శ్రీ శివ మహా పురాణము - 247



🌹 .   శ్రీ శివ మహా పురాణము - 247   🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

56. అధ్యాయము - 11

🌻. దుర్గాస్తుతి - 2 🌻

బ్రహ్మ ఇట్లు పలికెను -

దేవీ! మహేశ్వరీ! నాపై దయఉంచి వినుము. నీవు సర్వము నెరుంగుదువు. అయిననూ నీ ఆజ్ఞచే నా మనస్సులోని కోర్కెను చెప్పెదను (20). హే దేవేశీ! నీ భర్త పూర్వము నా నుదుటి నుండి ప్రకటమయ్యెను గదా ! ఆ శివ యోగి రుద్రనామముతో కైలాసముపై నున్నాడు (21).

కూటస్థుడు (పరివర్తన లేని వాడు) అగు ఆ భూతనాథుడు అచట తపస్సును చేయు చున్నాడు. భార్యా సహాయము లేనివాడు, వికారహీనుడు అగు ఆ ప్రభువు భార్యా సహాయమును కోరుట లేదు (22).

ఓ పతివ్రతా! ఆతడు వివాహమాడుట కొరకై నీవాయనను మోహింపజేయుము. నీవు తక్క ఆయన మనస్సును ఆకర్షించగలవారు మరియొకరు లేరు (23).

కావున నీవే దక్షునకు కుమార్తెగా జన్మించుము. హే శివే! నీవు నీ రూపముతో రుద్రుని మోహింప జేసి ఆయనకు భార్యవు అగుము (24).

నీవు లక్ష్మీరూపముతో శరీరమును ధరించి కేశవుని అలరించినావు. లోక కళ్యాణము కొరకు రుద్రుని కూడ అటులనే చేయుము (25).

ఓ దేవీ! నేను కాంతను అభిలషించినంత మాత్రాన నన్ను నిందించిన ఆ వృషభధ్వజుడు తన ఇచ్ఛచే భార్యను స్వీకరించుట ఎట్లు సంభవమగును ? (26).

ఈ సృష్టి యొక్క ఆది, మధ్య, అంతములకు కారణభూతుడైన ఆ హరుడు విరాగియై భార్యను స్వీకరించని స్థితిలో ఈ సృష్టి మంగళకరము ఎట్లు కాగల్గును ?(27).

ఈ చింత నన్ను పీడించుచున్నది. నీవు తప్ప మరియొకరు నాకు శరణు లేరు. నేనీ కష్టములో నున్నాను. కాన, లోకహితమును గోరి నా కోరికను దీర్చుము (28). ఆయనను విష్ణువు గాని, లక్ష్మిగాని, మన్మథుడు గాని, నేను గాని మోహపెట్టలేము. ఓ జగన్మాతా! నీవు తప్ప మరియొకరి వలన ఈ పని కాదు (29).

కావున, నీవు దక్షుని కుమార్తెగా జన్మించి, దివ్యరూపము గల దానవై, యోగియగు ఈశ్వరుని మోహింపజేసి ఆయనకు భార్యవు కమ్ము. మహేశ్వరీ! నా భక్తిని ఈ విధముగా సఫలము చేయుము (30). ఓ దేవ దేవీ! దక్షుడు క్షీర సముద్ర ఉత్తర తీరమునందు దృఢమగు వ్రతము గలవాడై మనస్సును నీయందు లగ్నము చేసి నిన్ను ఉద్దేశించి తపస్సును చేయు చున్నాడు (31).

ఈ మాటను విని, ఆపుడా ఉమాదేవి ఆలోచించ మొదలిడెను. ఆ జగన్మాత విస్మయమును పొంది తన మనస్సులో ఇట్లు అనుకొనెను (32).

దేవి ఇట్లు పలికెను -

అహో! ఇది చాల పెద్ద ఆశ్చర్యము! వేద ప్రవర్తకుడు, సృష్టికర్త, మహాజ్ఞాని యగు ఈ బ్రహ్మ ఏమి మాటలాడు చున్నాడు? (33).

బ్రహ్మ యొక్క మనస్సులో దుఃఖదాయకమగు మహా మోహము పుట్టినది. అందువలననే వికార రహితుడగు శివప్రభువును మోహింప జేయ గోరు చున్నాడు (34).

హరుని మోహింపజేయవలెననే వరమును ఈ బ్రహ్మ నానుండి పొంద గోరుచున్నాడు దాని వలన ఈతనికి కలిగే లాభమేమి? ఆ విభుడు కూటస్థుడు (పరివర్తన లేని వాడు) గనుక, ఆయనను మోహింపజేయుట సంభవము కాదు (35).

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము


Facebook, WhatsApp, Telegram groups:


13 Oct 2020

No comments:

Post a Comment