💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🏵 భైరవసాధన 🏵
బృందావనేశ్వరి -రాధాదేవి, సిద్ధశక్తి స్వరూపిణి - కాళీదేవి, పీఠాధిదేవత లలితాదేవి. జీవితంలో ప్రధాన స్థానం ఆక్రమించుకొని ఉండగా పర్వతాగ్రం నుండి జలపాతం దూకినట్లుగా నాలోకి భైరవుడు ప్రవేశించాడు. అభౌమ భూమికల నుండి కాలభైరవ మంత్రోపదేశం జరిగింది. కాశీ వెళ్ళి అక్కడ ఈ మంత్రసాధన చేయాలన్న వాంఛ ప్రబలమైంది. అంతకుముందు కాశీకి తల్లిదండ్రుల అస్థి నిమజ్జనం కోసం ఒకసారి వెళ్ళటం జరిగింది. ఇప్పుడు పీఠాధిపతిగా సపరివారంగా సుమారు వందమందితో వారణాసి చేరుకొన్నాము. వెళ్ళిన రెండురోజులకు నాతో వచ్చిన ముగ్గురికి మరణగండం ఉందని కాలభైరవుడు తెలియచేశాడు. ఆ ముగ్గురు నాకు అత్యంత సన్నిహితులు. వారిని రక్షించమని ప్రార్థించాను. ఆ రోజు రాత్రి కాలభైరవ మంత్రాన్ని జపం చేశాను. నాతో వచ్చినవారిలో ఒకరికి పక్షపాతం వచ్చింది. తాత్కాలికంగా వైద్యసేవ చేయించి ఆసుపత్రిలో చేర్చటం జరిగింది. తలలో రక్తప్రసారానికి ఏదో ఆటంకం కల్గిందని, కపాలానికి రంధ్రం చేసి శస్త్ర చికిత్స చేశారు. రెండు రోజులలో అతడు మామూలు మనిషి అయినాడు. ఇప్పుడతడు అవసరమైనప్పుడల్లా కాలభైరవునికి మ్రొక్కు కొంటున్నాడు. అతని కష్టం తీరుతున్నది. నాతోపాటు ప్రతిసారి కాశీ వచ్చి కాలభైరవునకు మ్రొక్కు చెల్లించుకొంటున్నాడు.
మరొకరి విషయంలో భైరవుడు బస్సు ప్రమాదాన్ని సూచించాడు. మరునాడు వీరు మరికొందరు బస్సులో గయ బయలుదేరుతున్నారు. నేను మొదట్లో వెడదామని అనుకోలేదు. కానీ ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది. భైరవాలయానికి వెళ్ళి నమస్కరించాను. అర్చకులు నల్లని పూలమాల ఇచ్చారు. స్వామికి దేవా ! వీరికి ప్రమాదం తప్పాలి. నేను కూడా ఆ బస్సులో వెడుతున్నాను. ఆ పైన నీ దయ అని విన్నవించి ఆ పుష్పమాలతో నేను కూడా వెళ్ళి బస్ కూర్చున్నాను. ఎర్రని కన్నుల భైరవుని నల్లని నవ్వు నెమ్మదిగా వెన్నెలలాగా తెల్లగా మారటం కన్పిస్తున్నది. బస్సుకు ఏ ప్రమాదమూ జరుగలేదు. ఈ మధ్య బృందావనంలో కూడా ఒక విచిత్రం జరిగింది. రాధాకృష్ణుల చిత్రపటం ఎదురుగా ఉన్నది. ఆ రోజు ననాతన గోస్వామి పూజించిన మదనగోపాలునిఆలయానికి వెళ్ళటం అక్కడి మహంతు సుపరిచితుడు కావటం వల్ల దేవతలకు అలంకరించిన ఒక పూలమాలను ఇవ్వటం, నా మామూలు పద్ధతిలో దానిని ధరించి జపం చేయటం జరుగుతున్నది. శ్యామల కోమల దేహంతో మురళీధరుడు వచ్చి నించొన్నాడు. రాధాదేవి దూరం నుంచి నెమ్మదిగా వస్తున్నట్లు అనిపిస్తున్నది. ఇంతలో శ్వానసహితుడై భైరవుడు వచ్చాడు. ఆశ్చర్యం ! రాధాదేవి నుండి గౌరకాంతి కిరణాలు ప్రసరిస్తుంటే భైరవుడు, శునకము రెండూ తెల్లగా మారి ప్రసన్నాకృతి ధరించటం జరిగింది. బృందావనధామానికి అధీశ్వరి అయిన రాధాదేవి సామ్రాజ్యంలోకి నా మీది ప్రేమతో అడుగు పెట్టిన భైరవుడు కూడా ఆమె ప్రభావం వల్ల ధవళసాత్వికమూర్తిగా మారాడు.
భైరవుడు చాలామందికి జరగబోయే ఆపదలను ముందు తెలియచేస్తున్నాడు. ఒకసారి నేను నెల్లూరులో భాగవతసప్తాహ ప్రవచనాలు చేస్తున్నాను. నా బాల్య మిత్రుడొకడు మంచి రచయిత. నాకు తన గ్రంథము నొకదానిని అంకితం చేశాడు కూడా. భైరవుడు ఒక రోజు కనిపించి 'అతనికి మృత్యువు రాబోతున్నది' అన్నాడు. రక్షించమని అడగబోతున్నాను ఇంతలోనే నవ్వుతూ “అతని ఆయువు అయిపోయింది. మరణం తప్పదు. నీకు మిత్రుడు కనుక ముందు తెలియచేశాను" అని అదృశ్యమైనాడు. కొద్ది రోజులకే నిర్దిష్ట సమయానికి ఆ మిత్రుడు మరణించాడు. అతని కుమారుని విషయంలోనూ ఇటువంటిదే ఒక చిత్రం జరగింది. అతనికి ముగ్గురు కుమారులు. మధ్యవాడు పెరిగి పెద్దవాడవుతుండగా పోలియోనో లేక పక్షవాతమో వచ్చి వికలాంగు డయినాడు. అన్నీ మంచంలోనే. అతనిని బాగు చేయమని స్నేహితుడర్థించాడు. ఆశ్రమంలో ఆ బాలుని కోసం హోమం చేయించాను. ఆనాటి రాత్రి అతని సూక్ష్మదేహం కనిపించి “నా కోసం ఏ మంత్ర ప్రయోగములు హోమములు చేయించవద్దు. నేను పూర్వజన్మలో ఒక యోగిని. చేసిన కొంత దుష్కృతం ఇంకా అనుభవించవలసి ఉన్నది. దానికోసం జన్మ ఎత్తాను. ఆ మిగిలిన కర్మ ఈ వ్యాధి రూపంలో అనుభవించి త్వరలో నేను వెళ్ళిపోతాను. ఆ తరువాత నాకు మళ్ళీ మంచి జన్మవచ్చి తపస్సాధన చేస్తాను” అని చెప్పింది. అనంతరం కొద్దిరోజులకే అతడు మరణించాడు. జీవుల ప్రయాణంలో జరిగే ఇటువంటి చిత్రవిచిత్రాలను భైరవుడు తెలియ చేస్తున్నాడు.
( సశేషం )
🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment