రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
48. అధ్యాయము - 3
🌻. కామశాపానుగ్రహములు - 4 🌻
శివ ఉవాచ |
అహో బ్రహ్మంస్తవ కథం కామభావస్సముద్గతః | దృష్ట్వా చ తనయాం నైవ యోగ్యం వేదాను సారిణామ్ || 39
యథా మతా చ భగినీ భ్రాతృపత్నీ తథా సుతా | ఏతాః కుదృష్ట్యా ద్రష్టవ్యా న కదాపి విపశ్చితా || 40
ఏష వై వేదమార్గస్య నిశ్చయస్త్వన్ముఖే స్థితః | కథం తు కామమాత్రేణ స తే విస్మారితో విధే || 41
ధైర్యం జాగరితం బ్రహ్మన్ మనస్తే చతురానన | కథం క్షుద్రేణ కామేన రంతుం విగటితం విధే || 42
శివుడిట్లు పలికెను -
అహో బ్రహ్మన్! కుమార్తె ను చూచి నీకు కామభావము ఎట్లు కలిగినది? వేద మార్గానుయాయులకు ఇది తగదు (39).
వివేకి తల్లిని, సోదరిని, సోదరుని భార్యను, మరియు కుమార్తెను తప్పు దృష్టితో ఎన్నడునూ చూడరాదు (40).
ఇది వేద మార్గము యొక్క నిర్ణయము. వేదము నీ ముఖమునందు గలదు. హే బ్రహ్మన్! అల్పుడగు కాముడు నీవు దీనిని విస్మరించునట్లు ఎట్లు చేయగలిగెను ?(41).
నాల్గు ముఖములు గల ఓ బ్రహ్మ!నీవు మనస్సునందు వివేకమును మేల్కొలుపుము. విధే! నీవు క్షుద్రమగు కామముతో మనస్సును ఎట్లు రంజింపజేయగలవు? (42).
ఏకాంత యోగినస్తస్మాత్సర్వదాదిత్యదర్శినః | కథం దక్షమరీ చ్యాద్యా లోలుపాస్త్రీషు మానసాః || 43
కథం కామోsపి మందాత్మా ప్రాబల్యాత్సోsధునైవ హి | వికృతాన్ బాణౖః కృతవానకాలజ్ఞోల్ప చేతనః || 44
ధిక్తం శ్రు తం సదా తస్య యస్య కాంతా మనోహరత్ | ధైర్యా దాకృష్య లౌల్యేషు మజ్జయత్యపి మానసమ్ || 45
మానసపుత్రలగు దక్ష మరీచ్యాదులు ఉన్నత భూమికకు చెందిన యోగులు. అందువలననే, వారు సదా ఆదిత్యుని దర్శించువారు. అట్టి వారు స్త్రీ వ్యామోహమునెట్లు పొందిరి? (43)
మూర్ఖుడు, కాలము యొక్క ఔచిత్యమునెరుంగని వాడు, అల్పశక్తిమంతుడునగు కాముడు పుట్టిన కొద్ది సేపటికే గర్వితుడై బాణములతో మీయందు వికారమునెట్లు కల్గించినాడు? (44).
ఎవని మనస్సును స్త్రీ అపహరించునో, వానికి వాని పాండిత్యమునకు నిందయగుగాక! అవివేకులు ధైర్యము(వివేకజ్ఞానము) నుండి మనస్సును మరల్చి చంచలమగు విషయ సుఖముల యందు నిమగ్నము చేయుదురు (45)
బ్రహ్మోవాచ |
ఇతి తస్య వచశ్ర్శుత్వా లోకే సోహం శివస్య చ | వ్రీడయా ద్విగుణీ భూత స్స్వేదార్ద్రస్త్వభవం క్షణాత్ || 46
తతో నిగృహ్యైంద్రియకం వికారం చాత్యజం మునే | జిఘృక్షురసి తద్భీత్యా తాం సంధ్యాం కామరూపిణీమ్ || 47
మచ్ఛరీరాత్తు ఘర్మాంభో యత్పపాత ద్విజోత్తమ | అగ్ని ష్వాత్తాః పితృగణా జాతాః పితృగణాస్తతః || 48
భిన్నాంజన నిభాస్సర్వే పుల్లరాజీవలోచనాః | నితాంత యతయః పుణ్యాస్సంసారవిముఖాః పరే || 49
బ్రహ్మ ఇట్లు పలికెను -
అట్టి నేను ఆ శివుని మాటలను విని రెండు రెట్లు అధికముగా సిగ్గుచెందితిని. క్షణములో నా శరీరమంతయూ చెమటతో నిండెను (46).
ఓ మునీ! మనోహర రూపిణి యగు ఆ సంధ్యను పట్టుకొనవలెననే కోరిక ఉన్ననూ, నేను శివుని భయముచే నిగ్రహించుకొని ఇంద్రియ వికారమును విడిచి పెట్టితిని (47).
ఓ ద్విజశ్రేష్ఠా! నా శరీరము నుండి జారిన చెమట నీటి నుండి అగ్నిష్వాత్తులనే పితృదేవతలు, మరియు ఇంకో పితరులు జన్మించిరి (48).
వారందరు కాటుక పొడివలెనుండిరి. వారి నేత్రములు వికసించిన పద్మములవలె నుండెను. ఆ పుణ్యాత్ములు గొప్ప యతిశ్రేష్ఠులు. వారు సంసారమునందు విరక్తిగల మహానుభావులు (49).
సహస్రాణాం చతుషృష్టి రగ్ని ష్వాత్తాః ప్రకీర్తితాః | షడశీతి సహస్రాణి తథా బర్హిషదో మునే || 50
ఘర్మాంభః పతితం భూమౌ తదా దక్షశరీరతః | సమస్త గుణ సంపన్నా తస్మా జ్ఞాతా వరాంగనా || 51
తన్వంగీ సమమధ్యా చ తనురోమావలీ శ్రుతా | మృద్వంగీ చారుదశనా నవకాంచన సుప్రభా || 52
సర్వావయవరమ్యా చ పూర్ణ చంద్రాననాంబుజా | నామ్నా రతిరితి ఖ్యాతా మునీనామపి మోహినీ || 53
ఓ మహర్షీ! అగ్ని ష్వాత్తుల సంఖ్య అరవై నాలుగు వేలు. బర్హిషదుల సంఖ్య ఎనభై ఆరు వేలు (50).
అపుడు దక్షుని శరీరము నుండి చెమట నీరు భూమిపై బడెను. దాని నుండి సమస్తగుణములతో కూడిన ఒక శ్రేష్ఠయువతి జన్మించెను (51).
ఆమె సుందరమగు అవయములను, సమమైన నడుమును, సన్నని రోమ పంక్తిని కలిగియుండెను. ఆమె అవయవములు మృదువుగా నుండెను. ఆమె దంతములు సుందరముగా నుండెను. ఆమె మెరుగుపెట్టిన బంగారము వలె కాంతులీనెను (52).
ఆమె అన్ని అవయవముల యందు రమ్యముగా నుండెను. ఆమె ముఖము పున్నమి నాటి చంద్రుని బోలియుండెను. మునులను కూడ మోహింపజేయు ఆమెకు రతి యని పేరు (53).
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
09.Sep.2020
No comments:
Post a Comment