శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 197 / Sri Lalitha Chaitanya Vijnanam - 197


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 197 / Sri Lalitha Chaitanya Vijnanam - 197 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము 

దుష్టదూరా, దురాచార శమనీ, దోషవర్జితా |
సర్వజ్ఞా, సాంద్రకరుణా, సమానాధికవర్జితా ‖ 51 ‖


🌻197. 'సాంద్రకరుణా' 🌻

ఘనమైన కరుణ కలిగినది శ్రీమాత అని అర్థము.

ఘనమనగా ఘనీభవించినది, బరువైనది అని అర్థము. శ్రీమాత కరుణ సాంద్రత కలిగినది. ఆమె యందు కరుణ పటిష్ఠముగా యుండును. జీవులయందు కరుణకన్న కఠినత్వము ఎక్కువగా నుండును. కఠినము 'అపరిపక్వ' స్థితి. కరుణ 'పండిన' స్థితి. సాంద్ర కరుణ పరిపూర్ణముగ పండిన స్థితి.

కరుణ గలవాడే 'కలవాడు'. కరుణ లేనివాడు శ్రీమాత అనుగ్రహమునకు నోచుకొనలేడు. కరుణ హృద యమునకు సంబంధించిన గుణము. హృదయమున దైవసాన్నిధ్యము పెరుగుకొలది సహించుట, క్షమించుట, ప్రేమించుట, కరుణ చూపుట యుండును.

ఈ గుణములు తోటివారిని అవగాహన చేసుకొనుటలో ఏర్పడునవి. అవగాహన లేమియే కఠినత్వమునకు దారితీయును. కఠినత్వమున్నచోట తోటివారి కష్టనష్టములను గుర్తించుట యుండడు. తప్పు ఒప్పులను గమనించుటయే యుండును.

తప్పు ఒప్పులను చూచునది మనస్సు. వాని నవగాహన చేసుకొనునది హృదయము. హృదయము కలవారే ఇతరులను అవగాహన చేసుకొనగలరు. వారి కష్ట నష్టములలో భాగము పంచు కొనగలరు. ఓర్పుతోను, సహనముతోను బాధ్యతలను స్వీకరింప గలరు. ప్రేమతో ఆదరింప గలరు. తక్కువ సంస్కారమున్న వారిపై కరుణను ప్రసరింపజేయుదురు. క్షమ కలిగి యుందురు.

సర్వదేవతారాధనలూ హృదయమునకే గావింపుడని వాజ్మయము తెలుపుచున్నది. హృదయమున దివ్యత్వము అవతరించు చున్నకొలది భావము యందు, భాషణముల యందు, కర్మల యందు పరిపక్వత ఏర్పడును. జీవులలో చేదు పిందెల వంటివారు కొంద రుందురు. పెరిగి గట్టిపడి కాయలవలె ఉండువారు కొందరు, పండిన పండ్లవంటి వారు కొందరు. ఈ పరిణామము లన్నియూ హృదయమున జరుగును.

శ్రీమాత కరుణ వర్ణింప శక్యము కానిది. తెలిసిన వారియందు, తెలియనివారి యందు, శిష్యుల యందు, దుష్టులయందు ఆమె కరుణ ప్రసరింపజేయుచునే యుండును. అందరి అభివృద్ధియయే ఆమె కోరును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 197 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻Sāndrakaruṇā सान्द्रकरुणा (197) 🌻

She is compassionate. This is mainly because of being ‘the Divine Mother’. “She has more than any other, the heart of the universal Mother.

For Her compassion is endless and inexhaustible; all are to Her eyes Her children and portions of the One (meaning the universal Brahman).

Her rejections are only postponement; even Her punishments are a grace. But Her compassion does not blind Her wisdom or turn Her action from the course decreed (law of karma)”. These beautiful words are of Sri Aurobindo in his book ‘The Mother’.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹


02 Feb 2021

No comments:

Post a Comment