నారద భక్తి సూత్రాలు - 111


🌹.   నారద భక్తి సూత్రాలు - 111   🌹

✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,

🌻. చలాచలభోధ

📚. ప్రసాద్ భరద్వాజ

పంచమాధ్యాయం - భక్తి మహిమ - సూత్రము - 81 - part 1

🌻 81. త్రి సత్యస్య భక్తిరేవ గరీయసీ, భక్తిరేవ గరీయసీ || - 1 🌻

భగవంతునికి భక్తి చేయడం అంటే ఆయనను త్రికరణ శుద్ధిగా ప్రేమించడమే. అలా ప్రియతమ భగవంతుడిని ప్రేమికుడిగా ప్రేమించడం ఉత్తమ భజన అవుతుంది. ముమ్మాటికీ ప్రియతముడు, ప్రేమికుడు అనే పద్ధతిలో ప్రేమించడమే ఉత్తమం.

నామ రూపాలు లేని భగవంతుడిని ఎలా ప్రేమించడం ? లక్షణ వృత్తిగా ప్రకృతి ధర్మాలకు వ్యతిరేకార్థంగా నిర్ణయించిన నామాలే భగవన్నా మాలు. ఆనృత జడ దుఃఖాలకు వ్యతిరేకార్థంగా సత్ చిత్ ఆనందమని భగవంతుని నామం. ప్రకృతి ఇహం అయితే పరమాత్మ పరం.

ప్రకృతి అనిత్యమయితే ఆయన నిత్యుడు. అలాగే అన్ని నామాలూ, బోధనార్థం భగవంతుడికి పరం, నిత్యం, సత్యం, జ్ఞానం, అనంతం, అద్వయం, నిర్వి కారం, నిరాకారం, అచలం, సనాతనం మొదలైన నామాలతో పిలుస్తారు.

ఈ నామాలు అర్థం చేసుకుంటే ఆయన ఇంద్రియ గోచరం కాదని తెలుస్తుంది. అందువలన ఆయనను ప్రేమించడం ఎలా? మంచిని ప్రేమిస్తాం.

మంచితనం ఎలా కనబడుతుంది? ఆ గుణమున్నవాడు చేసే క్రియలలో మంచితనం తెలుస్తుంది. మంచివాడిని ప్రేమిస్తే మంచితనాన్ని ప్రేమించినట్లే అవుతుంది. మనం దేహాన్ని ప్రేమించడంలేదు. ఆ దేహంలో ఉన్న మంచితనాన్ని ప్రేమిస్తున్నాం. వాడిలో మంచితనం లేకపోతే ఆ దేహం ప్రేమించబడటానికి యోగ్యం కాదు.

అలాగే భగవంతుని ప్రేమించడానికి రామకృష్ణాది అవతార రూపాలను ప్రేమిస్తాం. ఆ అవతార మూర్తులు ఇప్పుడు లేరు కదా అంటే, ఆయా రూపాలలోని దైవత్వం శాశ్వతం కదా! మనం దైవాన్ని ప్రేమిస్తున్నప్పుడు, రూపం అనేది మొదట్లో దైవత్వానికి చిరునామాగా ఉంది. దైవ భావం అర్థం కాగానే చిరునామాతో పనిలేదు కదా ! మన పెద్దలను వారు బ్రతికి ఉన్నప్పుడు ప్రేమించామనుకోండి. వారిప్పుడు లేకపోయినా వారి పటాన్ని పెట్టుకొని ప్రేమ వ్యక్తం చేయడం లేదా ? వారికిప్పుడు రూపం లేదు. పటమే వారు కాదు. అయినా వారిపై ప్రేమ వ్యక్తం చేయడానికి ఆ పటం ఆధారమైనట్లే, భగవంతుని అవతార రూపాలు, విగ్రహాలు మనకు ఆధారమవుతాయి. పెద్దల పటం మన ఎదుట లేకపోయినా, ప్రేమించగలం.

అలాగే భగవంతుని రూపం మనస్సులో పెట్టుకొని ఆయనను ప్రేమిస్తాం. బొమ్మలే కదా అని వాటిని పారేస్తే భగవంతుని అవమానించినందుకు భక్తుడు విలపిస్తాడు. త్యాగరాజు ఆరాధించే రాముడు మొదలైన విగ్రహాలను కావేరీ నదిలోకి విసిరేస్తే ఆయన విలపించగా, కావేరి పొంగి ఆ విగ్రహాలు నది ఒడ్డుకు కొట్టుకు వచ్చేటట్లు చేసింది. ఆ విగ్రహాలు దొరకగానే త్యాగరాజ స్వామి ఎంతో ఆనందించారు. మనమైనా, మన పెద్దల పటాన్ని అవమానిస్తే పటమే కదా అని ఊరుకోం కదా ! మన పెద్దలనే అవమానపరచినట్లు భావిస్తాం.

ఈ విధంగా భగవదారాధన ద్వారా భక్తిని పెంచుకోవడమంటే ఆయనను అధికాధికంగా, ఇంకా అధికంగా ప్రేమించడమే. ఈ ఆరాధన కోసం భగవత్స్వరూపాలను అనేక వ్యూహాలుగా, విభవాలుగా నిర్ణయించారు విశిష్టాద్వైతులు. భక్తులకు విభవ రూపాలు ఆరాధ్యం.

వీటిలో పూర్ణావతారం, ఆవేశావతారం, పామరజన మోహనావతారం, అంశావతారం, అర్చావతారం అని అయిదు విధాలు.

1. పూర్ణావతారం : ధర్మ సంస్థాపన కొరకు భూలోకంలో అవతరించిన మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, రామ, కృష్ణావతారాలుగా చెప్తారు. ఈ అవతారాల వల్లనే భక్తులు ముముక్షువులై భగవదనుగ్రహం పొందుతున్నారు, ముక్తులవు తున్నారు.

2. ఆవేశావతారం : పరశురాముడు విష్ణువు యొక్క ఆవేశం వలన అవతార కార్యక్రమం నెరవేర్చేవాడు.

3. పామరజన మోహనావతారం : బౌద్ధావతారం పామరులకు ఆకర్షణ.

4. అంశావతారాలు : శివుడు, అర్జునుడు, వ్యాసుడు నారదుడు మొదలగు అవతారాలు.

5. అర్చావతారం : లోహ శిలా రూపాలు, ప్రతిమలు, విగ్రహాలు. దేవాలయాలలో ప్రతిష్ఠించబడినవి కొన్ని, వెలిసిన విగ్రహాలకు దేవాలయాలు నిర్మించబడినవి కొన్ని, భక్తుల గృహమందు పూజింపబడే సాలగ్రాములు మొదలైనవి. భక్తులచే షోడశోపచారాలు స్వీకరించి వారి అభీష్టాలను సిద్ధింపచేసేవి ఈ అవతారాలు.

ఈ విగ్రహాలు జ్ఞానం, శక్తి, ఐశ్వర్యంతో కూడి ఉంటాయని విశ్వసించాలి. ఈ విగ్రహాలను జడమనడం భగవదనుగ్రహానికి విరోధమవుతుందని విరోధోపాయ స్వరూపంలో చెప్పబడింది. అందుకే విగ్రహాలకు పవళింపు సేవలు, మేలుకొలుపులు, కళ్యాణాలను జరుపుతూ ఉంటారు. ఇవన్నీ భక్తులు నామ రూపాలు లేని భగవంతుని ప్రేమించడానికి తగిన ఉపాయాలుగా తీసుకోవాలి.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


01 Oct 2020

No comments:

Post a Comment