🌼. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 3 🌼
సంకలనం : వేణు మాధవ్
📚. ప్రసాద్ భరద్వాజ
🌸. మహాపూర్ణవాణి 🌸
🥀. సంసారికి మోక్షం లేదు. ఇది తిరుగులేని సిద్ధాంతం, అయితే దీని భావం గృహస్థుకు మోక్షం లేదని కాదు. సంసారం అంటే భార్యాపిల్లలూ అని కాదు అర్థం.
సంసారం అంటే కోరికలు. కోరికలు ఉన్న వానికి మోక్షం లేదు. బాహ్యానికి గృహస్థుడుగా ఉన్నప్పటికీ కోరికలు లేకుండా ఉండగలిగితే వాడు సంసారికాడు.
వానికి మోక్షం కరతలామలకమే. బాహ్యానికి సన్న్యాసిగా ఉన్నప్పటికీ వానికి ఏమాత్రమైనా కోరికలుంటే వానికి మోక్షం గగనకుసుమమే. వాడు సన్న్యాసీ కాడు, గృహస్థుడూ కాడు, సామాన్య సంసారీ కాడు భ్రష్టుడు.
🥀. మడి కట్టుకున్నాను అనీ, ఎవరైనా తగిలితే మైలపడిపోతున్నావు అంటున్నావు కదా, ఇతరులు తాకినంత మాత్రాన మైలపడే నీ మడిలో పటుత్వం ఏమి ఉంది!
నీదే కనుక పటుత్వం ఉన్న మడి అయితే, నిన్ను తగిలిన వారంతా మడిపడాలి గాని, నీవు మైల పడరాదు. అంత పటుత్వమైన మడి నీలో ఉన్నది. అది నీవు గ్రహించుకోవటం లేదు.
హృదయాన్ని ఎప్పుడూ ప్రసన్నంగా ఉంచుకో! అందరినీ అన్నిటినీ నీ ఇష్టదైవం యొక్క మారు రూపాలుగా గుర్తించు-చాలు. ఇదే అసలైన పటుత్వం గల మడి.
ఇలా చెప్పాను గదా అని ఇక స్నానం చేయటం మానివేస్తావేమో, స్నానమూ మానరాదు, శాస్ర్తమూ, పెద్దలు విధించిన సత్కర్మలూ మానరాదు. సిద్ధి కలిగే వరకూ అవి చేస్తూ ఉండవలసినదే. కాని కేవలం బాహ్యకర్మలతోటే మడి, పవిత్రతా వస్తాయని మాత్రం భ్రమపడబోకు.
🥀. మడీ, పవిత్రతా గుణముల చేతనే రావాలి.
🌸 🌸 🌸 🌸 🌸
23 Mar 2021
No comments:
Post a Comment