🍀 12. పెద్దలు - ప్రమాణములు - తమను అనుకరించు వారు ఎవరికైతే యుందురో వారికి కర్మ నిర్వహణము నందు ఒక అదనపు బాధ్యత ఏర్పడును. అదికారణముగ గుర్తింపు పొందిన పెద్దవారి కర్మనిర్వహణ విధానము ప్రమాణముగ నుండవలెను 🍀
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. కర్మయోగము - 21, 22, 23, 24 📚
21. యద్యదాచరతి శ్రేష్ఠస్తత్తదేవేతరో జనః |
స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే || 21 ||
22. న మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన |
నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి || 22 ||
23. యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః |
మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః || 23 ||
24. ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదహమ్ |
సంకరస్య చ కర్తా స్యాముపహన్యామిమాః ప్రజాః || 24 ||
యద్యదాచరతి శ్రేష్ఠ :
లోకమున పెద్దలు ఏమి చేయుచున్నారో గమనించి ఇతరులు కూడ వారి ననుకరింతురు. అందువలన పెద్దవారుగా గమనింపబడువారికి కర్మ నిర్వహణమున ఎక్కువ బాధ్యత గలదు.
తమను అనుకరించు వారు ఎవరికైతే యుందురో వారికి కర్మ నిర్వహణము నందు ఒక అదనపు బాధ్యత ఏర్పడును. తల్లిదండ్రులను పిల్లలు అనుకరింతురు. ఉపాధ్యాయులను విద్యార్థులనుకరింతురు. గురువులను శిష్యులనుకరింతురు. వివిధ రంగములలో ఉత్తమ శ్రేణికి చెందినవారిని ఆయా రంగములలో పనిచేయువా రనుకరింతురు.
అందువలన అనుకరింపబడు వారికి అనుకరించు వారి యెడల బాధ్యత యున్నది. అదికారణముగ గుర్తింపు పొందిన పెద్ద వారు వారి కర్మనిర్వహణ విధానము ప్రమాణముగ నుండవలెను.
అనుకరించువారు అనునిత్యము తాము ప్రమాణముగ నేర్పరచుకున్న పెద్దవారిని అనుసరింతురు. వారు పొగత్రాగినచో వీరును త్రాగుదురు. వారికి అపరిశుభ్రపు అలవాట్లు ఉన్నచో వీరును అట్లే యుందురు. వారసత్యము లాడినచో వీరును ఆడుదురు. వారు బాధ్యతా రహితముగ ప్రవర్తించినచో, వీరును అట్లే చేయుదురు. వారేమి చేసిన వీరును అట్లే చేయుటకు ప్రయత్నింతురు. అందువలన ప్రత్యేకముగ వారి కవసరము లేకపోయినప్పటికిని, చిన్నవారి మేలుకోరి పెద్దవారు కొన్ని కొన్ని విషయములలో మార్గదర్శకులై ప్రవర్తించవలసి యుండును.
నిజమునకు శ్రీకృష్ణునకు సాందీపని యొద్ద చేరి విద్య నభ్యసించు అవసరము లేదు. అయినను ఇతరుల శ్రేయస్సు కోరి అట్లాచరించెను. వివాహముతో పనిలేదు. అయినను సంఘ మర్యాదలు పాటించి వివాహమాడి సంతతిని కనెను. యుద్ధము చేయవలసిన పని అసలేలేదు. అయినను క్షత్రియ జన్మ మెత్తుట వలన యుద్ధమునందు పాల్గొనెను. శ్రీరాముని జీవితము గూడ చాల విషయములలో అట్లే నిర్వర్తింపబడినది.
శ్రీరాముని ఆదర్శముగ గొనిన భారతీయులు సర్వసామాన్యముగ ఏకపత్నీ వ్రతమును ఆచరించుదురు. భారతీయ సంప్రదాయమున నేటికిని ఈ భావము అధికముగ అనుసరింపబడు చున్నది. ఒక స్త్రీ కి ఒక పురుషుడు. ఒక పురుషునకు ఒక స్త్రీ. ఈ సంప్రదాయము కేవలము భరతభూమియందే ఇంకను నిలచియున్నది. భరత సంప్రదాయమునకు వెన్నెముకగ నిలచిన ఋషులందరును ముక్తసంగులే. వారికీ ప్రపంచమున ఏమియును అవసరము లేదు. పంచభూతములు వారి వశమై యుండును.
అయినప్పటికిన్ని ఇతర జీవులకు ప్రామాణికముగ నుండవలెనను బాధ్యతాయుత భావముతో వారు వివాహ మాడిరి. గృహస్థు జీవితమును నిర్వర్తించి చూపిరి. సంఘమున ఉద్యోగ వృత్తి వ్యాపారములను కూడ నిర్వర్తించిరి. అట్లు కానిచో సంఘధర్మము దెబ్బతినును. ఈ యంశము ననుసరించియే ఏసుక్రీస్తు, బుద్ధుడు మొదలగు మహాత్ములను గూడ భరతధర్మము పరిపూర్ణ మానవునిగ పరిగణించలేదు.
ఈ మహాత్ములను అనుకరించువారు కూడ వారివలె వివాహమాడక, కోరికలను అణగదొక్కుకొని సతమత మగుచున్నారు. పశ్చిమ దేశములలో మతాధికారులు లైంగిక చర్యలకు పాటుపడుచు నేరగ్రస్తులగుట ఆధునిక కాలమున గమనించబడుచునే యున్నది. గదా! సాధారణ మానవులను మనస్సులో నుంచుకొని వారికి అనుకరణీయముగ నుండు శ్రేష్ఠమగు మార్గమును పెద్దలు నిర్వర్తించుట శ్రీకృష్ణుని కర్మ సిద్ధాంతమున మరియొక ముఖ్య లక్షణము.
ప్రస్తుత కాలమున దేశనాయకులు, మతాధికారులు, విద్యావంతులు, ఉపాధ్యాయులు, వైద్యులు, అగ్రశ్రేణి వ్యాపారస్తులు, అధికారులు పనిచేయు విధానము బాధ్యతారహితముగ యున్నది. అదికారణముగనే జనబాహుళ్యము గూడ బాధ్యత తప్పినది. క్రమ శిక్షణ తరిగినది. శ్రద్ధ లోపించినది. బాధ్యతలయందు పోటీ పడుటగా కాక హక్కులయందు పోటీపడు మ్లేచ్చ ధర్మము భరత భూమిని కూడ కబళించినది. ఇట్టి స్థితికి పెద్దలే కర్తలు. పెద్దలే బాధ్యులు. వీరు జనులను చెడగొట్టిన వారగుచున్నారు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
Join and Share చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group
https://t.me/ChaitanyaVijnanam
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
13 Oct 2020
No comments:
Post a Comment