కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 49



🌹.   కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 49   🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మ విచారణ పద్ధతి - 13 🌻

అంటే, ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, ఆ నిర్ణయాన్ని అమలు పరిచేటప్పుడు, ఏ స్థితిలో ఇతడున్నాడు? అనేది చూస్తారన్నమాట! అంటే, మనసు స్థితిలో వున్నాడనుకోండి, అప్పుడు రజోగుణ ధర్మంగా చంచలంగా వుంటాడన్నమాట!

శరీరమనే దాంట్లో (శరీరధర్మంగా) ప్రధానంగా వున్నాడనుకోండి అప్పుడు తమోగుణ ధర్మంతో జడంగా వుంటాడు. కాబట్టి, సూక్ష్మబుద్ధియై గ్రహించగలిగేటటువంటి శక్తి కలిగిన వాడై వుండి, ‘బుద్ధిగ్రాహ్యమతీంద్రియం’ అనేటటువంటి స్థితికి బుద్ధి వికసించినటువంటిదై వుండాలి. అటువంటి వాడిని బుద్ధిమంతుడు అంటారు.

ఇంకేమిటి? అంటే, ‘ధైర్యశాలివి’ - ధైర్యశాలి అంటే అర్థం ఏమిటంటే, మరణము యొక్క రహస్యాన్ని, మరణాన్ని ఎదిరించేటటువంటి పద్ధతిని, మరణం లేకుండా చేసుకునేటటువంటి పద్ధతిని, జన్మలేకుండా చేసుకునేటటువంటి పద్ధతిని ఆశ్రయించాలి అంటే, నువ్వు ధైర్యశాలివై వుండాలి.

ఎందుకని అంటే, మానవులందరూ సాధారణంగా ఒక రకమైనటువంటి పోరాట పటిమను ప్రదర్శిస్తూ వుంటారు. ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు, ఆయా సమస్యలను ఎదిరించడం కోసం అని, ధైర్యం అనేటటువంటి లక్షణాన్ని ఆశ్రయిస్తూ వుంటారు.

కానీ నిజానికి ఆత్మస్థైర్యం - ఆత్మయందు స్థైర్యం కలిగి వుండాలన్నమాట. అంటే, ‘నేను’ అనేటటువంటి స్వరూపజ్ఞానంలో సరియైనటువంటి పట్టు కలిగి వుండాలి. ఎందువల్ల అంటే, జననమరణాలను దాటటం కంటే, మానవజన్మలో అత్యంత గొప్పదైనటువంటి లక్ష్యం లేదన్నమాట.

జన్మసాఫల్యత పొందాలి అంటే, జన్మ అధికారాన్ని పొందినటువంటిది ఏదైతే వుందో, ఈ మానవజన్మ సాధికారతకు సరియైనటువంటి సఫలత, నీ జనన మరణ రాహిత్యంలోనే వుందన్నమాట. దానికి కారణం ఏమిటి అనంటే, కామభోగ ప్రాప్తిని త్యజించటానికి ధైర్యం కావాలి. సాధారణంగా ప్రతీదానికి లొంగిపోతూ వుంటాడు మానవుడు.

ఏదో ఒక అంశానికి లొంగిపోయి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాత్మకమైనటువంటి బాహ్యప్రపంచంతోనో, ఇంద్రియాలతోనో సంయోగ వియోగాలను పొందుతూ తత్‌ ప్రభావ రీతిన, వాటికి లొంగేటటువంటి తత్వాన్ని, బుద్ధిని కలిగివుంటాడు. దానిని ఎదిరించి బుద్ధిని సాక్షిగా నిలుపగలిగేటటువంటి సమర్థత కోసమే ఈ ధైర్యం.

కాబట్టి, ‘ధైర్యం’ అంటే ఎదుటివారిని నిరసించడమో, ఎదుటివాడిని కోప్పడడమో, ఎదుటివాడిని పోట్లాడడమో, ఎదుటివారితో జగత్తుమీద వీపరీతమైనటువంటి చర్యలతో విరుచుకుపడటమో లేదా సాధు సజ్జన సంతతిపై తన బలదర్ప ప్రభావములను చూపించటమో ఇవేమీ ధైర్యములు కావన్నమాట! నీయందే వున్నటువంటి అరిషడ్వర్గాలను జయించటానికి నీకు ధైర్యం కావాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటిది.

కామ, క్రోథ, లోభ, మోహ, మద, మాత్సర్య, రాగ, ద్వేష, అసూయ వంటి లక్షణాలను జయించటానికి ధైర్యం కావాలి. అటువంటి ధైర్యం కలిగిన వాడు మాత్రమే, ఈ ఆత్మజ్ఞానాన్ని పొందటానికి అర్హమైనటువంటి వాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కఠోపనిషత్ #చలాచలబోధ

09.Sep.2020

No comments:

Post a Comment