✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము -29 🌻
పంచభూతముల పంచీకరణ మూలమున శ్రోత్రాది గోళకములు ఏర్పడుతున్నవి. పంచభూతముల పరస్పర కలయిక వలన ఇంద్రియములు ఏర్పడుతున్నవి. కారణము సూక్ష్మముగాను, కార్యము స్థూలముగాను ఉండునుగదా! అవ్యక్తము ఇంద్రియములకు గోచరము కానటువంటి సూక్ష్మత్వము.
పృథ్వి అన్నిటికన్నా స్థూల తత్త్వము. స్థూల తత్వముల నుండి సూక్ష్మము, సూక్ష్మతరము నుండి సూక్ష్మతమము అయిన తత్త్వములను గ్రహించినటుల చేయుటకే స్థూలారుంధతి న్యాయమున ఈ విధముగా వర్ణింపబడినది.
అష్టప్రకృతులలో కూడిన ఈ శరీరమునందు, స్థూలములైన గోళకముల నుండి, ఒకదానికంటే ఒకటి సూక్ష్మమైన, అవ్యక్తతత్వము వరకు, విచారించుచూ వెళ్ళినచో, అష్టప్రకృతులకావల నుండు, ప్రత్యగాత్మను తెలుసుకొను విధానమును వర్ణింపబడినది.
ఒకదానికంటే మరొకటి సూక్ష్మమైనటువంటి, పద్ధతిని విచారణ చేయడం ద్వారా, మనం ప్రత్యగాత్మను తెలుసుకునేటటు వంటి ప్రయత్నాన్ని చేస్తున్నాము. ఈ తత్త్వవిచారణకి ప్రధానమైనటువంటి లక్ష్యం - ప్రత్యగాత్మ, పరమాత్మ. ప్రత్యగాత్మను తెలియడం ద్వారానే, పరమాత్మను తెలుసుకో గలుగుతాము. ఆత్మ సాక్షాత్కార జ్ఞానము ద్వారానే పరమాత్మ స్థితిని తెలుసుకోగలుగుతాము. అష్ట ప్రకృతుల గురించి, పైన ఇందులో చెబుతున్నారన్నమాట. ఏమిటి? అష్ట ప్రకృతులు? ప్రకృతి ఎనిమిది విధములుగా ఉన్నది.
పంచభూతములు, మనస్సు, బుద్ధి, అహంకారము. ఈ ఎనిమిది కలిపితే, నా మాయాశక్తి ఎనిమిది విధములుగా ఉన్నది - అని భగవద్గీతలో స్పష్టముగా చెబుతున్నారు.
భూమిరాపోఅనలో వాయుః ఖం మనోబుద్ధిరేవచ |
అహంకార ఇతీయంమే భిన్నా ప్రకృతి రష్టదా ||
‘భిన్నా ప్రకృతి రష్టదా‘ అని స్పష్టముగా చెబుతున్నారు. ఈ కాబట్టి, అష్ట ప్రకృతులన్నీ దాటాలి. అంటే ఈ త్రిగుణాత్మకమైనటువంటి విధానమంతా కూడా ఈ ఎనిమిదిట్లోనూ ఉన్నది. అంటే పంచభూతాలలో అంతా వ్యాపకంగా ఉన్నది.
అంటే, ఈ పంచభూతాలని, ఈ రకంగా కలిపినటువంటి శక్తి ఏమిటంటే, త్రిగుణాత్మకమైనటువంటి మాయాశక్తి, అంటే వాస్తవానికి ఉన్నదా? ఎత్తి చూపెట్టమంటే, ఎక్కడా చూపెట్టలేము. కానీ, లేదా అంటే, అది లేకపోతే ఒకదానితో ఒకటి సంబంధపడడం లేదు. ఈ రకంగా అంతర్లీనంగా పనిచేస్తూ, అన్నింటినీ కలుపుతూ, అన్నింటినీ వ్యవహరింప చేస్తూ, ప్రభావశీలమై ఉంటూ, వాస్తవికంగా లేనిది.
అయినటువంటిది ఏదైతే ఉన్నదో, ఆ రకంగా పంచభూతములు మనస్సు, బుద్ధి, అహంకారము అనేటటువంటి ఎనిమిది తత్త్వములను ఒకదానితో ఒకటి సంయోజనీయతను పొంది, అవస్థాత్రయ అనుభూతులను కలిగిస్తూ, కాలత్రయ అనుభూతులను కలిగిస్తూ, పరిణమింప జేస్తూ, బాల్య యవ్వన కౌమార వృద్ధాప్యములను కలిగిస్తూ, జరామరణ చక్రము నందు పరిభ్రమింప చేస్తు్న్నటువంటిది అంతా కూడా ప్రకృతి తత్వమే.
కాబట్టి, దీనిని అంతా అధిగమించాలి అంటే, మానవునికి వున్నటువంటి ఒకే ఒక తరుణోపాయం ప్రత్యగాత్మ.
దీనికి అవతల ఉన్నటువంటి సాక్షి స్వరూపం అయినటువంటి, సర్వ సాక్షి అయినటువంటి ఏదైతే కార్య కారణములకు అవతల ఉన్నటువంటి, సాక్షి స్వరూపము ఏదైతే ఉన్నదో, అట్టి సాక్షి స్వరూపమును గుర్తెరుగడమే మానవుడికి ఉన్నటువంటి తరుణోపాయము. కాబట్టి, కార్యమేమో స్థూలంగా కనబడుతోంది. కారణమేమో సూక్ష్మంగా కనబడుతోంది.
ఈ అబ్బాయి ఇలా ఉండడే! ఇలా ఎందుకు వ్యవహరించాడు? ఈ అమ్మాయి ఇలా ఉండదే, ఇలా ఎందుకు వ్యవహరించింది? అనేటటుంవంటి కార్యాన్ని విచారణ చేస్తే, కారణ స్వరూపమైనటువంటి, సూక్ష్మమైనటువంటి స్వభావం తెలుస్తుంది.
అట్టి సూక్ష్మమైనటువంటి స్వభావం తెలిసినప్పటికి ఇది కూడా ప్రకృతిలో భాగమే కదా! ఈ అష్టప్రకృతిలో భాగమే కదా! మనస్సు, బుద్ధి, అహంకారములో భాగమే కదా.
కాబట్టి, దానిని దాటినటువంటి ప్రత్యగాత్మ స్థితిలోకి, ఎవరైతే వివేకం చేత, విచారణ చేత, విజ్ఞానం చేత దాటగలుగుతారో, వాళ్ళు మాత్రమే ఆ ప్రత్యగాత్మ స్థితిని తెలిసికొనగలుగుతున్నారు.
కార్యకారణ స్థితులను దాటాలి. కారణ శరీరాన్ని దాటాలి. కారణావస్థను దాటాలి. దాటి తురీయంలోకి ప్రవేశించి, తురీయనిష్ఠ కలిగి ఎవరైతే ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందుతారో, వాళ్ళు మాత్రమే ఈ ప్రత్యగాత్మను తెలుసుకుంటున్నారు.
- విద్యా సాగర్ స్వామి
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
10 Nov 2020
No comments:
Post a Comment