సిద్దేశ్వరయానం - 97 Siddeshwarayanam - 97

🌹 సిద్దేశ్వరయానం - 97 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵 మృతజీవులు - మాతంగీసాధన - రేణుకా సాధన 🏵


మానవులు మరణించిన తరువాత ఎక్కడకు వెడతారు ? ఏమవుతారు? అన్నది పురాణ వాఙ్మయంలో విస్పష్టంగా చెప్పబడింది. అయినా అనుభవానికి వచ్చేసరికి ఎవరి అనుభవము వారిదే. కృష్ణమూర్తి అని నా కొక బాల్య స్నేహితుడుండే వాడు. కవిత్వంలో కొంత కృషి చేశాడు. తాలింఖానాలో నాతో కలసి వ్యాయామం చేసేవాడు. కుస్తీపట్టేవాడు. ఉద్యోగరీత్యా కొన్నాళ్ళకు హైదరాబాదు బదిలీ అయింది. మూడు దశాబ్దాలకు పైగా అక్కడే ఉద్యోగం చేసి రిటైరయిన తరువాత ఆధ్యాత్మిక మార్గంలో జీవితం గడుపుదామని గుంటూరు వచ్చేశాడు. అతడికి భార్య మరణించింది. ఒక పిల్లవాడు హైదరాబాదులో స్థిరపడ్డాడు. గుంటూరులో అతనికి స్వగృహం ఉన్నది. అక్కడ ఉంటూ రోజూ ప్రొద్దున, సాయంత్రం నా ఆశ్రమానికి వచ్చేవాడు. జపహోమ ధ్యానములు చేసేవాడు. నాతో పాటు, బృందావనం మొదలయిన క్షేత్రాలకు తీర్థయాత్రలకు కలసి వచ్చేవాడు. సాధన తీవ్రతవల్ల దివ్యచక్షువు వికసించడం మొదలు పెట్టింది. పరిపూర్ణ సిద్ధి లభించకముందే ఆయువుతీరి మరణించాడు.

ఆ సమయానికి నేను అమెరికాలోని డెట్రాయిట్లో అతని సోదరి ఇంట్లో ఉన్నాను. ఆమె తన సోదరుడు మరణానంతరం ఏ స్థితికి వెళ్ళాడో చూచి అవసరమయిన సహాయం చేయమని అభ్యర్థించింది. దశాహం పూర్తయిన తరువాత చూస్తానని చెప్పి ఆ తరువాత ఒకనాడు ధ్యానంలో చూచాను. అతడు చేసిన తపస్సు, సత్కార్యములు, వాటి పుణ్యం వల్ల ఒక దివ్య భూమికలో చాలా సుఖంగా ఉన్నాడు. నన్ను చూచి సంతోషంగా పలకరించి “ఇక్కడ చాలా బాగుంది. నీవు కూడా ఇక్కడకు వచ్చేసెయ్యి" అన్నాడు. నే నతనితో ఈ రాకపోకలు మన చేతిలోనివి కావు. భూమి మీద ఎంత కాలం ఉండాలని పరమేశ్వరి నిర్దేశిస్తే అంతకాలం ఉండి కర్తవ్యపాలన చేయవలసి ఉంటుంది. నా సమయం ఇప్పుడే కాదు నీకు శుభమగును గాక !” ఇతనితోనే కాక మరణించిన జీవులు మరి కొందరితో కూడా కొన్ని సందర్భాలలో మాట్లాడటం జరిగింది.


🏵 మాతంగీసాధన 🏵

దశమహావిద్యలలో మాతంగి అంటే ఏర్పడిన ఇష్టం వల్ల కొద్ది రోజులు మాతంగీ సాధన చేశాను. ఒక రాత్రి ధ్యానసమయంలో దర్శనమిచ్చి షుమారు అరగంట సేపు వీణానాదాన్ని వినిపించింది. ఆ అనుభవానికి పరవశించి ఈ పద్యం చెప్పాను.

సీ॥ వినిపించె నేదేవి విమలగాంధర్వంబు మాణిక్యవీణపై మరులు గొలుప సాక్షాత్కరించె నే జలజాక్షి కోమల శ్యామలామల తనూచ్ఛాయతోడ

సంగీతసాహితీస్తనపటీరసుగంధ మేదేవి నాకైత నివతళించె చూపించె నేదేవి సుఖపరమావధి మదనదేవుని కళామంటపమున

గీ॥ ఏమహాదేవి నా యందు కృప వహించి నన్ను రమణీయ రసజగన్నాధు చేసె ఆ మహాశక్తి మాతంగి - ప్రేమమూర్తి ఎపుడు నా గుండెలో వసియించుగాక!


🏵 రేణుకా సాధన 🏵

మా గోత్ర ఋషులలో జమదగ్ని ఒకరు. అప్పుడప్పుడు పరశురామునితో కల్గిన తాదాత్మ్యం వల్ల రేణుకాదేవి అంటే భక్తి కలిగి కొద్దిరోజులు ఆ దేవత యొక్క పంచాక్షరీ మంత్రాన్ని జపించాను. ఆమె అనుగ్రహంతో దర్శనం ప్రసాదించింది.


( సశేషం )

🌹🌹🌹🌹🌹


No comments:

Post a Comment