సిద్దేశ్వరయానం - 104 Siddeshwarayanam - 104

🌹 సిద్దేశ్వరయానం - 104 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵 కాళీసాధన 🏵


గుంటూరు జిల్లాలో పోలీసు సూపరింటెండెంట్గా చేసిన ఒక ఐ.పి.యస్. అధికారి పూర్వాశ్రమంలో నాకు ఆప్తుడు. అతడు పూర్వజన్మలో కళింగ రాష్ట్రంలో రాజవంశానికి చెందినవాడు. తీవ్రమైన అనారోగ్యంపాలై నూటయాభై సంవత్సరాల క్రింద భువనేశ్వర్ ప్రాంత అరణ్యంలోని నా ఆశ్రమానికి వచ్చి 40 రోజులు ఉండి కాళీపూజ చేసి ఆరోగ్యాన్ని పొంది వెళ్ళాడు. అప్పటి అనుబంధం ఇప్పుడూ వచ్చింది. అతడు శ్రీకాకుళం జిల్లాకు పోలీసు సూపరింటెండెంట్గా ఉన్నపుడు ఒరిస్సాలో వరదలు వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇతని నేతృత్వంలో ఒక సహాయ బృందాన్ని పంపించింది. తెలియకుండానే తన పూర్వజన్మ ప్రాంతానికి అతడు సేవచేయకలిగాడు. జన్మాంతర బంధాలు మనుష్యులను అలా లాక్కువెడుతుంటాయి.

18వ శతాబ్దంలోని మరొక సంఘటన కూడా ఆ మధ్య కనిపించింది. నేను కుటుంబంతో పరివారంతో శిష్యులతో కలసి తమిళనాడులో బయలుదేరి కళింగారణ్యాలలో ఉన్న కాళీదేవిని చూడటానికి వెళుతున్నాను. ఆంధ్రభూమిలో కొంతదూరం ప్రయాణం చేసి విశాఖపట్నం దాటి విజయనగరం చేరుకొని అక్కడి ఒక రెండంతస్థుల భవనంలో విడిది చేశాము. నేను మేడమీద ఉండగా అర్ధరాత్రి గందరగోళంగా కేకలు వినిపించినవి. లేచి చూస్తే దోచుకోటానికి దొంగలు సాయుధులై వచ్చారు. నా పరివారంలోని వారు వారిని తరిమి వేయటానికి పోరాడుతున్నారు. చివరికా దొంగలు పారిపోయినారు. ఆనాడు దొంగలతో పోరాడిన వారిలో ఒక వ్యక్తి ఇప్పుడు జన్మమారి నాకు ఎంతో సేవచేశాడు.

అదే విధంగా అప్పటి శిష్యులలో మరొక వ్యక్తి ఇప్పుడు పోలీసుశాఖలో అత్యున్నత పదవిలో ఉన్నాడు. సామాన్యంగా ఉన్నతోద్యోగాలలో ఉన్నవారు అధికార గర్వితులై ఉంటారు. దైవసాధన తీవ్రంగా చేసే లక్షణం అరుదుగా ఉంటుంది. ఆస్తికులుగా ఉండవచ్చు, దేవాలయాలకు వెళ్ళి అక్కడ ప్రత్యేకమర్యాదలు పొందవచ్చు. కాని కష్టపడి జపహోమాలు సాధనదృష్టితో చేయటం విశేషం. ఆ విశేషమే ఈ అధికారికి అబ్బింది. ఆనాడు నా ఆశ్రమంలో చేసిన సాధన, నా రక్షణకై చూపిన సాహసం. చేసిన పుణ్యకార్యములు ఉన్నత పదవినివ్వటమేకాక తీవ్రసాధక లక్షణాన్ని కూడా పెంపొందించినవి.

ఆనాటి నా ప్రయాణ సమయంలో తెలుగుదేశంలో ఒకచోట వరదలు వచ్చినవి. ఆ ప్రాంతానికి చెందిన ఒక జమీందారిణి ఆ కష్టంలో ప్రజలను ఎంతో ఆదుకొన్నది. తనపరివారంతో ఆహార ధనాది వస్తువులతో ఎంతో సేవ చేసింది. నాయందు భక్తి కలిగి మంత్రోపదేశం స్వీకరించింది. శ్రద్ధాభక్తులతో ఆ దేవతాసాధన చేసింది. ఈ రెండింటివల్ల లభించిన పుణ్యఫలితంగా ఈ జన్మలో చదువు సంస్కారము దేవాదాయ శాఖలో ఉన్నతోద్యోగము లభించినాయి. ఇప్పుడు కూడా మళ్ళీ నా దగ్గరకు వచ్చి ఉపదేశం పొంది శ్రద్ధగా మంత్రసాధన చేస్తున్నది.

కాళి యొక్క ఒక తీవ్రరూపం ప్రత్యంగిరా భద్రకాళి హైదరాబాదులో ఈ దేవతకు ఆలయం నిర్మించాము. అక్కడ ఉండగా ఒక రోజు ఆంధ్రప్రదేశ్ గవర్నరు నుండి ఆహ్వానం వచ్చింది. వారి అధికారులు దగ్గర ఉండి అన్ని ఏర్పాట్లు చేశారు. గవర్నరు పాదపూజ చేసుకొన్నాడు. అప్పుడు నేను వారితో "ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత రాజభవన్లో ఇంతవరకు ఏ పీఠాధిపతికైనా పాదపూజ జరిగిందా" అన్నాను. 'లేదు' అన్నారు వారు. “మీరెవరికైనా పూర్వం చేశారా ?" అన్నాను. ఆయన "నేను మా రాష్ట్రంలో ఉండగా ద్వారకాపీఠాధిపతికి చేశాను. మీకు ఇప్పుడు చేశాను. నాకు రెండవ అవకాశం ఇది" అన్నారు. ఆయన వ్యక్తిగతమైన కోరిక ఒకటి కోరారు. ఆశీర్వదించాను. కొద్దిరోజుల్లో అది జరిగి ఇంకా ఉన్నతమైన ఆయన కోరిన పదవికి వెళ్ళిపోయినాడు. ఆయనకు ఒకటే సందేశమిచ్చాను "ఎక్కడ ఉన్నా మీ శక్తిని ధర్మ రక్షణకు వినియోగించండి” చేతనైనంత తప్పక చేస్తాను అన్నాడతడు. ఒక యతికి గౌరవాగౌరవాలతో పని లేదు కాని కాళీదేవి ఈ సంప్రదాయ కీర్తికి చేసిన లీల ఇది. భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పాదపూజ చేసుకొన్నప్పుడు కూడ కాళీదేవి ఇలానే ఆయన అభీష్టం తీర్చి తన దివ్యలీలను ప్రదర్శించింది.

( సశేషం )

🌹🌹🌹🌹🌹


No comments:

Post a Comment