✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚
శ్లోకము 17
🍀 17. యుక్త ప్రవర్తన - మితమగు ఆహారము, విహారము, యుక్తమగు కర్మ, నిద్ర పాటించు యోగ సాధకునకు దుఃఖము లన్నియు హరింపబడి యోగము సిద్ధించును. ఆహార, నిద్ర, నియమములతో పాటు విహారము, కర్మాచరణము కూడ జోడింపబడినవి. అపుడే యోగసాధన సిద్ధించు అవకాశము కలదు. . దేహబంధము, బాహ్య బంధము కలుగ కుండవలె నన్నచో విచక్షణతో సర్వమును నియంత్రించుకొన వలెను. అట్టి విచక్షణా బుద్ధిని తన యందు బలపరచమని దైవమును అంతరంగమున ప్రార్థించవలెను. సద్గుణము లున్నచోటనే తెలివి సమయమునకు పనికి వచ్చును. సద్గుణములు కలుగుటకు సకల సద్గుణ సంపన్నుడగు దైవము నారాధించుటే మార్గము. 🍀
యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు |
యుక్త స్వప్నా వబోధస్య యోగో భవతి దు:ఖహా || 17
మితమగు ఆహారము, విహారము, యుక్తమగు కర్మ, నిద్ర పాటించు యోగ సాధకునకు దుఃఖము లన్నియు హరింపబడి యోగము సిద్ధించును. ఆహార, నిద్ర, నియమములతో పాటు విహారము, కర్మాచరణము కూడ జోడింపబడినవి. అపుడే యోగసాధన సిద్ధించు అవకాశము కలదు. జీవితమున బహిరంగ కార్యక్రమములు కర్మను బట్టి బంధించు అవకాశమెంతైన కలదు.
మన పనులు, చేష్టలు, విహారములు, వ్యవహారములు సరిగ నిర్వర్తించనపుడు జీవుడు బాహ్య ప్రపంచమున బంధితుడగును. ఆహారము, నిద్ర విషయముల యందు నియమములు పాటింపనపుడు అనారోగ్యము కలిగి దేహము బంధించును. దేహబంధము, బాహ్య బంధము కలుగ కుండవలె నన్నచో విచక్షణతో సర్వమును నియంత్రించుకొన వలెను. అట్టి విచక్షణా బుద్ధిని తన యందు బలపరచమని దైవమును అంతరంగమున ప్రార్థించవలెను.
యుక్తమగు ఆహారము, యుక్తమగు విహారము, యుక్తమగు వ్యవహారము, యుక్తమగు నిద్ర ఇవి ప్రతినిత్యము గమనించు కొనుచుండవలెను. ఈ విషయమునందు అశ్రద్ధ యుండరాదు.
బాహ్యమున సాధకుడు ప్రవర్తించు తీరు నుండి చిక్కులు కొనితెచ్చుకొనుట జరుగుచుండును. ఇది సర్వసామాన్యము. తన స్వభావమునందుగల కోరికలు, సంఘమునందలి పోకడలు తనకు అందివచ్చు అవకాశములు సాధకుని యుక్తముకాని విషయములలోనికి ప్రోత్సహించును.
తనకు గాని విషయమున తాను తలదూర్చుట వలన క్రొత్త చిక్కులను తెచ్చుకొనును. జన్మతః
ఉన్న చిక్కులను అనగా ప్రారబ్ధమును నిర్వర్తింపకపోగ మరికొంత జోడగు చుండును. ఒక చిక్కును తొలగించు కొనబోయి పది చిక్కులలో పడుట సాధారణముగ జరుగుచుండును. ఇది పనికిమాలిన తెలివి. తెలివితేటల వలన మాత్రమే చిక్కులను తొలగించుకొన లేము. సద్గుణములున్న చోటనే తెలివి సమయమునకు పనికి వచ్చును.
సద్గుణములు కలుగుటకు సకల సద్గుణ సంపన్నుడగు దైవము నారాధించుటే మార్గము కాని, అడ్డదారులు ఉపయోగ పడవు. దుఃఖము కలుగక యోగము సాగవలె నన్నచో కష్టమైనను, నష్టమైనను ఈ శ్లోకమున చెప్పినవి పాటింపవలెను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
23 Mar 2021
No comments:
Post a Comment