🌹. సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్ డాక్ట్రిన్) - 17 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ
🍃. యోగము, అనుష్ఠానము 🍃
85. యోగము ఒక గ్రంథము కాదు. ఇది అనుష్ఠాన ప్రధానమైనది. అనుభవ పూర్వకమైనది. పాండిత్యమునకు, గ్రంథస్థమునకు, ఉపన్యాసములకు అతీతమైనది. అందుకు క్రమశిక్షణ, గురుశుశ్రూష, సాధుసాంగత్యము అవసరము.
86. ఆత్మ అనాత్మల భేదములను మొదట గ్రహించవలెను. సిద్ధాంతములపై పోరాడువారికి ఆధ్యాత్మ రహస్యములు ఎప్పటికీ అందుబాటులోకి రావు. సాధన లేనిదే ఆత్మ ప్రాప్తిని పొందలేడు.
87. నిరంతరం సూత్రప్రాయంగా పురుష ప్రయత్నంతో యోగము అభ్యాసము చేసిన సిద్ధి లభించగలదు.
88. గురువులు వేదాంతమును తక్కువగా చెప్పి సాధన, యోగ ప్రక్రియలను గూర్చి ఎక్కువగా బోధించవలెను. లక్ష్యమును అతి స్వల్పముగా చెప్పి సాధనను నొక్కి చెప్పాలి.
89. యోగము ఆచరణాత్మక దివ్య సాధనలను ఎల్లరు గుర్తించి ఆచరించి తరించవలెను. ఇది వాచావేదాంతము కారాదు. అనుష్ఠాన వేదాంతము. ఆచరణ వలనె యోగ ఫలితము శరీరములో పనిచేయుటను గ్రహించవలెను.
90. యోగపరిపూర్ణత, ఆత్మ పరిపూర్ణత పొందిన తరువాతే మోక్షము. పైపైన ఎన్ని పూజలు చేసినను, స్తోత్రములు వల్లించినను, నామ జపములు చేసినను, మూలాక్షరముల సహస్రనామోచ్చరణ చేసినను, ధ్యానము లాచరించినను, పుణ్య క్షేత్రములు దర్శించినను, ఎన్ని పవిత్ర నదీ స్నానములు చేసినను మోక్షము చేకూరదు. ప్రతి మానవుడు ఆచరణలో పెట్టి అనుభవములతో ఫలితములు చూచుకొనవలెను.
🌹 🌹 🌹 🌹 🌹
25/Mar/2019
No comments:
Post a Comment