శ్రీ శివ మహా పురాణము - 374


🌹 . శ్రీ శివ మహా పురాణము - 374 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 11

🌻. హిమవంతునితో శివుని సమాగమము - 2 🌻


హే భక్తజనవత్సలా! నీ ఆనందము బాహ్య విషయ భోగమునందు లేదు. త్రిగుణాత్మకమగు మాయ నీ అధీనమునందుండును. పరబ్రహ్మ పరమాత్మ వగు నీకు నమస్కారము (16).

నీవు విష్ణు బ్రహ్మ స్వరూపడవు. విష్ణు బ్రహ్మాదులు నిన్ను సేవింతురు. విష్ణు బ్రహ్మలకు ఆనందము నిచ్చునది నీవే. నీకు భక్తి ప్రియమైనది. నీకు నమస్కరామగు గాక! (17). తపస్సుపై నీకు ప్రీతి మెండు. నీవు తపోనిధివి. భక్తుల మంచి తపస్సునకు ఫలమునిచ్చునది నీవే. నీవు శాంతుడవు. పరబ్రహ్మవగు నీకు నమస్కారము (18).

నీవు సగుణ రూపములో సర్వేశ్వరుడవై లోకాచారములను ప్రవర్తిల్ల జేయుచూ, వాటిని నీవు స్వయముగా ఆచరించెదవు. పరమాత్మవగు నీకు నమస్కారము (19). ఓ మహేశ్వరా! సాధువులకు సుఖములనిచ్చు నీ లీలను తెలియుట శక్యము కాదు. నీవు భక్తుల వశములో నుండి వారికి అనుకూలమగు కర్మలను చేయుచూ, వారికి ఆత్మరూపుడవై ఉన్నావు (20).

హే ప్రభో! నీవు ఇచటకు విచ్చేయుట నాకు మహా భాగ్యము. దీనవత్సలుడవని వర్ణింపబడు నీవు నన్ను నీ రాకచే సనాథుని చేసినావు (21). ఈనాడు నా పుట్టుక సఫలమైనది. నా జీవనము సఫలమైనది. నీవిచటకు వచ్చుటచే నాకు చెందిన సర్వము సఫలమైనది (22).

ఓ మహేశ్వరా! నేను నీ దాసుడనని యెరుంగుము. నిస్సంకోచముగా నన్ను ఆజ్ఞాపించుము. నేను మరియొక తలంపు లేనివాడనై గొప్ప ప్రీతితో నీ సేవను చేసెదను (23).

బ్రహ్మ ఇట్లు పలికెను-

మహేశ్వరుడు పర్వత రాజు యొక్క ఈ మాటలను విని, కన్నులను కొద్దిగా తెరచి, పరివార సమేతుడగు హిమవంతుని గాంచెను (24). జగత్ప్రభువు, ధ్యానయోగమునందున్నవాడు అగు వృషధ్వజుడు పరివారముతో గూడి అట్లు సవినయముగా నిలబడియున్న పర్వత రాజును గాంచి, ఆశ్చర్యమును చెందిన వాడు వోలె ఇట్లు పలికెను (25).

మహేశ్వరుడిట్లు పకిలెను-

నేను నీ శిఖరముపై ఏకాంతముగా తపస్సును చేయుటకు వచ్చియుంటిని. నా సమీపమునకు ఎవ్వరైననూ రాని విధముగా ఏర్పాటు చేయుము (26). నీవు మహాత్ముడవు. తపస్సును చేయు అనేక మునులకు నీవు చక్కని ఆశ్రయమై ఉన్నావు. మరియు, దేవతలు, రాక్షసులే గాక ఇతరులగు మహాత్ములు (27), బ్రాహ్మణులు మొదలగు వారు సర్వదా నీయందు నివసించియున్నారు. గంగా జలముచే నీవు నిత్య శుద్ధుడవు. పర్వతములన్నింటికీ రాజగు నీవు పరోపకారమును చేయు ప్రభుడవు (28). నేనీ గంగావతరణ క్షేత్రములో తపస్సును చేసెదను. ఓ పర్వతరాజా! నేను జితేంద్రియుడనై మిక్కిలి ప్రీతితో నిన్ను ఆశ్రయించినాను (29).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


23 Mar 2021

No comments:

Post a Comment