ఆ అనుభూతులే మరుజన్మకు విత్తులు


🌹. ఆ అనుభూతులే మరుజన్మకు విత్తులు 🌹

🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀

📚. ప్రసాద్ భరద్వాజ

అప్పుడప్పుడు మరణిస్తున్న వ్యక్తి చిట్టచివర నుంచి వెనక్కిరావడం జరుగుతుంది. ఉదాహరణకు, నీటిలో మునిగిపోయి అపస్మారక స్థితికి చేరుకుంటున్న వ్యక్తిని ఏదో విధంగా రక్షించినప్పుడు, అతడు చాలా ఆసక్తికరమైన ‘‘మృత్యుసమీప’’ అనుభవాలను చెప్పడం జరిగింది.

మరణిస్తున్నట్లు తెలిసిన చివరి క్షణంలో వారు పుట్టినప్పటి నుంచి ఆ క్షణం వరకు జరిగిన గతమంతా-అంత వరకు వారికి జరిగిన, గుర్తున్న గుర్తులేని, వారు గమనించిన, గమనించని వారి జ్ఞాపకాల పొరలలో ఉన్నట్లు వారికి కూడా తెలియని అనేక విషయాలతో కూడిన వివరాలన్నీ- వారికి అరక్షణంలో ఒక సినిమాలా కనిపించి, మెరుపులా మాయమవుతుంది.

అలా అంతా అరక్షణంలో ముగిసిపోతుంది. ఎందుకంటే, మరణించే చివరి క్షణంలో మూడు గంటల జీవిత చలనచిత్రాన్ని తీరికగా, పూర్తిగా చూసేందుకు సమయముండదు. ఒకవేళ చూసినా అంతగా ప్రాముఖ్యత లేని చిన్న చిన్న వివరాలతో కూడిన ఆ సినిమాను మీరు మీ జీవితానికి అన్వయించుకోలేరు. కానీ, కచ్చితంగా అది మీకు చాలా స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది. జీవిత అధ్యాయం ముగిసే ముందు మీ అనుభవాలన్నీ- మీ ఆశలు, ఆశయాలు, తీరని కోరికలు, బాధలు, చిరాకులు, ఆనందాలు- మీకు గుర్తుకొస్తాయి. దీనినే బుద్ధుడు ‘‘తన్హ’’అన్నాడు. భాషాపరంగా దాని అర్థం ‘‘కోరిక’’ అయితే, రూపకరమైన అర్థం ‘‘జీవిత లాలస’’ అని.

నిరాశలు, నిస్పృహలు, విజయాలు, ఓటమిలు, సాధనలు- ఇలాంటివన్నీ మీ జీవిత రంగంలోని కోరికలే. మరణిస్తున్న మనిషి మరికాస్త ముందుకు వెళ్ళే ముందు అవన్నీ అతనికి కచ్చితంగా గుర్తుకొస్తాయి. కనిపిస్తాయి. ఎందుకంటే, అతని శరీరం మాత్రమే నశిస్తోంది తప్ప, దానితోపాటు అతని మనసు, బుద్ధి నశించట్లేదు. కానీ, అతని మనసులో కలిగిన కోరిక మాత్రం అతని ఆత్మను అంటుకునే ఉంటుంది. అదే అతనికి రాబోయే జీవితాన్ని నిర్ణయిస్తుంది. అందుకే అతడు తీరని కోరికల తీరాలవైపు పయనిస్తాడు.

మీ జీవితం చాలా కాలం క్రితమే, అంటే, మీరు పుట్టడానికి ముందే, మీరు మీ తల్లి గర్భంలోకి ప్రవేశించక ముందే, ఇంకా చెప్పాలంటే, మీ గత జన్మ ముగిసేటప్పుడే ప్రారంభమైంది. ఒక అధ్యాయం ముగిసిన వెంటనే మరొక అధ్యాయం ప్రారంభమవుతుంది. తొంభై తొమ్మిది శాతం వర్తమాన జీవితం గత జన్మలో మీరు మరణించే చిట్టచివరి క్షణం నిర్ణయించినదే.

మీరు సేకరించిన వాటినే మీతో పాటు ఒక విత్తనంలా తెచ్చుకున్నారు. అది అనేక ఆటుపోటులను తట్టుకుంటూ పెద్ద వృక్షమై పువ్వులను, ఫలాలను ఇస్తుంది. వాటి నమూనాలన్నీ ఆ విత్తనంలోనే ఉన్నాయి. కానీ, అవి మీకు కనిపించవు. ఒకవేళ కనిపించినా వాటిని మీరు చదవలేరు. ఎందుకంటే, ఆ భాష మీకు తెలియదు.

కానీ, ఏదో ఒకరోజు విజ్ఞానశాస్త్రం ఆ విత్తనంలో నిక్షిప్తమై ఉన్న కార్యక్రమ ప్రణాళికను- దాని కొమ్మలు ఎలా ఉండాలి. ఎంత దూరం ఎలా వ్యాపించాలి. ఎప్పుడు పువ్వులు వికసించి ఫలాలుగా మారాలి, ఎంతకాలం బతకాలి, ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాలి లాంటి వివరాలన్నీ- మీరు చదవ గలిగేలా చేసే అవకాశముంది. ఎందుకంటే, జరగబోయే వివరాలన్నీ ఆ విత్తనంలోనే నిక్షిప్తమై ఉన్నాయి. మరణించే క్షణంలో మీరున్న స్థితే మీ పునర్జన్మను నిర్ణయిస్తుంది.

చాలామంది ఏదో మమకారంతోనే మరణిస్తారు. ఎందుకంటే, మరణించే క్షణంలో సరిగా జీవించలేదనే సత్యం వారికి తెలుస్తుంది. జీవితం ఒక కలలా కరిగిపోగానే మృత్యువు ముంచుకొస్తుంది. అప్పుడు జీవించేందుకు సమయం ఏమాత్రముండదు.

జీవించేందుకు అవకాశమున్న సమయంలో వారు అనేక పిచ్చి పనులుచేస్తూ కాలాన్ని వృథా చేశారే కానీ, ఏమాత్రం జీవించలేదు.

‘‘మీరేం చేస్తున్నారు?’’ అని చదరంగం, పేకాటరాయుళ్ళను అడిగినప్పుడు ‘‘వుయ్ ఆర్ కిల్లింగ్ టైం’’అంటారు. చిన్నప్పటి నుంచి నేను దానికి వ్యతిరేకిని. ఎందుకంటే, ‘‘టైం ఈజ్ కిల్లింగ్ దెమ్’’అన్న సంగతి వారికి తెలియదు.

ఒకసారి నేను చదరంగమాడుతున్న మా తాతయ్యతో ‘‘ముసలితనం మీద పడుతుంటే మీరు చేస్తున్న ఆ పనేమిటి?’’అన్నాను. వెంటనే ఆయన ‘‘అయామ్ కిల్లింగ్ ది టైం’’అన్నారు.

- ఇంకాఉంది.

🌹 🌹 🌹 🌹 🌹


02 Feb 2021

No comments:

Post a Comment