కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 128


🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 128 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. ఆత్మను తెలుసుకొను విధము - 58 🌻


శ్రోత్రాది ఇంద్రియములు జడములగుట చేత శబ్దాది విషయములను గ్రహించు శక్తి లేనివిగా యున్నవి. ఇంద్రియములకు అంతరముగా ఉన్నటువంటి, విజ్ఞానమే స్వభావముగా గల, ఆత్మమాత్రమే అన్నిటిని తెలుసుకొనుచున్నది. ఎట్లనగా ఆత్మతో కూడిన అంతఃకరణ వృత్తి బహిర్గతమై చక్షరింద్రయముల ద్వారా దశవిధరూపములను, జిహ్వేంద్రియముల ద్వారా షడ్రసములను, ఘ్రాణేంద్రియము ద్వారా చతుర్విధ గంధములను, త్వగీంద్రియము ద్వారా ద్వాదశ స్పర్శలను, శ్రోత్రము ద్వారా చతుర్విధ శబ్దములను, అటులనే విషయానందమును తెలిసికొనుచున్నది. ఈ దేహములో ఆత్మచైతన్యము ఉన్నంత వరకే ఇంద్రియములు విషయములను గ్రహించుచున్నవి.

ఆత్మచైతన్యము లేనప్పుడు, (మరణించినప్పుడు) ఇంద్రియములు వానివాని స్థానములలో ఉన్నప్పటికీ, విషయములను గ్రహించుట లేదు. కనుక అన్నిటిని తెలుసుకొనునది ఆత్మయే. ఆత్మ తెలుసుకొనుటకు శక్యము కాని వస్తువు ఏదియునూ లేదు. ధర్మాధర్మముల కంటే భిన్నమైన ఏ ఆత్మతత్వమును నీవు ఎరుంగ గోరితివో, దేవతలు సైతం దేని విషయమున సంశయగ్రస్థులైరో, అట్టి ఆత్మతత్వము ఇదియేనని తెలుసుకొనుము.

జ్ఞాత - జ్ఞాతుం ఇచ్ఛతి. జ్ఞాతకు ఉన్నటువంటి ఒకే ఒక లక్షణం - తెలుసుకొనుట. జ్ఞానము- జ్ఞాత్వాం ఇతి సర్వత్రం - మిగిలిన 24 లక్షణాలని, 24 తత్త్వాలని, 24 అంశాలని పిండాండ పంచీకరణ యందున్నటువంటి భావమును, అందించే ప్రయత్నాన్ని చేస్తున్నారు. జ్ఞాత చక్షురింద్రియము ద్వారా పని చేస్తున్నాడు అనుకున్నట్లయితే, ఆ యా దృశ్యములను గ్రహిస్తున్నాడు. అదే జ్ఞాత యొక్క ప్రభావం రసనేంద్రియము ద్వారా పనిచేసినప్పుడు, రుచులను సంగ్రహిస్తున్నాడు.

అదే జ్ఞాత ఘ్రాణేంద్రియము ద్వారా పని చేసినప్పుడు, ఆ ఘ్రాణము యొక్క వాసనలను ఆఘ్రాణిస్తున్నాడు. అదే జ్ఞాత స్పర్శేంద్రియమైనటువంటి త్వక్ ద్వారా పనిచేసినప్పుడు ఆ జ్ఞాత యొక్క ప్రభావము చేత త్వక్‌ - త్వగింద్రియము స్పర్శను తెలుసుకోగలుగుతున్నారు. శీతోష్ణములు, సుఖదుఃఖములు అనేక రకములైనటువంటి ద్వంద్వాది స్పర్శములను తెలుసుకోగలుగుతున్నాడు.

అయితే ఈ జ్ఞానేంద్రియములు అన్నీ కూడాను, స్వయముగా పనిచేయుచున్నవా? అనే విచారణ చేయకపోయినట్లయితే, కళ్ళు ఉన్నాయి కాబట్టి చూడగలుగుతున్నానని, చెవులు ఉన్నాయి కాబట్టి వినగలుగుచున్నానని, నోరుంది కాబట్టి తినగలుచున్నానని, ముక్కు ఉన్నది కాబట్టి వాసనను గ్రహించగలుగుతున్నానని, త్వగింద్రియము ఉన్నది కాబట్టి స్పర్శారూప సుఖదుఃఖాలను పొందగలగుచున్నాను అనేటటువంటి భావనలు కలుగుచున్నాయి.

కానీ నిజానికి ఆత్మచైతన్యం కనుక ఈ శరీరంలో వ్యాపకమై, వ్యవహారశీలం కాకపోయినట్లయితే, ఆత్మచైతన్యం యొక్క ఉనికి ఉండక పోయినట్లయితే, ఈ ఇంద్రియములన్నీ సమర్థవంతములు కావు. అవి నిలబడి ఉన్నప్పటికి, శరీరమునందున్నటువంటి ఇంద్రియములు ఆత్మచైతన్యం గనుక సహాయం చేయకపోయినట్లయితే, జ్ఞాత యొక్క సహాయం లేకపోయినట్లయితే, ఏ రకమైనటువంటి అనుభవాన్ని ఈయజాలవు. దీనికి ఉదాహరణ చెబుతున్నారు.

శవం. శవానికి అన్ని ఇంద్రియాలు ఉన్నాయి. లేనిది ఒక్క ఆత్మచైతన్యము మాత్రమే. మరి ఆ ఇంద్రియములు వేటిని గ్రహించడము లేదు కదా! కాబట్టి, ఈ గోళకములు కానీ, ఆ నాడీ వ్యవస్థ అయినటువంటి ఇంద్రియములు కానీ, దానికి ఆధారభూతమైనటువంటి, శబ్దస్పర్శాది రూపకమైన తన్మాత్ర సహిత జ్ఞానము కానీ, దాన్ని అనుసంధానపరిచేటటువంటి మనస్సు కానీ, దాన్ని నిశ్చయించేటటువంటి బుద్ధికానీ, ఇవన్నీ ఆత్మచైతన్యం చేతిలో పనిముట్లు.

ఇవన్నీ పంచభూతాత్మకమైనటువంటి మహతత్త్వము, అవ్యక్తములో భాగములు. అట్టి పంచభూతాత్మకమైనటువంటి శరీరము, వాటియందున్నటువంటి ఇంద్రియములు, వాటియందున్న గోళకములు, వాటియందు పనిచేయుచున్న శబ్దాది విషయజ్ఞానము, పంచతన్మాత్రల యొక్క ప్రభావము, ఇవన్నీ కూడా ఒక దానికంటే ఒకటి సూక్ష్మతరము, సూక్ష్మ తమమైనప్పటికి ఇవన్నీ ప్రత్యగాత్మ యొక్క చైతన్యం చేతనే ప్రవర్తిస్తూఉన్నాయి, వ్యవహరిస్తూఉన్నాయి.

తమకు తాము స్వయముగా వర్తింపజాలవు అనేటటువంటి నిర్ణయాన్ని, పంచీకరణని బాగా అధ్యయనం చేయడం ద్వారా నిరంతరాయముగా అనుసంధానం చేయడం ద్వారా, బాగా పరిశీలనం చేయడం ద్వారా, పరిశోధన చేయడం ద్వారా, అధ్యయనం చేయడం ద్వారా నిజజీవితంలో ఆ పిండాండ పంచీకరణని అన్వయం చేసుకోవడం ద్వారా తనకు తాను విరమించడం ద్వారా, తనను తాను తెలుసుకోవడం ద్వారా, తనదైనటువంటి స్వస్వరూప ఆత్మాసాక్షాత్కార జ్ఞాన స్థితిలో నిలకడ కలిగి ఉండడం ద్వారా మాత్రమే మానవుడు ఆత్మనిష్ఠను పొందగలుగుచున్నాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


11 Dec 2020

No comments:

Post a Comment