సిద్దేశ్వరయానం - 63 Siddeshwarayanam - 63

🌹 సిద్దేశ్వరయానం - 63 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵 శిష్యురాలు భైరవీ బ్రాహ్మణి 🏵

యోగేశ్వరిని కాళీయోగి చిరునవ్వుతో చెయ్యెత్తి ఆశీర్వదించి గంభీరమైన కాళీ విగ్రహం వైపు చూస్తూ హోమకుండంలోకి ప్రవేశించి పద్మాసనంలో ధ్యానముద్రలో కూర్చొన్నాడు. అగ్నిస్తంభన సిద్ధుడైన ఆ మహనీయుని దహించే శక్తి అగ్నికి లేదు. ఆయన ఇచ్ఛాశక్తి వల్ల శరీరంలో నుండే అగ్ని ఉదయించి దహించటం మొదలు పెట్టింది. ప్రజ్వలిస్తున్న ఆ జ్వాలలో ఆ సిద్ధశరీరం దహనమవుతుంటే వాతావరణమంతా దివ్యపరిమళం వ్యాపించింది, ఒకవైపు అశ్రువులు కంటివెంట జాలువారుతుంటే, ఎంత ఆపుకున్నా ఆగని దుఃఖం మనసును ఆక్రమిస్తుంటే నిలుచో లేక ఒక స్తంభాన్ని పట్టుకొని అలా కూర్చుండి పోయింది యోగేశ్వరి. స్పృహ ఉన్నదో లేదో.

తరువాత కార్యక్రమం అంతా కాళీయోగి చెప్పినట్లే జరిగింది. కాళీ మందిరాన్ని యోగి సూచించిన ప్రకారం అక్కడికి వచ్చిన వృద్ధభక్తునకు అప్పగించింది. ఆయన కుమారుడు కూడా తీవ్రసాధకుని వలె కన్పించాడు. కొద్దిరోజులు అక్కడ ఉండి అక్కడ నుండి బయలుదేరి బృందావనం వెళ్ళింది. వృద్ధురాలైన తల్లి తనరాకకు ఎంతో సంతోషించింది. ఆమె అడిగితే తనసాధన గూర్చి గడచిన సంవత్సరాలలో చేసిన వాటి గురించి కొద్ది విశేషాలు చెప్పింది. వాటిని తన చెల్లెలు కూడా విన్నది. ఆమెకు వీటి మీద సదభిప్రాయం కలుగలేదు.

యోగేశ్వరి కూడా నచ్చజెప్పటం కోసం ప్రయత్నంచేయలేదు. ఎవరి మార్గం వారిది. తనకు స్ఫురిస్తున్నదాన్నిబట్టి తన చెల్లెలు ఒక గోపికవలే కృష్ణుని విరహంతో తపించి తపించి కృతార్ధురాలవుతుంది. ఆ తరువాత కొద్దికాలానికే వృద్ధురాలైన తల్లి మరణించింది. తమ స్వస్థలానికి వెళ్ళి అక్కడి ఆస్తి పాస్తుల వ్యవహారాలన్నీ సరిదిద్ది అన్నింటిని అమ్మివేసి ఆ ధనాన్ని తీసుకువచ్చి చెల్లెలికి అప్పగించింది. తనకు ఏవిధమైన పూర్వుల ఆర్జితము అక్కరలేదని ఇంతకు మునుపువలెనే, దేశదిమ్మరిగా తిరుగుతుంటానని చెప్పి చెల్లెలిని ఒప్పించి అక్కడినుండి కాశీ వెడుతున్నాని చెప్పింది. తల్లి మరణించిన ఇంట్లో తా నొక్కతే ఉండలేను గనుక, ఇప్పుడు ఉన్న ఇల్లు స్వగృహం కాదు కనుక తాను కూడా కాశీ వచ్చి కొన్నాళ్ళుంటానని చెల్లెలుకోరింది.

ఇద్దరూ కలిసి వారణాసికి చేరి కేదారేశ్వరుని దగ్గర ఒక ధర్మశాలలో ఉన్నారు. రోజూ విశ్వనాధుని దర్శనం, అన్నపూర్ణ, విశాలాక్షి మొదలైన దేవతలను పూజించటం జరిగేవి. కొన్నాళ్ళుకు అక్కడికి దగ్గరలో ఒక చిన్నభవనం అమ్మకానికి ఉన్నదని విని యోగేశ్వరి చెల్లెలు దానిని కొనాలని, కొంత కాలం కాశీవాసానికి ఉపయోగిస్తుందని భావించింది. యోగేశ్వరి కూడా మంచిఆలోచనే అనటం వల్ల ఆ ఇల్లు తీసుకొన్నారు. అక్కడ కొన్నాళ్ళు తపస్సు చేసిన తరువాత యోగేశ్వరి చెల్లెలిని విడిచి మళ్ళీ కొంతకాలానికి వస్తానని చెప్పి వెళ్ళిపోయింది.

బయలుదేరిన యోగేశ్వరికి భాద్రపద శుద్ధ అష్టమి సమీపిస్తున్న సంగతి గుర్తుకు వచ్చింది. గురువుగారు చెప్పిన మాట స్మృతిలో మెదిలింది.

బయలుదేరిన త్రోవమార్చి బృందావనానికి చేరుకొని, రాధాష్టమినాడు ఉపవసించి ఆ రోజు రాత్రి ధ్యానంలో కూర్చున్నది. అర్ధనిశా సమయానికి కాళీయోగి ధ్యాన భూమికలోకి వచ్చి రాధామంత్రాన్ని ఉపదేశించి ఆశీర్వదించి అదృశ్యమయినాడు. ఆయనతో ఎన్నో విషయాలు మాట్లాడాలని ఏవేవో చెప్పాలని ఆశించింది. కాని ఆయన దానికి అవకాశము ఇవ్వలేదు ‘ప్రాప్తమింతే' అనుకొని 40 రోజులు ఆ పవిత్ర ధామంలో జపధ్యాన సాధన చేసింది. రాసేశ్వరి యొక్క కరుణా కటాక్షాలు తనయందు ప్రసరిస్తున్న అనుభూతి కలిగింది. సంతోషము కలిగినట్లు అనిపిస్తున్నది. హ్లాదినీ శక్తి తరంగాలు తనను ముంచెత్తడం ఆమె గమనించగలిగింది.

కర్తవ్య ప్రేరణ వల్ల వంగదేశంలోని కొన్ని నిర్దిష్ట ప్రదేశాలకు వెళ్ళి చాలామంది సాధకులకు మంత్ర సాధనలవల్ల దివ్యానుభూతులు కలగటానికి తోడ్పడింది. కాళీయోగి శరీరాన్ని విడిచి పెట్టిన తరువాత మామూలు వస్త్రములు కాక కాషాయ వస్త్రధారిణయై విభూతి, కుంకుమ రెండూ ముఖమున ధరించి కంఠమున రుద్రాక్షమాలతో ఆమె నడచి వస్తూంటే తేజస్విని యైన ఒక మహాయోగిని కదలివస్తున్నట్లుగా ఉండేది. చూడటానికి 25సం|| మాత్రమే ఆమె శరీరంపై కనబడేది. అక్కడి నుండి, భారతదేశములోని ఎన్నో దివ్యక్షేత్రములు దర్శించింది. ప్రధానంగా కాళీక్షేత్రములయిన ఉజ్జయినిలో, కామాఖ్యలో ఎక్కువ కాలం గడిపింది. అన్నిటికంటే కామాఖ్య అమెను ఎక్కువ ఆకర్షించటంవల్ల చాలాసంవత్సరాలు అక్కడే గడిపింది. హిమాలయాలకు వెళ్ళి తన గురువుగారు తపస్సు చేసిన గుహలో చాలాకాలం కాళీసాధన చేసింది. ధ్యానంలో కాళీదేవి, ఆమె సన్నిధిలో గురుదేవులు కనిపించేవారు.


( సశేషం )

🌹🌹🌹🌹🌹


No comments:

Post a Comment