శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 235 / Sri Lalitha Chaitanya Vijnanam - 235


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 235 / Sri Lalitha Chaitanya Vijnanam - 235 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

🍀 58. చతుఃషష్ట్యుపచారాఢ్యా, చతుష్షష్టి కళామయీ ।
మహా చతుష్షష్టి కోటి యోగినీ గణసేవితా ॥ 58 ॥🍀

🌻 235. 'చతుషష్ట్యుపచారాఢ్యా'' 🌻

అరువది నాలుగు ఉపచారములతో పూజింపబడునది శ్రీమాత అని అర్థము. శ్రీవిద్యా ఉపాసకులు వారికి గల భక్తి విశేషముచే విస్తారమగు ఉపచారము చేయుచుందురు. షోడశి యగు శ్రీమాతను షోడశ ఉపచారములతో ఆరాధించుట పరిపాటి. ఇంకను వివరముగ ఆరాధించుటకు ఉపచారములు పేర్కొనబడినవి. 116 ఉపచారము లతో కూడిన ఆరాధనలు కూడ కలవు. 64 ఉపచారముల ఆరాధన తెలియగోరువారు 'పరివశ్యా రహస్యము' అను గ్రంథమునందు పరిశీలించవచ్చును లేదా శ్రీవిద్యా ఉపాసకులను సంప్రదించవచ్చును.

అరువది నాలుగు సంఖ్యకు ప్రాధాన్య మున్నది. చంద్రుని పదహారు కళలు ఒక పక్షము. అట్టి రెండు పక్షము లొక మాసము. అట్టివి రెండు మాసము లొక ఋతువు. వెఱసి ఒక ఋతువున అరువది నాలుగు తిథులు లేక కళలు కలుగును. ఋతుకాల దీక్ష అరువది నాలుగు తిథులు సాగును. ఇందు నాలుగుమార్లు పదహారు తిథులు వర్తించును. రెండుమార్లు ఆరోహణము, అవరోహణము జరుగును.

ఈ క్రమముల ననుసరించి ప్రతిపత్తి (పాడ్యమి) నుండి రాకాంత (పౌర్ణమి తిథి చివరి వరకు) వరకు శ్రీదేవి కళలను ఆరోహణ క్రమమున మూలాధారమునుండి సహస్రారమునకు అవరోహణ క్రమమున సహస్రారము నుండి మూలాధారము వరకు దర్శింప నగును. ఈ క్రమమున అష్టమి కళ యోగసిద్ధిని ప్రదర్శించును. ఆరోహణ క్రమమున శ్రీమాత తత్త్వములోనికి ప్రవేశించి, అవరోహణ క్రమమున అమ్మ ప్రణాళిక నవతరింప చేయుట కూడ సిద్ధులు చేయుచుందురు.

ఒక ఋతువు సంవత్సరమున ఆరవ భాగము. ఆరు ఋతువులు పై విధమగు దీక్షతో ఆరాధన చేయువారికి షట్చక్రములు ప్రభావిత మగును. ఇట్లు కాల విభాగమును అనుసరించుచు తదనుగుణమగు ఉపచారములు చేయుచు ఆరాధనను చేయుట ఋషులందించిన మార్గము.

డెబ్బది రెండు ఉపచారములతో కూడ ఇదే విధమగు ఆరాధనను కూడ ఋషు లందించిరి. అపుడు సంవత్సర చక్రము ఐదు భాగములుగ విభజింపబడును. సృష్టి అంతయు పంచీకరణము చెంది యున్నదని పంక్తి (ఐదు) రహస్యము తెలిసిన వారికి సర్వము తెలియుననియు కూడ నున్నది.

"పాంక్తంవా ఇదగ్ం సర్వం పాంకేనైవ పాంకగ్ం స్పుృణోతీతి" పంచమ వేదమగు మహా భారతము, అందు పంచపాండవుల కథలలో ఈ రహస్యము యిమిడి యున్నది. ఇట్టి రహస్యము లన్నియూ భక్తితో, దీక్షతో ఆరాధన చేయువారికి అవగాహన మగునవియే కాని కేవలము మస్తిష్కము నుపయోగించి తెలుసుకొనజాలము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 235 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 Chatuḥ-ṣaṣṭyupacārāḍhyā चतुः-षष्ट्युपचाराढ्या (235) 🌻

She is worshipped with sixty four (chatuḥ-ṣaṣṭi) types of metaphorical expressions, which are called upacāra-s.

For example offering Her scents, flowers, bangles, fanning Her, etc. Sixty four such offerings have been prescribed for Her. This nāma talks about the pūja ritual.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹


13 Mar 2021

No comments:

Post a Comment