శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 241 / Sri Lalitha Chaitanya Vijnanam - 241
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 241 / Sri Lalitha Chaitanya Vijnanam - 241 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
🍀 59. మనువిద్యా, చంద్రవిద్యా, చంద్రమండలమధ్యగా ।
చారురూపా, చారుహాసా, చారుచంద్ర కళాధరా ॥ 59 ॥🍀
🌻 241. 'చారురూపా' 🌻
అందమైన రూపము కలది శ్రీదేవి అని అర్థము. సృష్టి అందములు శ్రీమాత రూపమే. అందము ఆనందము కలిగించును. అందము ఆకర్షణ కలిగించును. ఆకర్షణము వలన మనస్సు అందముపై నిలచును. పరిపరి విధములుగ పోవు మనస్సు నకు స్థిరము కల్పించుటకు అందము ఒక ఉపాయముగ ఋషులు దర్శించినారు. అందము, ఆకర్షణ మనోహరమగు స్థితిని కలిగించును. మనస్సు హరింపబడుటయే మనోహరత్వము. మనస్సు హరింపబడి నపుడు బాహ్య ప్రపంచ మదృశ్యమగును.
అపుడా అందము రూపము లను దాటి రూపాతీతమైన వెలుగు నందు స్థిరపడును. వెలుగున స్థిరబడుట యనగా బుద్ధి యందు స్థిరపడుటయే. బుద్ధి యందు స్థిరపడ్డ చిత్తము దైవావరణ యందున్నట్లే. హిరణ్య ప్రాకారములో నున్నట్లే.
ఈ కారణముననే అందము నుపాసించు వారు త్వరితగతిని మనోహర స్థితిని పొంది బుద్ధి లోకమున స్థిరపడినట్లుగ ఎన్నియో పురాణ గాథ లున్నవి. మొదటగ ఉపాధి (రూపము) యందు అందమును ఉపాసించువారు అందము ఆధారముగనే ఉపాధిని మన్నించు చున్నారు కదా!
అందము అదృశ్యమైనచో ఉపాధిని అంతగ మన్నించరు కదా! అందమైన పువ్వు వాడినప్పుడు జరుగుచున్నదేమి? అందము ఉపాధిని వీడినది.
ఆరాధింపబడు చున్నది అందము గనుక వాడిన పువ్వును మన్నింపరు. అట్లే స్త్రీ పురుష రూపములు, ఇతర రూపములు. ఉపాధి అందము కన్న లోతులలో గుణ సంపద అందముగ నుండును. సద్గుణ సంపదకు ఆకర్షింపబడుట కూడా అందమునకు ఆకర్షింపబడుటయే. పరిణామమున గుణ సంపద అందమును రుచి చూచిన వారు సద్గుణముల నారాధింతురు.
బాహ్య రూపమందముగ నుండి గుణము లందముగ లేనిచో అట్టివారిని ప్రేమించలేము. అసురులు అమితమైన అందము కలవారు. కాని వారిని ప్రజలు ప్రేమించరు. పై అందము నుండి లో అందములోనికి చేరుట పరిణామ దశ. గుణముల అందముకన్న వాని నధిష్ఠించియున్న జీవుని అందము కొన్ని వందల రెట్లు ఎక్కువ. పరిణామ క్రమమున గుణములను చూడక జీవులనే చూచువారు అందరినీ ప్రేమింతురు.
జీవుడు సహజ సౌందర్యము కలవాడు. అతడు సహజముగ చతుర్భుజుడు. దివ్యరూపి. యోగు లందరియందు ఆ దివ్య రూపమునే దర్శించుటచే వారు అమితానందమును పొందుచు నుందురు.
ఇట్లు అందమును ఆరాధించుట వలన రూపము, గుణము, జీవము, దైవము అను సోపానక్రమమున ఉపాసకుడు సిద్ధి పొందగలడు. శుక్ర విద్యయందీ రహస్యములు కలవు. మరణము దాటుటకు కూడ ఈ విద్య ఉపకరించును. శ్రీమాత అన్ని స్థితుల యందు అందముగనే యుండును.
ఆమె రూపము అందమైనది. గుణము అందమైనది. సాన్నిధ్యము మనోహరము. ఆమె కురుల నుండి పాదముల వరకు ఎంత అందమైనదో ముందు నామములలో తెలుపబడినది. ఆ రూపమును, ఆ అందమును తదేక దీక్షతో ఆరాధన చేసినచో పై తెలిపిన సోపానము లన్నియును శీఘ్రగతిని ఆరోహణము చేయవచ్చును.
శ్రీదేవి, శ్రీ మహా విష్ణువు, శ్రీ కృష్ణుడు ఇత్యాది రూపము లన్నియూ ఆరాధన చేయుట మన సంప్రదాయము. ఈ ఆరాధనమున మనోహరత్వము సులభముగ కలుగును. శాంతమైన ఆకారము, ప్రసన్నమైన వదనము, చిరుదరహాసము కల విగ్రహములనే ఆరాధనము చేయవలెను. అప్పుడు మనోవికారములు హరింపబడును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 241 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Cāru-rūpā चारु-रूपा (241) 🌻
She is the beauty incarnate. Cāru means pretty.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
26 Mar 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment