్పి చూస్తున్నవి. నెమ్మదిగా నడిచి ఆశ్రమంలోకి ప్రవేశించారు. అక్కడ ఏమనుష్యుల అలికిడీ లేదు ఒక కుటీరము ఒక దేవతా మందిరము కొండరాళ్ళతో గుహవలె కనిపిస్తున్న ఆ మందిరంలోకి ప్రవేశించగానే లోపల ఎనిమిదడుగుల ఎత్తైన కాళీదేవి యొక్క భీషణ విగ్రహం ప్రకాశిస్తున్నది. దాని ముందొక హోమకుండం వెలుగుతున్నది.

కాళీదేవికి ఆయనతో పాటు తాను కూడా నమస్కరించింది. ఆయన మౌనంగా కొద్ది దూరంలో ఉన్న సరస్సు దగ్గరకు వెళ్ళి స్నానం చేశాడు. ఆమె కూడా స్నానం చేసింది. కుటీరానికి తిరిగి వచ్చిన తరువాత ఆయన “అమ్మవారికి అలంకరించిన చీరలు లోపల ఉన్నవి. వాటిని నీవు ధరించవచ్చును” అన్నాడు ఆమె లోపలకు వెళ్ళి తడిబట్టలు విప్పి చీరను మార్చుకు వచ్చింది.

ఆమె సిద్ధమై వచ్చేసరికి ఆయన పూజకు సిద్ధంగా ఉన్నాడు. ఎవరో అమర్చినట్లు పూజావస్తువులన్నీ అక్కడ ఉన్నవి. కాళీదేవికి శాస్త్రోక్త విధానంగా పూజచేసి ఎదురుగా ఉన్న హోమ కుండంలో కొన్ని ప్రత్యేకద్రవ్యాలతో ఆయన ఆహుతులు వేశాడు. పూజ, హోమము ఇంచుమించు రెండు గంటలు పట్టింది.

మరికొంతసేపు గంభీర కంఠంతో ఆయన, కాళీ స్త్రోత్రాలను పారాయణ చేశాడు. కొద్దిసేపు ధ్యానం చేసి "యోగీశ్వరీ! ఈపూటకు, అమ్మవారికి నైవేద్యం పెట్టిన పండ్లు తేనె, మనకు ఆహారం. రేపటి నుండి వంటకు ఏర్పాట్లు జరుగుతవి. ఇక్కడకు చుట్టూ ఉన్న క్రూరజంతువులు, సర్పములు, నిన్నేమీ చేయవు. నిర్భయంగా విశ్రాంతి తీసుకోవచ్చు” అన్నాడు. "స్వామీ! మీరుండగా నాకు భయమన్నది లేదు, మహాపురుషులైన మీపాద సన్నిధిలో నాజీవితం చరితార్థమౌతుంది" అన్నది.

ప్రసాదస్వీకారానంతరం కొంత విశ్రాంతి తీసుకొన్న తరువాత సాయంకాలం కలకలం మొదలైంది. కొంత మంది గ్రామీణులు అమ్మవారి దర్శనం స్వామి వారిదర్శనం కోసం వచ్చారు. వస్తూ వస్తూ వంటసామగ్రి, ఆహారపదార్ధాలు కాయగూరలు, పాలు రకరకాల వస్తువులూ తీసుకువచ్చారు. స్వామికి నమస్కరించి ఆయన సంజ్ఞతో ఆ సామాగ్రి అంతా ఆమెకు అప్పగించి కాళీదేవి దర్శనం చేసుకొని వాళ్ళు వెళ్ళిపోయినారు. కాళీయోగి యోగేశ్వరితో "కావలిసిన సామాగ్రి వచ్చింది. ఇకమీద వంట చేసుకొని మామూలు భోజనం చేయవచ్చు రేపటి నుండి నీ సాధన ప్రారంభం అవుతుంది".

యోగేశ్వరి: స్వామీ! కావలసిని సామగ్రివచ్చింది. వంట చేస్తాను కానీ ఇక్కడ ఇంతకుముందు పొయ్యి రాజేసిన జాడ కనపడటం లేదు. ఇన్నాళ్ళుగా మీరు ఏమి ఆహారం తీసుకొంటున్నారో అర్ధంగావటం లేదు.

యోగి: ఓ అమాయక బాలికా! నాకు ఆహారంతో కాని నిద్రతో కాని పనిలేదు. ఏమయినా తినగలను, ఎంతయినా తినగలను, ఏమీ తినకుండా ఎంత కాలమయినా ఉండగలను. సామాన్య మానవ శరీరాలకు ఉండే ఏ

అవసరమూ నన్ను బాధించదు.

యోగేశ్వరి: మహాత్మా! నాకాస్థితి ఎప్పటికీ వస్తుంది?

యోగి: వచ్చిన దాకా ఈ ఆహార విహారాదులు అవసరమే కదా!

యోగేశ్వరి: నేను వంట చేస్తాను కానీ మీరు భోజనం చేస్తేనే నేను చేసేది.

యోగి: అలానే నాకు తీసుకున్నా ఒకటే, తీసుకోక పోయినా ఒకటే. అయినా నీ కోసం తీసుకొంటాను.

యోగేశ్వరి: తమ అనుగ్రహము.

( సశేషం )

🌹🌹🌹🌹🌹


No comments:

Post a Comment